వాట్ ఎ స్కీం.. వాట్ ఎ షేమ్! చీప్ లిక్కర్ ప్రకటనతో చీపైన సోము వీర్రాజు..
posted on Dec 29, 2021 @ 1:56PM
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మద్యం కీలక అంశం. 2019 ఎన్నికల సమయంలో మద్యపాన నిషేదం హామీ ఇచ్చారు అప్పటి వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి. అయితే అధికారంలోకి వచ్చాకా మడమ తిప్పేశారు. మద్యపాన నిషేదంపై మాట మార్చేశారు. అంతేకాదు మద్యం ధరలను విపరీతంగా పెంచేశారు. కొత్త కొత్త మద్యం బాండ్లు తీసుకొచ్చారు. దీంతో ఎక్కువ ధరకు పనికిమాలిన మద్యం కొనలేక ఏపీ మందుబాబులు ఇబ్బందులు పడ్డారు. తమ అసంతృప్తిగా బహిరంగంగానే వ్యక్తపరిచారు. ఏపీలో మద్యం పాలసీపై మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యపాన నిషేదం చేస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన జగన్.. ఇప్పుడు ఖజానా నింపుకోవడానికి విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు సాగిస్తున్నారని మండిపడుతున్నారు. ప్రతిపక్ష టీడీపీ కూడా లిక్కర్ విషయంలో జగన్ సర్కార్ ను టార్గెట్ చేస్తోంది.
ఇచ్చిన హామీ మేరకు మద్యపాన నిషేదం అమలు చేయాలని టీడీపీ డిమాండ్ చేస్తుంటే మరో ప్రతిపక్ష పార్టీ బీజేపీ అధ్యక్షుడు మాత్రం ఆసక్తికర ప్రకటన చేశారు. తమకు అధికారమిస్తే తక్కువ ధరలకే మద్యం అందిస్తామని చెప్పారు. విజయవాడలో జరిగిన ప్రజా ఆగ్రహ సభలో మాట్లాడిన సోము వీర్రాజు.. బీజేపీ అధికారంలోకి వస్తే రూ.75లకే చీప్ లిక్కర్, ఇంకా కుదిరితే రూ.50లకే ఇస్తామని చెప్పారు. సోము చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఏపీని మద్యాంధ్రప్రదేశ్ గా మార్చడమే బీజేపీ లక్ష్యమా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. మద్యపాన నిషేదం గురించి హామీలు ఇస్తారు.. కాని ఇలా మద్యాన్ని తక్కువ ధరకే అందిస్తాం, అంతా తాగి ఊగండి అనేలా హామీ ఇవ్వడం ఏంటని నిలదీస్తున్నారు. సోము వీర్రాజు ప్రకటనపై మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
సోము వీర్రాజు మద్యం ప్రకటనపై తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా ప్రముఖులు సెటైర్లు వేస్తున్నారు. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కూడా ట్విట్టర్ లో దీనిపై సెటైర్‌లు వేశారు. సోము వీర్రాజు మాట్లాడిన ఆ వీడియోను పోస్టు చేశారు. 'వాహ్.. ఎంత గొప్ప పథకం.. ఎంత సిగ్గుమాలిన హామీ.. బీజేపీ ఏపీ నైతికత విషయంలో మరింత దిగజారింది. చీప్ లిక్కర్‌ను రూ.50కి సరఫరా చేయాలనేదే బీజేపీ జాతీయ విధానమా? లేదంటే నిరాశ అధికంగా ఉన్న రాష్ట్రాలకు మాత్రమే బీజేపీ ఈ బంపర్ ఆఫర్ ఇస్తుందా?' అని ఎద్దేవా చేశారు.
దేశంలోని ఎన్డీయేతర పార్టీలకు చెందిన పలువురు నేతలు కూడా సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలపై చురకలు అంటిస్తున్నారు. ఇంత గొప్ప పథకాన్ని ప్రవేశపెట్టనున్న బీజేపీకి భవిష్యత్తులో ఇంకా ఎన్ని మంచి ఆలోచనలు వస్తాయో అంటూ సెటైర్లు వేస్తున్నారు. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీల ఎంపీలు కూడా సోము వీర్రాజు వ్యాఖ్యలపై స్పందిస్తూ విమర్శలు గుప్పించారు. ఇక సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు మీమ్స్ సృష్టిస్తూ ఆయన వ్యాఖ్యలను విపరీతంగా వైరల్ చేస్తున్నారు.