షర్మిల పాదయాత్ర ఆపేస్తే ప్రళయం వస్తుందా?
posted on Apr 23, 2013 @ 1:40PM
షర్మిల సవాళ్ళు చూస్తే, ‘కొండకు వెంట్రుక ముడేసి లాగితే వస్తే కొండ కదిలి వస్తుంది, లేకుంటే పోయేది వెంట్రుకే’నన్నట్లుంది. బయ్యారం గనులలో తన భర్త అనిల్ కుమార్ కు, రక్షణ స్టీల్స్ లో తనకు వాటాలున్నట్లు అసత్య ప్రచారం చేస్తున్న తెరాస, తెదేపా నాయకులు మరియు ఆ పార్టీ అధినేతలు దానిని నిరూపిస్తే తన పాదయాత్రను వెంటనే విరమించుకొని ఇంటికి వెళ్ళిపోతానని, లేకుంటే వారు తమ పదవులకు రాజీనామా చేస్తారా? అని సవాళ్ళు విసురుతున్నారు.
ఆమె సవాళ్ళకు తెదేపా, తెరాసలు ఇంతవరకు స్పందించలేదు. కానీ, షర్మిల పాదయాత్ర ఆపేస్తే భూమి తలక్రిందులయిపోదు, ప్రళయం వచ్చిపడిపోదు. ఆమె తన పార్టీ ప్రచారం కోసం పాదయాత్ర చేస్తున్నారు తప్ప, దానివల్ల ప్రజలకి ఒరిగేదేమిలేనపుడు, తను పాదయాత్ర ఆపేస్తానని బెదిరించడం వల్ల ఎవరికీ నష్టం? అందువల్ల ఏమయినా నష్టం జరిగితే ఆమె పార్టీకే జరుగుతుందేమో తప్ప ప్రజలకి వచ్చే నష్టం ఏమిలేదు. ఒకవేళ ఆమెకు పాదయాత్ర చేయడం కష్టంగా ఉన్నట్లయితే, ఆమె నిరభ్యంతరంగా విరమించుకొని ఇంటికి వెళ్లిపోవచ్చును. అందుకు అభ్యంతరం చెప్పేవారుండరు. చెప్పినా ఆమె వారికి సంజాయిషీ ఇచ్చుకోనవసరం లేదు కూడా. కానీ పాదయాత్ర విరమించుకోనేందుకు, ఈవిధమయిన కుంటిసాకులు వెతుకోవడం అనవసరం.
తన పాదయాత్రని, ప్రతిపక్షనేతల పదవులకి బోడి గుండుకి మోకాలుకీ ముడి పెట్టినట్లు ముడి పెట్టి కీలకమయిన పార్టీ అధ్యక్ష పదవులకి రాజీనామా చేయమని ఆమె కోరడం హాస్యాస్పదం. అంతగా అయితే ఆమె చంద్రబాబును ఆరోపణలు నిరూపించలేకపోతే ఆయన కూడా పాదయాత్ర ఆపగలరా? అని సవాలు చేసుకొంటే కొంచెం సబబుగా ఉంటుంది.
రాజకీయాలలో ఆరోపణలు ప్రత్యారోపణలు సహజమే. కానీ ఏవీ నిరూపింపబడిన దాఖలాలు లేవు. అదేవిధంగా పార్టీ నేతలు సవాళ్ళు ప్రతిసవాళ్ళు చేసుకోవడం కూడా సహజమే. కానీ ఎవరూ దైర్యం చేసి ముఖాముఖి చర్చకు కూర్చొన్న దాఖలాలు లేవు. ఒకవేళ టీవీ చర్చా కార్యక్రమాలలో పాల్గొన్నా ఎదుట వారు చెప్పినదానికి సమాధానం చెప్పేబదులు, పెద్ద గొంతులతో అరుచుకొని సమస్య నుండి బయటపడటం కూడా ఒక విజయవంతంగా అమలు పరుస్తున్న ఒక పద్దతిగా మారిపోయింది.
ఇటువంటి పరిస్థితుల్లో తెదేపా, తెరాసలు చేస్తున్న ఆరోపణలు కానీ, దానికి షర్మిల విసురుతున్న ప్రతి సవాళ్ళు కానీ కేవలం ప్రజలను ఆకట్టుకోవడానికి, నిజాయితీగా ఒప్పుకొంటే అవి ప్రజలను మభ్యపెట్టడానికే తప్ప వేరే ప్రయోజనం లేదు. వారందరూ వాదనల్లో నిజంగా బలం ఉందని నమ్మినట్లయితే, ఈ విధంగా ప్రజలను మభ్య పెట్టేబదులు ఆ విషయం కోర్టుకు వెళ్లి తెల్చుకొంటే మంచిది. అప్పుడు దొంగలెవరో, దొరలెవరో కోర్టులే తేల్చి చెప్పుతాయి.