పవన్ చెవిలో సీఎం పువ్వు!
posted on Apr 1, 2021 @ 6:08PM
ఆంధ్రప్రదేశ్ బీజేపీ, జనసేన ఉమ్మడి సీఎం అభ్యర్థి పవన్ కల్యాణ్. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటనతో అంతా షాక్. ఒక్కసారిగా ఉలికిపాటు. మోదీయే తనకు ఈ విషయం చెప్పారంటున్నారు వీర్రాజు. అబ్బే.. అలాంటిదేమీ లేదంటున్నాయి బీజేపీ శ్రేణులు. ఇది సోము వ్యక్తిగత స్టేట్‌మెంటే అన్న చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఏపీ పార్టీ బాధ్యతలు స్వీకరించాక సోము వీర్రాజు ప్రధాని మోదీని ఒక్కసారి కూడా కలవలేదు. ప్రధానిని ఎవరూ కలిసినా ఫోటోలు బయటికి వస్తాయి. కాని సోము వీర్రాజు ఇటీవల కాలంలో ప్రధాని మోడీని కలిసినట్లు ఒక్క ఫోటో కూడా లేదు. అలాంటిది ప్రధాని చెప్పారంటూ.. పవన్ కల్యాణే తమ ముఖ్యమంత్రి అభ్యర్థి అంటూ ఎలా ప్రకటిస్తారని పార్టీ అధ్యక్షుడి తీరును తప్పుబడుతున్నారు క్రిందిస్థాయి నాయకులు.
అసలు బీజేపీకి ముఖ్యమంత్రి అభ్యర్థిని ముందే ప్రకటించే సంప్రదాయమే లేదు. తమకు బలమున్న చోట.. గెలిచే ఛాన్స్ ఉన్న రాష్ట్రాల్లో.. ఫలితాలు వచ్చాకే సీఎంను ఎంపిక చేస్తారు. అప్పటి వరకూ రేసులో ఎవరున్నారనే విషయాన్ని కూడా ప్రస్తావించదు. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న బెంగాల్ విషయాన్నే తీసుకోండి. బెంగాల్‌లో బీజేపీ సీఎం అభ్యర్థి ఎవరు? అంటే సమాధానం లేదు. గెలిచాక ముఖ్యమంత్రి ఎవరో నిర్ణయం తీసుకుంటుంది కేంద్ర కమిటీ. అప్పటి వరకూ పార్టీలో ఆ ప్రస్తావనే రాదు. అసోంలోనూ అంతే. ఇది బీజేపీ స్టైల్ పాలిటిక్స్. అయితే ఈ తరహా విధానాన్ని బీజేపీ అన్ని రాష్ట్రాల్లో అమలు చేయడం లేదు. తమకు బలం లేని చోట్ల మాత్రం ముందే అభ్యర్థిని ప్రకటించి కొత్త ఎత్తులు వేస్తోంది.
కేరళలో బీజేపీకి బలమే లేదు. అక్కడ ఒక్క సీటైనా ఖచ్చితంగా గెలుస్తామని చెప్పలేకపోతోంది. అలాంటి చోట మాత్రం మెట్రో శ్రీధరన్ ను తీసుకొచ్చింది. మెట్రో మేన్ ను పార్టీలో చేర్చుకొని.. తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందే ప్రకటించేసింది కమలదళం. కనీసం ఆయన్ను చూసైనా కాసిన్ని ఓట్లు పడతాయనే ఆశ. ఆంధ్రప్రదేశ్ లోనూ బీజేపీ తీరు అలాగే కనిపిస్తోంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి నాలుగు శాతం మాత్రమే ఓట్లు వచ్చాయి. ఈ రెండేండ్లలో ఆ పార్టీ బలపడింది కూడా లేదు. అయినా తామే అధికారంలోకి వస్తామంటూ కలలు గంటోంది. ఏకంగా ముఖ్యమంత్రి అభ్యర్థినే ప్రకటించారు సోము వీర్రాజు. దీంతో కేరళలో శ్రీధరన్ లానే ఆంధ్రప్రదేశ్ లో పవన్ కల్యాణ్.. బీజేపీ పాలిటిక్స్‌లో పావుగా మారుతున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.
