Read more!

మనిషి భయం విషయంలో చేసే వెర్రి ఆలోచన!!

మరణాన్ని చీకటితో పోల్చారు. 'నీలమేఘ విలసత్కా లాంజనాకారు. ఘోర నిశాతోత్కట దంష్ట్రు' అంటూ ఎఱ్ఱన భారతంలో యముడిని వర్ణించాడు. యముడు కారు నలుపు. వాడి కోరలు కలవాడు. ఇదీ యముడి వర్ణన. కానీ


ఆశ్చర్యపత్ పశ్యతి కశ్చిదేనం

ఆశ్చర్యవద్వదతి తథైవ ఛాన్య

ఆశ్చర్యవ్యమైన మధ్యశ్చకోని

శ్రుత్వా ప్యేనం వేదనచైవకశ్చిత్౹౹


మరణం గురించి, దేహి దేహ పరస్పర సంబంధం గురించి వింతగా చూస్తారు. వింతగా మాట్లాడతారు. ఆశ్చర్యంతో వింటారు. ఎంత మాట్లాడినా, ఎన్ని విన్నా నిజంగా మరణం గురించి తెలుసుకున్నవారు ఎవ్వరూ లేరు. కాబట్టి మరణమంటే భయం వ్యక్తిలో అంతర్గతంగా ఎల్లప్పుడూ ఉంటుంది. ఈ మరణభయాన్ని తర్కంతో జయించాలి. అది తప్పనిసరి. ఎవరూ తప్పించుకోలేరు. అదేమిటో ఎవరికీ తెలియదు. ఇక దాని గురించి భయపడి లాభం లేదు. లాభం లేనిదాని గురించి, మనం ఏమీ చేయలేని దాని గురించి భయపడటంలో అర్థం లేదు.


ఎప్పుడో మరణం వస్తుందని ఇప్పటి నుంచీ బాధపడుతూ కూచుంటే, వచ్చే మరణం ఎలాగూ వస్తుంది. కానీ ఉన్న జీవితం చేజారిపోతుంది. కాబట్టి భయపడి లాభం లేదు, ఈ రకమైన 'వాదం' ప్రతి భయాన్నీ జయించేందుకు ఉపయోగించవచ్చు. ఏదో వస్తువు కొనాలని ఉంటుంది. కానీ దుకాణం వాడు మోసం చేస్తాడేమోనన్న భయంతో వెనుక ముందు ఆడుతుంటాడు.


'వస్తువు కొంటాను. మోసం చేస్తాడు. అయితే ఏంటట?” అనుకుని ముందుకు వెళ్తే పని అవుతుంది. పైగా "వాడు మోసం చేస్తాడని తెలిసీ మోసపోయానంటే, ఇక బాధపడే అర్హత నాకు లేదు" అనుకుంటే సమస్య లేదు.


కొందరు ప్రతి చిన్న విషయానికీ 'ఏమౌతుందో' అని భయపడుతుంటారు. వారు అనుక్షణం తమని తాము ఇలా ప్రశ్నించుకుంటూ, తర్కించుకుంటూ భయాన్ని అధిగమించవచ్చు. ఒకామెకు ఇల్లు వదిలి సగం దూరం వచ్చాక ఇంటికి తాళం వేసిందో, లేదోనన్న అనుమానం కలిగింది. దాంతో ఆమె ప్రయాణమంతా కుదురుగా ఉండలేక పోయింది. తిరిగి ఇంటికి వచ్చిన తరువాత తాళం చూస్తే కానీ ఆమెకు శాంతి కలగలేదు. కానీ ఈ లోగా ఆమె ప్రయాణాన్ని ఎంజాయ్ చేయలేకపోయింది. ఆమె తోటివారి ఆనందం పాడైంది. ఇటువంటప్పుడు కూడా 'సరే. తాళం వేయటం మరిచిపోయాను ఐతే ఏమైంది? ఇంట్లో వస్తువులు పోతాయి. మళ్లీ కొనవచ్చు' అనుకోవచ్చు. లేకపోతే ఇరుగుపొరుగు వారికి ఫోన్ చేసి చెప్పి 'కాస్త చూడండి' అని చెప్పవచ్చు. ఇలా, ఇక భయం కలిగితే దాన్ని తర్కంతో జయించటం అలవాటు చేసుకోవాలి.


ఒకాయన రోజూ ఉదయమే వాకింగ్ కు వెళ్తాడు. ఐతే ఆయన నడిచే దారిలో చీకటి ఉంటుంది. కుక్కలు అరుస్తుంటాయి. కుక్క అరుపు వినగానే ఆయన వాకింగ్ మానేసి వెనక్కు వచ్చేస్తుంటాడు. ఆ వైపు వెళ్లాలంటే భయం. ఓ రోజు ధైర్యం చేశాడు. 'కుక్కలు ఏం చేస్తాయి? చెయ్యెత్తితే పారిపోతాయి' అనుకుని తడబడుతున్న గుండెను చిక్కబట్టుకుని చీకట్లోకి అడుగు వేశాడు. కుక్కలు అరుస్తూ, వాటి గోలలో ఈయనని పట్టించుకోలేదు. ఈయన వాకింగ్ కొనసాగించాడు. ఆ తరువాత తన భయాన్ని చూసి నవ్వుకున్నాడు. ఈ చిన్న భయం వల్ల ఎన్నాళ్లు వాకింగ్ మానేశాడో తలుచుకుని మరింత నవ్వుకున్నాడు. మన భయాలన్నీ ఇటువంటివే. కాబట్టి మనిషి తనలో భయాన్ని తరిమికొట్టాలి.


                                     ◆ నిశ్శబ్ద.