పసుపు బోర్డు.. ప్రత్యేక హోదా.. బీజేపీ డబుల్ గేమ్
posted on Apr 1, 2021 @ 7:48PM
నిజామాబాద్‌లో పసుపు బోర్డు. బీజేపీ ఎన్నికల హామీ. పసుపు బోర్డుతో రాజకీయం చేసి ఎంపీ సీటు ఎగరేసుకుపోయింది కమలం పార్టీ. గెలిచాక పసుపుబోర్డు ఊసే ఎత్తడం లేదు ఎంపీ అరవింద్. రైతులు ఎంతగా డిమాండ్ చేస్తున్నా.. బీజేపీలో ఉలుకూ పలుకూ లేదు. ఏదో గెలిచాం.. మళ్లీ ఎలక్షన్ నాటికి చూసుకుందాం అన్నట్టు ఉంది తీరు. అటు, కేంద్రం సైతం ఇప్పట్లో తెలంగాణకు పసుపు బోర్డు ఇవ్వడం సాధ్యం కాదని తేల్చేసింది. అసలు అలాంటి ఆలోచనే లేదంటూ పార్లమెంట్ సాక్షిగా ప్రకటించింది.
కట్ చేస్తే.. ఇటీవల తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టో ప్రకటించింది బీజేపీ. అందులో తాము గెలిస్తే తమిళనాడులో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామంటూ హామీ ఇచ్చింది. నవ్విపోదురు గాక నాకేంటి అన్నట్టు ఉంది కమలనాథుల వైఖరి. పసుపు బోర్డు పేరుతో తెలంగాణలో ఎలాంటి పొలిటికల్ స్ట్రాటజీ అప్లై చేసిందో.. సేమ్ అలానే ఇప్పుడు తమిళ ప్రజలను బురిడీ కొట్టించే ప్రయత్నం చేస్తోంది బీజేపీ.
గతంలో తమ సమస్యలపై తమిళ రైతులు ఢిల్లీలో నెలల తరబడి ఆందోళన చేసినా పట్టించుకోని కేంద్రం.. ఇప్పుడు అడగకుండానే పసుపు బోర్డు తెస్తామంటూ మేనిఫెస్టోలో ప్రకటిస్తే నమ్మేంత అమాయకులు కాదు అరవ ఓటర్లు. ఎలాగూ గెలిచేది లేదు.. ఇచ్చేది లేదు అనుకున్నారో ఏమో.. తమిళనాడుకు పసుపు బోర్డు పేరుతో ఓటర్లకు గాలం వేశారు. అయితే, ఆ గాలానికి చిక్కడానికి వారేమీ నిజామాబాద్ ఓటర్లు కాదు. తమిళనాడులో ప్రాంతీయతత్వం ఎక్కువ. జాతీయ పార్టీలను ఆదరించిన చరిత్ర తక్కువ. అందుకే, అక్కడ బీజేపీ పప్పులు ఉడకవంటున్నారు విశ్లేషకులు.
అచ్చం ఇలాంటిదే మరో ఎత్తుగడ పుదుచ్చేరిలోనూ అమలు చేస్తోంది బీజేపీ. తాము గెలిస్తే పుదుచ్చేరికి ప్రత్యేక హోదా తెస్తామంటోంది. ఇదేమి విడ్డూరం! ఏపీ వాసులు ఎంత మొత్తుకుంటున్నా.. ఎన్ని ఉద్యమాలు చేసినా.. ప్రత్యేక హోదా ఇచ్చేది లేదంటూ మొండిగా వాదిస్తోంది కేంద్రం. కేసులకు భయపడి సీఎం జగన్ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టారని అంటున్నారు. నీతిఅయోగ్‌ను బూచీగా చూపించి స్పెషల్ స్టేటస్‌పై ఏపీకి మొండిచేయి చూపించిన కేంద్రం.. పుదుచ్చేరిలో ఎన్నికలు వచ్చే సరికి మాత్రం ప్రత్యేక హోదా పల్లవి అందుకోవడం విమర్శల పాలవుతుంది.
తమిళనాడులో పసుపుబోర్డు.. పుదుచ్చేరికి ప్రత్యేక హోదా.. ఈ రెండు హామీలు ఎన్నికల జిమ్మిక్కులే అంటున్నారు. రాష్ట్రానికో రకంగా ఆడుతున్న బీజేపీ డబుల్ గేమ్‌పై అంతా మండిపడుతున్నాయి. ఓట్ల కోసం మరీ ఇంతగా దిగజారాలా? తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలను కాలరాయాలా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది తెలుగుజాతి.