దేశవ్యాప్తంగా బీజేపీ రాజకీయాలను చూస్తే... ఆ పార్టీ తన మిత్రపక్షాన్ని కూడా ఎదగకుండా చేస్తుందనే విమర్శలు ఉన్నాయి. వేరే పార్టీ నాయకుడిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించే అలవాటు బీజేపీకి లేదు. పంజాబ్ లో శిరోమణి అకాలీదళ్ బలహీన పడటానికి బీజేపీ కుట్రలే కారణమని అంటారు. మహారాష్ట్రలో తమకు సుదీర్గ కాలం మిత్రపక్షంగా ఉన్న శివసేన విషయంలోనూ బీజేపీ కుట్రపూరితంగానే వ్యవహరించిందని చెబుతారు. శివసేనకి ముఖ్యమంత్రి పీఠం దక్కకుండా బీజేపీ పావులు కదిపింది. ఎన్సీపీకి సీఎం పోస్టు దక్కినా ఫర్వాలేదు కాని శివసేనకు వద్దన్నట్లుగా బీజేపీ పెద్దలు కథ నడిపించారని రాజకీయ విశ్లేషకులు చెబుతారు. బీహార్ లో మాత్రమే నితీష్ కు మద్దతు ఇచ్చారు. అది కూడా విధి లేని పరిస్థితుల్లోనే ఇచ్చారని అంటున్నారు. నితీశ్ ను సీఎం చేయకపోతే... ఆయన అర్జేడీకి సపోర్ట్ చేస్తారనే భయం వల్లే అక్కడ బీజేపీ తలొగ్గింది.
దేశ వ్యాప్తంగా బీజేపీ రాజకీయాలు చూస్తున్న వారికి ఆంధ్రప్రదేశ్ సీన్ క్లారిటీగా కనిపిస్తోంది. తమకు బలం లేని చోట పవన్ కల్యాణ్ ను ముందు పెట్టి బలపడాలనే ఎత్తులు బీజేపీ వేస్తుందని తెలుస్తోంది. తమ మిత్రపక్షాలనే తొక్కేసే అలవాటున్న బీజేపీ చేతిలో పవన్ పావుగా మారుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. హైకమాండ్ వద్ద తమకే దిక్కులేని సునీల్ దియోదర్, సోము వీర్రాజు .. ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించడమే విచిత్రమనే చర్చ సాగుతోంది. తిరుపతిలో తామే పోటీ చేస్తామని పట్టుబట్టినా అవకాశం ఇవ్వని బీజేపీ... ఏకంగా ముఖ్యమంత్రి పదవి ఎలా ఇస్తుందని జన సేన నేతలు కూడా అంటున్నారు. నిజానికి తిరుపతిలో 2019 ఎన్నికల్లో బీజేపీ కంటే జనసేనకే ఎక్కువ ఓట్లు వచ్చాయి. అయినా ఆ సీటు కూడా పొత్తులో భాగంగా బీజేపీనే తీసుకుంది. తమకు పట్టున సీటులో ఎంపీ సీటే ఇవ్వని బీజేపీని ఎలా నమ్మాలని కొందరు జన సైనికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సోము వీర్రాజు ప్రకటన అటు బీజేపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇదెక్కడి ఖర్మ, ఎవరినో ముఖ్యమంత్రిని చేయడానికి, బీజేపీ కార్యకర్తలు ఎందుకు పనిచేయాలి, అనే ప్రశ్నలు కొందరు కమలం నేతల నుంచి వినిపిస్తున్నాయి. సోమువీర్రాజు ప్రకటన పార్టీని అవమానించే విధంగా ఉందని, పార్టీ అస్థిత్వాన్ని ప్రశ్నించే విధంగా ఉందన్న బాధ, అగ్రహం, పార్టీ కార్యకర్తలు వ్యక్త పరుస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ సీఎం అభ్యర్థిత్వాన్ని బీజేపీ నేతలు కూడా అంగీకరించే పరిస్థితి లేదు.