కంటి నుండి కిడ్నీల వరకు సమస్యలను పెంచే చిన్న పొరపాటు ఇది..!

 


శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకుంటే సరైన జీవనశైలి, సమతుల  ఆహారాన్ని తీసుకోవడం తో పాటు  కొన్ని విషయాలలో ఎక్కువ శ్రద్ధ చూపడం చాలా ముఖ్యం. ఈకాలంలో మధుమేహం, రక్తపోటు సమస్యలు యువతలో కూడా  కనిపిస్తున్నాయి. ఇది చాలా మందిని  ఆందోళన కలిగిస్తోందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఈ రెండింటినీ అదుపులో ఉంచుకోవడం చాలా అవసరం. చాలామంది షుగర్ లెవల్ పెరగడం గురించి చాలా నిర్లక్ష్యంగా ఉంటారు.  చిన్న వయసే కదా ఏమవుతుందిలే.. మందులతో నియంత్రణ చేసుకోవచ్చులే అని నిర్లక్ష్యం చేస్తారు. అయితే  షుగర్ లెవెల్ పెరగడం అనే చిన్న పొరపాటు వల్ల కలిగే ఆరోగ్య సమస్యల గురించి తెలుసుకుంటే..


ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న ఆరోగ్య సమస్యలలో మధుమేహం ఒకటి. ఒక అంచనా ప్రకారం 2024 సంవత్సరంలో భారతదేశంలో డయాబెటిస్‌తో బాధపడుతున్న వారి సంఖ్య 212 మిలియన్లు. అంటే 21 కోట్లకు పైగా భారతీయులు మధుమేహంతో బాధపడుతున్నారు. ఇది ప్రపంచంలోని మొత్తం రోగులలో 26%. అధిక చక్కెర స్థాయిలు  ఉండటం వల్ల శరీరం చాలా విధాలుగా నష్టపోతుంది.  మూత్రపిండాల నుండి కళ్ళు,  రోగనిరోధక శక్తి వరకు ప్రతిదానిపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది.

ఆరోగ్య నిపుణులు ఏం చెప్పారంటే..

ఆరోగ్య నిపుణులు మధుమేహం తీవ్రమైన ఆరోగ్య సమస్య అని,  శరీరంలోని అనేక ఇతర అవయవాలకు కూడా తీవ్రమైన హానిని కలిగిస్తుందని చెబుతున్నారు.  రక్తంలో చక్కెర ఎక్కువగా ఉన్న సమస్యను హైపర్గ్లైసీమియా అంటారు. దీని బారిన పడిన వ్యక్తులు అంటు వ్యాధులు, కిడ్నీ వ్యాధి, చూపు మందగించడం వంటి అనేక సమస్యలను ఎదుర్కొంటారు.

మధుమేహం సమస్య ఉంటే నిర్లక్ష్యం చేయవద్దని వైద్యులు చెబుతున్నారు. ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ ఉండాలి.  కొన్నిసార్లు రక్తంలో అధికంగా చక్కెర స్థాయిలు ఉండటం వల్ల ప్రాణాంతక సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది.

కళ్లు, కిడ్నీ..

హై బ్లడ్ షుగర్ సమస్య (హైపర్గ్లైసీమియా) కంటి రక్తనాళాలను దెబ్బతీయడం ప్రారంభిస్తుంది.  దీని కారణంగా  అస్పష్టమైన దృష్టి సమస్య రావచ్చు. ఇది మాత్రమే కాదు రక్తంలో చక్కెర స్థాయిలు  నియంత్రణలో కాకుండా  తరచుగా ఎక్కువగా ఉంటే, అది  కంటి చూపు పోవడానికి కూడా దారి తీస్తుంది. మధుమేహం వల్ల వచ్చే కంటి సమస్యలను డయాబెటిక్ రెటినోపతి అంటారు.

అదేవిధంగా రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువగా ఉంటే అది మూత్రపిండాలను దెబ్బతీస్తుంది. ఇది దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధికి దారితీస్తుంది. రక్తంలో అధిక చక్కెర మూత్రపిండాల రక్తనాళాలను దెబ్బతీస్తుంది,  అవి పాడైపోయే ప్రమాదం ఉంది.
 
గాయాలు..

మధుమేహ వ్యాధిగ్రస్తులలో గాయాలు చాలా సాధారణం. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, హైపర్గ్లైసీమియా రోగనిరోధక వ్యవస్థను కూడా ప్రభావితం చేస్తుంది. దీని కారణంగా గాయాలను నయం చేయడానికి శరీరం  ప్రతిస్పందన నెమ్మదిగా మారుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు చాలా ఎక్కువగా ఉన్నప్పుడు రోజులలో మానాల్సిన గాయాలు మానడానికి కొన్ని నెలలు పట్టవచ్చు.

ఇన్పెక్షన్..

హైపర్గ్లైసీమియా  కారణంగా, రోగులలో సంక్రమణ ప్రమాదం ఇతర వ్యక్తుల కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి రోగులకు తీవ్రమైన మూత్రపిండ సమస్యలను కలిగించే మూత్ర నాళాల ఇన్ఫెక్షన్ల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. హైపర్గ్లైసీమియాకు కారణమయ్యే ఇన్ఫెక్షన్లు శరీరంలో ఒత్తిడి ప్రతిస్పందనకు దారితీస్తాయి, ఇది కార్టిసాల్,  అడ్రినలిన్ హార్మోన్ స్రావాన్ని పెంచుతుంది.

                                *రూపశ్రీ.

Teluguone gnews banner