జీఎస్టీ రిఫార్మ్స్.. రెట్టింపు కానున్న జీలకర్ర, యాలకులు, లవంగాల ధరలు
posted on Sep 22, 2025 @ 2:47PM
జీఎస్టీ రిఫార్మ్స్ అంటూ స్లాబులను తగ్గించిన కేంద్రం దీని వల్ల పేదలకు ఆర్థికంగా గొప్ప వెసులుబాటు లభించిందని ఆర్భాటంగా ప్రచారం చేసుకుంటోంది. నిజంగానే ఈ సంస్కరణల వల్ల దాదాపు 400 వస్తువుల ధరలు తగ్గాయి. వాటిలో పేదలకు ఆర్థికంగా ఉపశమనం కలిగేందుకు అవసరమైనవి కొన్ని ఉన్నాయి. అయితే దానికి మించిన భారం పడేలా కూడా ఈ సంస్కరణల వల్ల ధరలు పెరిగే వస్తువులు కూడా ఉన్నాయి. కానీ ఆ విషయంపై పెద్దగా ప్రచారం జరగకుండా, ఆ విషయం ఇప్పటికిప్పుడు జనాలకు తెలియకుండా కేంద్రం జాగ్రత్తలు తీసుకుందనీ, ధరలు పెరిగే వస్తువులపై వ్యూహాత్మక మౌనం పాటిస్తోందనీ పరిశీలకులు అంటున్నారు.
ఇప్పుడు జీఎస్టీ స్లాబులను రెండుకు దగ్గించామని ఘనంగా చెబుతున్న కేంద్రం, వీటి గురించి చెబుతున్నంత గట్టిగా సోమవారం నుంచే ఈ రెండు స్లాబులతో పాటు అమలులోకి వచ్చిన మూడో స్లాబు గురించి చెప్పడం లేదు. అది 40 శాతం శ్లాబు. ఆ శ్లాబులో పెరిగే వస్తువుల ధరలు పేద, మధ్యతరగతి జనాలపై ఏమీ ప్రభావం చూపవు అన్నట్లుగా కలర్ ఇస్తున్నారు. కానీ వాస్తవంగా ఆ వస్తువుల ధరల పెరుగుదల వల్ల పేద మధ్యతరగతి ప్రజలపైనా పెను ప్రభావం పడుతోంది. ఎలా ఉంటే.. నిత్యం వంటల్లో పేద, మధ్యతరగతి ప్రజలు నిత్యం వంటల్లో వినియోగించే జీలకర్ర, మిరియాల, గసగసాలు, దాల్చినచెక్క, ఇంగువ, యాలకులు, లవంగాల ధరలు ఈ 40శాతం శ్లాబులో ఉన్నాయి. అంటే వీటి ధరలు దాదాపు రెట్టింపు పెరగనున్నాయి.