ఆమె పేరు వెల్లడించాలన్న మంత్రి థరూర్
posted on Jan 2, 2013 @ 11:49AM
వివాదాస్పద వ్యాఖ్యలకు మారు పేరుగా నిలిచే కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ సహాయ మంత్రి శశి థరూర్ మరో సారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ నగరంలో రేప్ కు గురి అయి ఆ తర్వాత మరణించిన యువతి పేరును బయట పెడితే తప్పేమిటని ఆయన నిన్న ప్రశ్నించారు.
‘ఆమె పేరు రహస్యంగా ఉంచడం వల్ల వచ్చే ప్రయోజనం ఏమిటి? చాలా ధైర్యంగా వ్యవహరించిన ఆమె పేరు బయట పెడితే తప్పేముంది’ అని ఆయన తన ట్విట్టర్ అకౌంట్ లో పేర్కొన్నారు. అలాగే, బాధితురాలి తల్లి తండ్రులకు అభ్యంతరం లేకపోతే, అత్యాచార నిరోధక చట్టానికి ఆమె పేరు పెట్టాలని ఆయన అన్నారు. అయితే, థరూర్ చేసిన ఈ వ్యాఖ్యలకు కొంత మంది నుండి మద్దతు కూడా లభించింది.అయితే, మరి కొంత మంది మాత్రం ఆయన సలహాను ప్రశ్నించారు. థరూర్ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం అని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది.
ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారం భాదితురాలి పేరును, గుర్తింపును బయట పెట్ట కూడదు. అలా చేయడం ఇండియన్ పీనల్ కోడ్ లోని సెక్షన్ 228 ఏ ప్రకారం నేరం. ఆమె గుర్తింపు తెలిసేలా ఓ కధనాన్ని ప్రచురించిన ఓ ఆంగ్ల పత్రిక ఫై పోలీసులు ఇటీవలే కేసును నమోదు చేశారు.