‘30’ రోజుల మాట మార్చేసిన కేంద్రం ?
posted on Dec 29, 2012 4:26AM
తెలంగాణా రాష్ట్రం విషయంలో నెల రోజుల్లో ఓ నిర్ణయం తీసుకుంటామని కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే చెప్పిన మాటల్ని నమ్మాల్సిన పని లేదా ? నిన్న ఢిల్లీ లో జరిగిన అఖిల పక్ష సమావేశం అనంతరం షిండే మాట్లాడుతూ ఆయన ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పారు.
అయితే, నిన్న సాయంత్రం కేంద్ర హోం మంత్రిత్వశాఖ విడుదల చేసిన అధికారిక ప్రకటనలో ఈ మాట మారిపోయింది. ఈ అంశంఫై ఈ గడువు లోగా నిర్ణయం ఉంటుందని ఆ ప్రకటనలో ఎక్కడా లేదు. తెలంగాణాఫై నెల రోజుల్లోగా నిర్ణయం తీసుకుంటామని ఈ సమావేశంలో షిండే తమతో అన్నారని ఈ సమావేశంలో సిపిఎం తరపున హాజరైన ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బి.వి.రాఘవులు మీడియా ప్రతినిధులతో కూడా అన్నారు.
ఒక్క నెల రోజులు అగలేరా అంటూ కొంత మంది తెలంగాణా కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు ఇతర పార్టీలకు సలహా ఇచ్చాయి కూడా. షిండే చేసిన ప్రకటన, ఆ తర్వాత స్వయానా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న హోం మంత్రిత్వ శాఖ విడుదల చేసిన అధికారిక ప్రకటనను పరిశీలిస్తే, కేంద్రం ‘నెల’ రోజుల మాటను మార్చేసిందని అనుకోవాలా? ఆ శాఖ విడుదల చేసిన అధికారిక ప్రకటనఫై రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి.