ఆడలేక మద్దెలు ఓడు అంటే ఎలా సోము వీర్రాజు గారూ!
posted on Mar 3, 2023 9:20AM
ఆడలేక మద్దెలు ఓడు అన్నట్లుగా తయారైంది సోము వీర్రాజు పరిస్థితి. ఏపీలో అసలే అంతంత మాత్రంగా ఉన్న బీజేపీని పూర్తిగా కనుమరుగు చేయడమే లక్ష్యమా అన్నట్లుగా వ్యవహరిస్తున్న ఆయన తీరు పట్ల సహజంగానే పార్టీలో అసంతృప్తి, అసమ్మతి పెచ్చరిల్లాయి. ఆయన ఒంటెత్తు పోకడలను భరించ లేక ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పార్టీకి గుడ్ బై చెప్పి తెలుగుదేశం గూటికి చేరిపోయారు. అదే దారిలో మరింత మంది ఉన్నారన్న వార్తలూ విస్తృతంగా వినవస్తున్నాయి.
అలా పార్టీకి గుడ్ బై చెప్పే వారిలో రాష్ట్ర విభజన తరువాత వచ్చి చేరిన వారే కాకుండా మొదటి నుంచీ పార్టీని అంటిపెట్టుకుని ఉండి పని చేసిన వారూ ఉన్నారంటున్నారు. అంతే కాకుండా బీజేపీలో గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రం నుంచి ఒక ప్రతినిథి వర్గం హస్తినకు వెళ్లి మరీ సోము వీర్రాజుపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేసింది. దీనిని సీరియస్ గా తీసుకున్న బీజేపీ హైకమాండ్ వెంటనే పార్టీ రాష్ట్ర వ్యవహారల ఇన్ చార్జ్, కేంద్ర మంత్రి మురళీధరన్ ను రాష్ట్రానికి పంపింది. ఆయన నేరుగా రాజమహేంద్ర వరం వచ్చి పార్టీ నేతలతో బేటీ అయ్యారు. ఈ భేటీలో కూడా సోము వీర్రాజుపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అన్నిటినీ సావధానంగా విన్న ఆయన అధిష్ఠానానికి నివేదిస్తానని చెప్పారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో ట్విస్ట్ ఏమిటంటే మురళీదరన్ కు సోము వీర్రాజు ముఖం చాటేయడం. అయితే సోము వీర్రాజు పార్టీ అధిష్ఠానానికి రాష్ట్ర పార్టీ పరిస్థితిపై ఓ లేఖ రాశారు.
అందులో ఆయన పేర్కన్న అంశాలను గమనిస్తే సోము వీర్రాజు ఆడలేక మద్దెలు ఓడు అంటున్నట్లుగా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆ లేఖలో సోము వీర్రాజు రాష్ట్రంలో పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టు నాగం భోట్లు అన్నట్లుగా తయారు కావడానికి కారణం తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబు అని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అధికారంలో లేదు.. అధికారంలో ఉన్న పార్టీతో సోము వీర్రాజు అంటకాగుతున్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర పార్టీ బలహీనం కావడానికి విపక్ష నేత కారణం అంటూ సోము వీర్రాజు అధిష్ఠానానికి లేఖ రూపంలో చెప్పడాన్ని సొంత పార్టీ శ్రేణులే ఆక్షేపిస్తున్నాయి. పొరుగు రాష్ట్రంలో అంటే తెలంగాణలో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అక్కడి అధికార పార్టీ బీఆర్ఎస్ తో ఢీ అంటున్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతున్నారు. నిర్బంధాలను ఎదుర్కొంటున్నారు. అయినా అక్కడ బీజేపీ బలపడుతోంది. ఇక్కడు సోము వీర్రాజు అందుకు పూర్తి బిన్నంగా వ్యవహరిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం, ఆ పార్టీ అధినేత చంద్రబాబు వల్లే రాష్ట్రంలో పార్టీ బలహీనపడుతోందంటూ సోము వీర్రాజు అధిష్ఠానానికి లేఖ రాయడాన్ని బీజేపీ శ్రేణులే ఎద్దేవా చేస్తున్నాయి. విపక్షంలో ఉన్న ఈ నాలుగేళ్ల కాలంలోనూ తెలుగుదేశం ఎన్నడూ బీజేపీకి వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడింది లేదు. కేంద్రం రాష్ట్రానికి ఇవ్వాల్సినవేవీ ఇవ్వకయినా అందుకు మోడీనీ, కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుపట్టకుండా.. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీపైనే విమర్శలు గుప్పిస్తోంది. రాష్ట్రపతి ఎన్నికలలో బీజేపీ అడగకపోయినా మద్దతు ఇచ్చింది. కేంద్రం పార్లమెంటులో ప్రవేశ పెట్టిన ప్రతి బిల్లుకూ మద్దతు ఇచ్చింది. అటేవంటి టీడీపీ ఏపీలో బీజేపీ ఎదగకపోవడానికి కారణం ఎలా అవుతుందని బీజేపీ శ్రేణులే ప్రశ్నిస్తున్నాయి.
ఏపీలో ప్రభుత్వ అవినీతిపై చార్జిషీట్ దాఖలు చేయాలని స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశించినా సోము వీర్రాజు నేతృత్వంలోని పార్టీ రాష్ట్ర శాఖ ఇప్పటికీ ఆ పని చేయలేదు. ఇలా లోపాలన్నీ తన వైపు పెట్టుకుని సోము వీర్రాజు తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలను అడ్డుకుంటోందనడం ఆడలేక మద్దెలు ఓడు అనడం కాకుండా మరేమిటని బీజేపీ రాష్ట్ర శ్రేణులే ప్రశ్నిస్తున్నాయి.