చెల్లి దగ్గర అప్పు.. ఆపై తప్పు.. వాడు అసలు అన్నేనా?
posted on Mar 11, 2021 @ 4:17PM
వావివరసలు మరిచాడు. చెల్లి జీవితంతో ఆడుకున్నాడు. కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి తాగించాడు. డబ్బు కోసం పాడు పని చేశాడు. ఫోటోలు, వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేశాడు. అన్న చేతిలో మోసపోయానని గ్రహించిన చెల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కట్ చేస్తే, ఆ అన్న కటకటాలు లెక్కపెడుతున్నాడు. హైదరాబాద్ లో జరిగిందీ దారుణం.
బీదర్ ప్రాంతానికి చెందిన ఓ యువతి(26) హైదరాబాద్ లో ఉంటూ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తోంది. కర్ణాటకలో ఉండే యువతి చిన్నమ్మ కొడుకు నిఖిల్(27) ఫిలింనగర్ పరిధి మహాత్మాగాంధీ నగర్ సమీపంలో ఉంటున్నాడు. అతని అవసరాల కోసం చెల్లి వరుస అయిన ఆ యువతి నుంచి 50 వేలు అప్పు తీసుకున్నాడు. అప్పు వసూలు కోసం ఇటీవల అన్న ఇంటికి వచ్చింది చెల్లి. నిఖిల్ ఆమెతో మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్ తాగించాడు. ఆ మత్తులో ఆ తర్వాత ఏం జరిగిందో ఆమెకు గుర్తు లేదు. ఆ మర్నాడు ఆ యువతి తన ఇంటికి వెళ్లిపోయింది. రెండు రోజుల తర్వాత డబ్బులు అడిగేందుకు నిఖిల్‌కు ఫోన్ చేసింది. తాను డబ్బులు ఇవ్వనంటూ రివర్స్ అయ్యాడు నిఖిల్. నిద్ర పోయినప్పుడు ఇద్దరు కలిసి ఉన్నట్లు తీసిన ఫొటోను వాట్సాప్ లో ఆమెకు పంపించాడు. అవాక్కైన ఆ యువతి వెంటనే అన్నకు ఫోను చేయగా.. ఆ రోజు తన ఇంటికి వచ్చినప్పుడు ఆమెతో చేయకూడని పని చేశానని.. విషయం ఎవరికైనా చెప్పినా, అప్పు తిరిగి అడిగినా ఆ ఫొటోలు, వీడియోలు బయటపెడతానని బెదిరించాడు. అన్న చేసిన పనికి నిర్ఘాంతపోయిన చెల్లి.. బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడు నిఖిల్ ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.