మాజీ ఎంపీ కనకమేడలకు కీలక పదవి
posted on Dec 23, 2025 @ 3:13PM
సుప్రీంకోర్టులో మరో ఇద్దరు అదనపు సొలిసిటర్ జనరల్స్‌ను కేంద్రం నియమించింది. మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్‌తో పాటుదవీందర్‌పాల్ సింగ్‌ను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర కేబినేట్ నియామకాల కమిటీ ఆమోదంతో న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కనకమేడల నియామకం న్యాయరంగంలో ఆయనకు ఉన్న అనుభవానికి, సామర్థ్యానికి గుర్తింపుగా రాజకీయ, న్యాయ వర్గాలు భావిస్తున్నాయి. రాజకీయ జీవితంతో పాటు న్యాయరంగంలోనూ చురుకైన పాత్ర పోషించిన ఆయనకు ఇప్పుడు దేశస్థాయిలో కీలక బాధ్యతలు అప్పగించడం ప్రత్యేకంగా నిలుస్తోంది.
ఎన్డీయే ప్రభుత్వ విధానాలకు సంబంధించిన న్యాయ అంశాలపై రవీంద్ర కుమార్ కీలక పాత్ర పోషించనున్నారు. రాజ్యాంగపరమైన కీలక వివాదాల్లో ప్రభుత్వ వాదనను ఆయన బలంగా వినిపిస్తారని కేంద్రం భావిస్తోంది. రవీంద్ర కుమార్‌కు ఈ పదవి వరించడంతో తెలుగుదేశం పార్టీ వర్గాల్లో ఆనందం వెల్లివిరిసింది. పార్టీ నేతలు, కార్యకర్తలు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అనుభవజ్ఞుడైన న్యాయవాదికి ఈ పదవి రావడం సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వ వాదనకు బలం చేకూరుస్తోందని తెలుగు ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.