ఎమ్మెల్సీలుగా సింగర్ సాయిచంద్, రమణ.. కవిత సీటుపై సస్పెన్స్!
posted on Nov 21, 2021 @ 6:29PM
టీఆర్ఎస్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారయ్యారు. ఢిల్లీకి వెల్లే ముందు అభ్యర్దులను ఖరారు చేశారు సీఎం కేసీఆర్.పలువురు అభ్యర్దులకు బీ ఫాం ఇచ్చారు. సోమవారం అధికారికంగా అభ్యర్థులను ప్రకటించనుంది టీఆర్ఎస్ అధిష్ఠానం. సోమవారం, మంగళవారం పలువురు అభ్యర్దులు నామినేషన్ వేయనున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో పలుజిల్లాల్లో కొందరికి రెన్యూవల్ ఇవ్వగా.. మరికొందరికి మొండిచెయ్యి ఇచ్చారు గులాబీ బాస్.
ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రస్తుతం పురాణం సతీష్ కుమార్ ఎమ్మెల్సీగా ఉండగా.. ఆయనకు మరోసారి అవకాశం ఇవ్వలేదు. ఆయన స్థానంలో దండే విఠల్ ను ఖరారు చేశారు కేసీఆర్. మహబూబ్ నగర్ జిల్లా నుంచి కసిరెడ్డి నారాయణ రెడ్డికి మరోసారి అవకాశం ఇవ్వగా.. దామోదర్ రెడ్డి స్థానంలో సింగర్ సాయిచంద్ ను మండలికి పంపిస్తున్నారు కేసీఆర్. పాలమూరు జిల్లా నుంచి ఇద్దరు రెడ్లు ఉండటం వల్లే మార్పు చేశారని అంటున్నారు. దామోదర్ రెడ్డిని రాజ్యసభకు పంపించే యోచనలో కేసీఆర్ ఉన్నారని అంటున్నారు.
ఖమ్మం జిల్లా నుంచి బాలసాని స్థానంలో తాత మధుకు అవకాశం ఇచ్చారు. రంగారెడ్డి జిల్లా నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీలుగా ఉన్న శంభీపూర్ రాజు, పట్నం మహేందర్ రెడ్డికి రెన్యూవల్ చేశారు. వరంగల్ జిల్లా నుంచి కేటీఆర్ సన్నిహితుడు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి మళ్లీ ఛాన్స్ ఇచ్చారు. నల్గొండ జిల్లాలో ఎవరూ ఊహించని విధంగా మార్పు చేశారు. సిట్టింగ్ తేరా చిన్నపరెడ్డికి ఖాయమని భావించినా.. చివరి నిమిషంలో ఎంసీ కోటిరెడ్డికి అవకాశం ఇచ్చారు. తేరాతో పాటు కోటిరెడ్డిది కూడా నాగార్జున సాగర్ నియోజకవర్గమే కావడం విశేషం. తేరా చిన్నపరెడ్డి పుల్ టర్మ్ ఎమ్మెల్సీగా చేయకపోయినా.. ఆయనకు రెన్యూవల్ చేయకపోవడం చర్చగా మారింది.
మెదక్ జిల్లా నుంచి భూపాల్ రెడ్డి స్థానంలో తెలంగాణ ఉద్యమకారుడు డాక్టర్ యాదవ రెడ్డిని మండలికి ఖరారు చేశారు కేసీఆర్. కరీంనగర్ జిల్లా నుంచి సిట్టింగ్ భాను ప్రసాద్ రావుకు మరోసారి అవకాశం ఇస్తూ రెండో స్థానాన్ని మాత్రం ఇటీవలే టీడీపీ నుంచి కారెక్కిన ఎల్ రమణకు ఇచ్చారు. ఇక్కడ నారదాసుకు హ్యాండ్ ఇచ్చారు కేసీఆర్. నిజామాబాద్ జిల్లా నుంచి కల్వకుంట్ల కవిత అభ్యర్థిత్వం ఇంకా క్లారిటీ రాలేదు. కవితను రాజ్యసభకు పంపాలని నిర్ణయిస్తే ఆకుల లలితకు అవకాశం దక్కనుంది. లేదంటే మళ్లీ కవితనే ఎంపిక చేస్తారని తెలుస్తోంది. ఇటీవల రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాష్ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. దీంతో ఆయన రాజ్యసభకు రాజీనామా చేయబోతున్నారు. ఆయన రాజీనామాతో ఖాళీ అయ్యే సీటును కవితతో భర్తీ చేయాలని కేసీఆర్ నిర్ణయించారని తెలుస్తోంది.