తగ్గేదే లేదు.. వీల్‌ఛైర్‌లో ప్రచారం చేస్తా..
posted on Mar 11, 2021 @ 3:49PM
మొండిఘటం. గట్టిపిండం. ఐరన్ లేడీ. ఫైర్ బ్రాండ్ లీడర్. ఇవన్నీ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి సరిగ్గా సరిపోతాయి. కాలుకు దెబ్బతగిలినా, ఆసుప్రతిలో చేరినా.. తగ్గేదే లేదంటున్నారు దీదీ. అవసరమైతే వీల్ ఛైర్ లో కూర్చొని ఎన్నికల ప్రచారం చేస్తానంటున్నారు. ఈ మేరకు హాస్పిటల్ బెడ్ మీద నుంచే వీడియో సందేశాన్ని ఇచ్చారు. ప్రజలు శాంతియుతంగా ఉండాలని పనిలో పనిగా పీస్ మెసేజ్ కూడా పంపించారు. దీదీకి గాయం.. బీజేపీ విమర్శ.. వీడియో సందేశంతో ఎన్నికల వేళ బెంగాల్ దంగల్ యమ రంజుగా సాగుతోంది.
సీఎం మమతా బెనర్జీపై నందిగ్రామ్‌లో దాడి జరగడంతో తృణమూల్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు. దీదీపై కుట్రపూరితంగానే దాడి జరిగిందని అధికార టీఎమ్సీ ఆరోపించింది. దాడిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఘటనపై ఈసీ బాధ్యత తీసుకోవాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
నందిగ్రామ్‌లో నామినేషన్ వేసిన అనంతరం ఓ ఆలయాన్ని సందర్శించిన సమయంలో దీదీ కాలికి గాయమైంది. అది ప్రమాదం కాదు ప్రతిపక్షాల దాడి అనేది తృణమూల్ ఆరోపణ. అయితే, అధికార పార్టీ ఆరోపణలను బీజేపీ ఖండించింది. మమతపై ఎలాంటి దాడి జరగలేదని, అది కేవలం ప్రమాదమేనని కొట్టిపారేసింది. ఎన్నికల్లో ఓడిపోతాననే భయంతోనే దీదీ ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడుతున్నారు కమలనాథులు. ప్రజల్లో సానుభూతి పొందేందుకే ఈ ఘటనను రాజకీయం చేస్తున్నారని విమర్శిస్తున్నారు. దీనిపై లోతుగా దర్యాప్తు చేయాలని ఎన్నికల సంఘాన్ని కోరింది బీజేపీ.
ఘటన తర్వాత బెంగాల్‌లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సీఎం మమతా బెనర్జీ ఓ వీడియో మెసేజ్ రిలీజ్ చేశారు. ‘‘నందిగ్రామ్‌లో కారు ఎక్కుతుండగా ఒక్కసారిగా కొంతమంది నన్ను తోసేశారు. నా ఎడమకాలి మడమ ఎముకకు, పాదానికి, మోకాలికి గాయమైంది. ఛాతిలో నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా అనిపిస్తోంది. ప్రస్తుతం నాకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. రెండు మూడు రోజుల్లోనే డిశ్చార్జ్ అయి తిరిగి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటాను. అవసరమైతే వీల్‌ఛెయిర్‌లో కూర్చుని ప్రచారం చేస్తా. అందుకు మీ అందరి సహకారం కావాలి. ఈ సందర్భంగా ప్రజలకు ఇబ్బంది కలిగించే పనులు చేయొద్దని, శాంతియుతంగా ఉండాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నా’’ అంటూ మమతా వీడియో సందేశం ఇచ్చారు. ఈ వీడియోను తృణమూల్ కాంగ్రెస్ ట్విటర్‌లో పోస్ట్ చేసింది.