హైదరాబాద్‌కు కొత్త ట్రాఫిక్ బాస్.. ఇక రూల్స్ మరింత ఖతర్నాక్...
posted on Dec 29, 2021 @ 1:27PM
ఏవీ రంగనాథ్. ఐపీఎస్. ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్. గతంలో హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీగా ఉండేవారు. ఆ టైమ్‌లో ట్రాఫిక్ రూల్స్‌ను పక్కాగా, పటిష్టంగా అమలు చేశారు. కుప్పలకు కుప్పలుగా చలానాలు వసూలు చేశారు. డ్రంకెన్ డ్రైవ్‌లపై ఉక్కుపాదం మోపడం మొదలైంది ఆయన హయాంలోనే. అప్పట్లో ఆయన పనితీరుకు మెచ్చిన ప్రభుత్వం.. ఆ తర్వాత తప్పనిసరి ట్రాన్స్‌ఫర్స్‌లో భాగంగా నల్గొండ జిల్లా ఎస్పీగా నియమించింది. అక్కడా సమర్థవంతంగా రాణించారు. విశాఖ మన్యంలో దాడి చేసి మరీ గంజాయి స్మగ్లర్లను అరెస్ట్ చేసేలా చేశారు. డ్రగ్స్ దందాకు చెక్ పెట్టారు. బైక్స్ సైలెన్సర్లు కట్ చేసి.. పెద్ద సౌండ్‌తో రోడ్లపై హల్‌చల్ చేస్తున్న యువకులను పట్టుకొని కేసులు పెట్టారు. సైలెన్సర్లు లేని బండ్లు సీజ్ చేశారు. పలు కేసులను చాకచక్యంగా డీల్ చేశారు రంగనాథ్. అందుకే, మీడియాలో రంగనాథ్ గురించి ఎప్పుడూ ఏదో ఒక న్యూస్ వస్తూనే ఉంటుంది. టీవీలు, వైబ్‌సైట్లు చూసే వారందరికీ రంగనాథ్ బాగా తెలిసిన పోలీస్ అధికారే.
ఏవీ రంగనాథ్ పనితీరుకు ప్రమోషన్ దక్కింది. ఆయన్ను మరోసారి ట్రాఫిక్‌కు తీసుకున్నారు. తాజాగా, హైదరాబాద్ జాయింట్ ట్రాఫిక్ కమిషనర్‌గా చార్జ్ తీసుకున్నారు ఏవీ రంగనాథ్. ట్రాఫిక్ ఇబ్బందులపై గతంలో డీసీపీగా పని చేసిన అనుభవం ఉందన్నారు ఆయన. అన్ని శాఖల సమన్వయంతో ట్రాఫిక్ ఇబ్బందులు తొలిగే ప్రయత్నం చేస్తానని తెలిపారు.
వచ్చీరాగానే న్యూఇయర్ సెలబ్రేషన్స్‌పై ఫోకస్ పెట్టారు. డిసెంబర్ 31 ట్రాఫిక్ ఆంక్షలపై మార్గదర్శకాలు విడుదల చేస్తామన్నారు. స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపడతామని హెచ్చరించారు. నిబంధనలు అతిక్రమిస్తే వాణిజ్య సముదాయాలపై చర్యలు తీసుకుంటామని తేల్చిచెప్పారు. హైదరాబాద్‌లో గ్రీన్ ఛాలెంజ్, వీవీఐపీ మూమెంట్స్ కొరకు స్పెషల్ చర్యలు చేపడుతున్నారని రంగనాథ్ అన్నారు.