సింగరేణి కార్మికులకు ప్రభుత్వం గుడ్ న్యూస్
posted on Sep 22, 2025 @ 3:04PM
సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కార్మికులకు సర్కార్ బోనస్ ప్రకటించింది. లాభాల్లో 34 శాతం కార్మికులకు పంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. హైదరాబాద్‌లో పలువురు మంత్రులతో కలిసి జరిగిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి కీలక ప్రకటనలు చేశారు. సింగరేణి సంస్థలోని 41 వేల శాశ్వత ఉద్యోగులకు మొత్తం రూ.819 కోట్లు బోనస్‌గా పంపిణీ చేయనున్నట్టు తెలిపారు.
అదనంగా, 30 వేల కాంట్రాక్ట్ కార్మికులకూ ఒక్కొక్కరికి రూ.5,500 చొప్పున బోనస్ అందజేస్తామని తెలిపారు. కాంట్రాక్ట్ కార్మికులకు కూడా బోనస్ ఇవ్వడం దేశ చరిత్రలోనే ఇదే మొదటిసారని డిప్యూటీ సీఎం ప్రకటించారు. కోల్ ఇండియా నుంచి వచ్చే బోనస్‌ను దీపావళికి అందజేస్తామన్నారు. భవిష్యత్‌లోనూ సింగరేణి కార్మికులకు అండగా ఉంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. అదే సమయంలో, జీఎస్టీ మార్పుల వల్ల రాష్ట్రాలు ఆదాయం కోల్పోతున్నాయని ఆయన విమర్శించారు. కోల్పోయిన ఆదాయాన్ని కేంద్రం భర్తీ చేయాలని, ఏకపక్ష నిర్ణయాలతో రాష్ట్రాలపై భారం వేయడం తగదని వ్యాఖ్యానించారు.
రాబోయే ఐదేళ్లపాటు కేంద్రం వైబిలిటీ గ్యాప్ ఫండ్‌ను అందించాల్సిన అవసరం ఉందని సూచించారు. రూ. 2360 కోట్లు నికర లాభాలు వచ్చాయి. అందులో 34 శాతం… రూ.819 కోట్లు పర్మినెంట్ కార్మికులకు బోనస్ కోసం కేటాయించామని పేర్కొన్నారు. ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టిన గనులను కూడా సింగరేణికి అప్పగించేలా చూడాలని కార్మికులు కోరారు. ఆ దిశగా కేంద్రంతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని సీఎం తెలిపారు