గులాబీలో ఎమ్మెల్సీ రచ్చ! కడియం జంపింగ్ ఖాయమేనా?
posted on Apr 1, 2021 @ 5:12PM
తెలంగాణలో రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోయే అవకాశాలు కన్పిస్తున్నాయి. వచ్చే జూన్ తర్వాత సంచలన పరిణామాలు ఉంటాయనే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా అధికార టీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాకులు తగులనున్నాయనే చర్చ జరుగుతోంది. జూన్ లో ఏడుగురు ఎమ్మెల్సీల పదవి కాలం ముగియనుంది. ఎమ్మెల్యే కోటాలో గెలిచిన ఆకుల లలిత, మహ్మద్ ఫరీదుద్దీన్, నేతి విద్యాసాగర్ రావు, బోడకుంటి వెంకటేశ్వర్లు, కడియం శ్రీహరి, గుత్తా సుఖేందర్ రెడ్డి పదవి కాలం జూన్ 3తో ముగియనుండగా.. తెలంగాణ భవన్ ఇంచార్జ్ మాదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్సీ పదవి కాలం జూన్ 16తో ముగియనుంది. అయితే వీరిలో ఈసారి ఎంతమందికి రెన్యువల్ ఉంటుందన్నిది ఆసక్తిగా మారింది. తెలంగాణ భవన్, టీఆర్ఎస్ నేతల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం ఒకరిద్దరికి తప్ప మిగితా వారికి రెండోసారి కేసీఆర్ అవకాశం ఇవ్వకపోవచ్చంటున్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల నియామకం తర్వాత గులాబీ పార్టీలో కలకలం రేగడం ఖాయమంటున్నారు.
మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరిపైనే ఇప్పుడు అందరి దృష్టి ఉంది. ఆయనకు మరోసారి అవకాశం ఇస్తారా లేదా అన్నది చర్చగా మారింది. అయితే కడియంకు రెన్యూవల్ దాదాపుగా ఉండకపోవచ్చని తెలుస్తోంది. కడియానికి కూడా దీనిపై సిగ్నల్స్ అందాయని, అందుకే ఆయన భవిష్యత్ కార్యాచరణలో ఉన్నారంటున్నారు. బీజేపీ నేతలతో కడియం టచ్ లోకి వెళ్లారనే ప్రచారం జరుగుతోంది. ఇటీవలే స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే రాజయ్యపై కడియం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్టీ నుంచి వెళ్లిపోవాలని నిర్ణయానికి వచ్చినందువల్లే కడియం బహిరంగంగానే ప్రకటన చేశారని చెబుతున్నారు. 2018లో రెండోసారి టీఆర్ఎస్ సర్కార్ వచ్చాకా.. మంత్రిపదవి తనకు ఖాయమనుకున్నారు కడియం. కాని కేసీఆర్ ఆయన్ను తీసుకోలేదు. అప్పటినుంచి శ్రీహరి అసంతృప్తిగానే ఉన్నారని తెలుస్తోంది. గతంలో ఆయన బీజేపీలోకి వెళ్తున్నారని ప్రచారం జరిగినా.. ఆయన ఖండించారు. ఈసారి మాత్రం కడియం.. కమలం గూటికి చేరడం ఖాయమంటున్నారు.
వరంగల్ జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లుకు కూడా మరో ఛాన్స్ ఉండదని చెబుతున్నారు. దీంతో ఆయన కూడా కడియంతో పాటు బీజేపీ వైపు వెళ్లవచ్చని అంటున్నారు. శాసనమండలి చైర్మెన్ గా ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డికి రెండో సారి అవకాశం తక్కువే అంటున్నారు. గుత్తా ప్లేస్ లో మండలి చైర్మెన్ గా ఇటీవల హైదరాబాద్ స్థానంలో గెలిచిన సురభి వాణిదేవీని తీసుకోవచ్చంటున్నారు. అదే జరిగితే గుత్తాను కేబినెట్ లోకి తీసుకోవాలి. ఇప్పటికే నల్గొండ జిల్లా నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డి మంత్రివర్గం రేసులో ఉన్నారు. ఈ లెక్కన గుత్తాకు ఎమ్మెల్సీ ఇవ్వపోవచ్చని భావిస్తున్నారు. ఫరీదుద్దీన్, ఆకుల లలితకు కూడా మరో అవకాశం ఇవ్వడం అనుమానమే. ఇప్పటికే నిజామాబాద్ నుంచి ఎమ్మెల్సీగా కవిత ఉన్నారు. నేతి విద్యాసాగర్ మరోసారి తనకు అవకాశం ఇవ్వాలని కేసీఆర్ దగ్గర లాబీయింగ్ చేసుకుంటున్నారని చెబుతున్నారు. తెలంగాణ భవన్ ఇంచార్జ్ గా ఉన్న మాదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డికి కూడా ఆరోగ్య కారణాలతో ఎమ్మెల్సీగా తిరిగి నియమించకపోవచ్చని తెలుస్తోంది.
జూన్ లోనే ఏడుగురు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతుండటంతో.. వాటి కోసం టీఆర్ఎస్ లో పోటీ తీవ్రంగానే ఉంది. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వరంగల్ జిల్లాకు చెందిన తక్కెళ్లపల్లి రవీందర్ రావు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ వెంట నడిచిన కర్నె ప్రభాకర్ పదవి కాలం గత నవంబర్ లో ముగిసింది. ఆయనకు మరోసారి అవకాశం వస్తుందని భావించిన... సామాజిక సమీకరణలు, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో ఆయనకు రెన్యూవల్ రాలేదు. జూన్ లో అవకాశం ఇస్తానని కర్నెకు ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని చెబుతున్నారు. నాగార్జున సాగర్ టికెట్ ఆశించిన ఎంసీ కోటిరెడ్డికి ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు. ఆయన కూడా రేసులో ఉండే అవకాశం ఉంది. మాజీ మంత్రి నాయిని నర్సింహరెడ్డి అల్లుడు శ్రీనివాస్ రెడ్డి కూడా టికెట్ ఆశిస్తున్నట్లు సమాచారం.