విపక్షాల ఐక్యత ఎండమావేనా?.. తృణమూల్ ఒంటరి పోరు ప్రకటన సంకేతం అదేనా?
posted on Mar 3, 2023 @ 11:15AM
వచ్చే సార్వత్రిక ఎన్నికలలో విపక్షాల ఐక్యత అన్నది ఎండమావేనా అంటే.. జాతీయ స్థాయిలో పార్టీల ఐక్యత విషయంలో జరుగుతున్న పరిణామాలును గమనిస్తే ఔననే అనాల్సి ఉంటుంది. విపక్షాల ఐక్యతా యత్నాలు ఒక అడుగు ముందుకు రెండడుగుల వెనక్కు అన్నట్లుగా సాగుతున్నాయి. ఎన్నికలకు ముందే కూటమిగా ఏర్పడటమా? ఎన్నికల అనంతర పొత్తులకు మొగ్గు చూపడమా అన్న అంశంలో ఏ పార్టీ దారి ఆ పార్టీదే అన్నట్లుగా ఉంది. సరే అది పక్కన పెడితే.. 2024 సార్వత్రిక ఎన్నికలలో తమ పార్టీ పొత్తులు లేకుండా ఒంటరిగానే బరిలోకి దిగుతుందని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ లోని సర్దిఘి నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయం సాధించింది. ఇక్కడ తృణమూల్ అభ్యర్థి పరాజయం పాలయ్యారు.
అయితే ఈ కాంగ్రెస్, వామపక్షాలు, బీజేపీ అన్నీకుమ్మక్కై తృణమూల్ అభ్యర్థిని ఓడించారన్నది మమత ఆరోపణ. ఆ మూడు పార్టీలూ మతం కార్డు ఉపయోగించాయన్నారు. ఏక్కడైనా ఎప్పుడైనా సరే బీజేపీతో అవగాహన ఉన్న పార్టీలతో కలిసి తృణమూల్ పని చేయదనీ, అందుకే వచ్చే సార్వత్రిక ఎన్నికలలో తృణమూల్ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని మమతా బెనర్జీ కుండ బద్దలు కొట్టేశారు. దీంతో విపక్షాల ఐక్యతకు ఆదిలోనే హంసపాదు పడిందని చెప్పవచ్చు. ప్రతిపక్షాల ఐక్యత, థర్డ్ ఫ్రంట్ అంటూ పలు ప్రాంతీయ పార్టీలు రాజకీయ సందడి చేస్తుంటే మమతా మాత్రం తనదారి వేరని కుండబద్ధలు కొట్టారు. ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల్లో దారుణైన ఓటమిపాలైన దీదీ, త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ ఎన్నికల మరుసటి రోజే ఈ కీలక ప్రకటన చేయటం విశేషం. ఈసారి ఎన్నికల్లో తమ పొత్త కేవలం ప్రజలతోనే ఉంటుందని ఏ ఇతర పార్టీతో ఉండదని దీదీ చెప్పారు. 2024 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఓడించాలి, మోడీని గద్దె దించాలి. కురువృద్ద కాంగ్రెస్ పార్టీ అధినాయకురాలు సోనియా గాంధీ మొదలు, నిన్న మొన్ననే జాతీయ రాజకీయాల్లో అడుగు పెట్టిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వరకూ బీజేపీ ప్రత్యర్ధి పార్టీల నాయకులు అందరిదీ అదే మాట.
అయితే అందుకోసం అందరూ ఒక్కతాటిపైకి వచ్చే విషయంలోనే ఎవరిలోనూ ఏకాభిప్రాయం కుదరడం లేదు. బీజేపీని గద్దె దించాలన్న లక్ష్యంతోనే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ‘భారత్ జోడో’ యాత్ర చేశారు. ఆ లక్ష్యంతోనే వామపక్షాలు ఎవరితో అంటే వారితో చేతులు కలిపేందుకు ఎవర్ రెడీ అంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారు. శరద్ పవార్, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రివాల్ ఇలా ఎవరి శక్తి మేరకు వారు ప్రయత్నిస్తున్నారు. ఎవరికి వారుగా వ్యూహరచనలు చేసుకుంటున్నారు. మరోవంక ఇప్పటి వరకూ బీజీపే వ్యతిరేక పార్టీల నేతలందరినీ రింగ్ మాస్టర్లా ఆడిస్తూ వచ్చిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఇక బయటి వారికి వ్యూహాల విక్రయ వ్యాపారం ఆపేసి బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా రాజకీయ రంగ ప్రవేశం చేసి తన దారిన తాను బీహార్ లో పాదయాత్ర చేసుకుంటున్నారు. సరే 2024 సార్వత్రిక ఎన్నికలు ఇంకా ఏడాదిన్నర పైగా సమయం ఉంది. ఈ లోగా తొమ్మిది రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతాయి..
వాటి ఫలితాలను బట్టి విపక్ష ఐక్యతకు సారథ్యం ఎవరన్నది లేల్చుకోవచ్చు అనుకుంటే.. ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. ఆ ఫలితాలు విపక్షాల ఐక్యతా యత్నాలకు ఆదిలోనే గండి కొట్టాయి. ఇంకా ఈ ఏడాది మరో ఆరు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగాల్సి ఉన్నా.. ఈశాన్య రాష్ట్రాల ఫలితాలతో కాంగ్రెస్ సారథ్య రేసులో వెనుకబడిపోయందనే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి విపక్షాలు ఏకతాటి మీదకు రావడం అంటే ఏదో అద్భుతం జరగాల్సిందేనని అంటున్నారు.