సిలెండర్ మండుతోంది...!
posted on Oct 3, 2012 7:28AM
సంవత్సరానికి ఒక కుటుంబానికి ఆరు సిలెండర్లు మాత్రమే... అది కూడా సబ్సిడిపైనే... ఆరు దాటితే మార్కెట్ రేటు ప్రకారం 827 రూపాయలకు కొనుక్కోవాలని.. ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు దీనికి మరో 138 రూపాయలు చేర్చి 965 రూపాయలుగా చేసింది. అంటే ఇంచుమించుగా గృహ అవసరాలకు ఆరు సిలెండర్లకంటే ఒకటి ఎక్కువ అడిగినా సుమారుగా 1000 రూపాయలు చెల్లించుకోవాల్సిందే! ఇప్పటికే నిత్యావసర ధరలు పెరిగిపోయాయి. వాటికే కొనలేకపోతుంటే... ఇప్పుడు గ్యాస్ మంట...! సరుకులే కొనలేనప్పుడు... ఇక గ్యాస్ ఎందుకు ... దండగ... అనుకుని ప్రభుత్వం ఎంచక్కా పెంచేసింది! ఎంతైనా ప్రభుత్వం చాలా తెలివిగలది! కొంతకాలంపోతే 60ఏళ్ళు పైబడి బ్రతికిన వారిపై ఏడాదికి కొంత చొప్పున పన్ను వేస్తుంది. దీనిలో నుండి సంపన్నులను మినహాయిస్తుంది.ఎందుకంటే వారు పార్టీలకు నిధులు, ఇతరత్రా వనరులు సమకూర్చే వారు కనుక. కనీసం నగరం, గ్రామీణ ప్రాంతం అన్న బేధం లేకుండా గ్యాస్ సిలెండర్ కొనే వారికి ఆయా షాపుల్లో కట్టెలు, కట్టెల పొయ్యిలు కూడా అమ్మితే కొంచెం వినియోగదారులకు సౌకర్యంగా ఉంటుంది. దీని వల్ల కూడా ప్రభుత్వానికి లాభమే.. కనుక కనీసం ఆ దిశగా ఆలోచించి సామాన్యులకు వాటికోసం దూరాభారాలు వెళ్ళి తెచ్చుకునే శ్రమను తగ్గించమని కోరుకుంటున్నారు సామాన్యులు.