Read more!

సోనియాపై అమెరికా కేసు క్లోజ్!

 

అధికారం పోయిన దిగులులో వున్న సోనియాగాంధీకి కొంచెం రిలీఫ్ వచ్చింది. సోనియాగాంధీ మీద అమెరికాలో నమోదైన కేసును అక్కడి కోర్టు కొట్టేసింది. 1984లో ఢిల్లీలో జరిగిన సిక్కుల ఊచకోతకు సంబంధించి సోనియా గాంధీకి కూడా భాగస్వామ్యం వుందని పలు ఆరోపణలు చేస్తూ సిక్కుల హక్కుల సంస్థ సోనియాగాంధీ మీద అమెరికా కోర్డులో కేసు దాఖలు చేసింది. సోనియాగాంధీ క్యాన్సర్ చికిత్స కోసం అమెరికా వెళ్ళినప్పుడు ఈ కేసు విచారణకు వచ్చింది. ఆ తర్వాత సోనియాగాంధీకి సంబంధించిన పాస్‌పోర్టు వివరాలు, ఆమె ఎక్కడెక్కడికి ప్రయాణించిందనే వివరాలు ఇవ్వాలంటూ ఆమధ్య అమెరికా కోర్డు సోనియాని ఆదేశించింది. దానికి సోనియా తన పాస్‌పోర్టు వివరాలు ఇవ్వలేనని, అది తన భద్రతకు ఇబ్బందికరంగా పరిణమించే అవకాశం వుందని బదులు ఇచ్చారు. ఈ కేసు సోనియాని బాగా ఇబ్బంది పెట్టే అవకాశం వుందని చాలామంది భావించారు. అయితే ఇప్పుడీ కేసును కొట్టివేస్తూ అమెరికా కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ కేసు విషయంలో సరైన ఆధారాలు లేనందున కేసు కొట్టివేస్తున్నట్టు న్యాయమూర్తి చెప్పారు.