మహారాష్ట్ర హోం మంత్రి నోటిదురద!
posted on Jun 11, 2014 @ 6:39PM
ఉత్తర ప్రదేశ్‌లో ఇద్దరు అక్కాచెల్లెళ్ళని కొంతమంది దుండగులు మానభంగం చేసి చెట్టుకి ఉరివేసి చంపిన ఘటన జరిగినప్పటి నుంచి ఉత్తర ప్రదేశ్‌లో మానభంగాల పరంపర జరుగుతూనే వుంది. మానభంగాల పరంపర సంగతి అలా వుంచితే, మానభంగాల మీద పలువురు రాజకీయ నాయకులు చేస్తున్న కామెంట్లు కడుపు మండేలా చేస్తున్నాయి. మానభంగాలు జరగని రాష్ట్రం ఏదైనా వుందా అని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ చాలా కాజువల్‌గా అనేశాడు. దాన్ని చూసి చాలామంది రాజకీయ నాయకులు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఉత్తర ప్రదేశ్‌కి చెందిన అధికార పార్టీ నాయకులు మానభంగాల అంశంలో మహిళలదే తప్పన్నట్టుగా మాట్లాడారు. ఇది చూసి ఇరుగు పొరుగు రాష్ట్రాలకు చెందిన నాయకులు కూడా నోటికొచ్చిన కామెంట్లు చేస్తున్నారు. తాజాగా మహారాష్ట్ర హోం మంత్రి ఆర్.ఆర్.పాటిల్ మరో వివాదాస్పద వ్యాఖ్య చేశాడు. ఆయన నోటి దురద ప్రకారం మానభంగాలని ఆపడం ఎవరి తరం కాదు. ఇంటికో పోలీసుని కాపలాగా పెట్టినా అత్యాచారాలు ఆపలేమట. అంతే కాకుండా అత్యాచారాలు పెరగడానికి మహిళల అశ్లీల చిత్రాలే కారణమట. ఆర్.ఆర్. పాటిల్ చేసిన ఈ విచిత్రమైన కామెంట్ల మీద కూడా దుమారం రేగుతోంది.