యోగీ జనాభా విధానానికి పవార్ మద్దతు
posted on Jul 11, 2021 @ 6:35PM
ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఆదివారం నూతన జనాభా విధానాన్ని విడుదల చేసింది. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ 2021-2030 జనాభా విధానాన్ని ఆవిష్కరించారు. ఈ కొత్త జనాభా విధానం ప్రకారం, 2026నాటికి ప్రతి వెయ్యి మంది జనాభాకు జననాల రేటు 2.1కి పరిమితం చేయాలని, 2030నాటికి 1.9కి పరిమితం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.ఈ సందర్భంగా యూపే సీఎం ఆదిత్యనాథ్ జనాభా నియంత్రణకు, కాన్పుకు, కాన్పుకు మధ్య ఎడం ఉండలాని, బిడ్డకు బిడ్డకు మధ్య దూరం ఉండాలని అన్నారు. సుస్థిర అభివృద్ధిని ప్రోత్సహించడానికి, వనరుల పంపిణీలో మరింత సమన్యాయం ఉండేవిధంగా జనాభాను నియంత్రించి, స్థిరపరచవలసిన అవసరం ఉందన్నారు. జనాభా పెరుగుదల సమస్యపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. తాజా బిల్లుపై ఈనెల 19 వరకూ ప్రజల సూచనలను యూపీ సర్కార్ ఆహ్వానించింది.
అదంతా ఒకలా ఉన్నా, బిల్లులో అసలు మెలిక వేరేగా ఉందని కాంగ్రెస్ పార్టీ కస్సు మంది. యూపీ ప్రభుత్వం తీసుకు వస్తున్న నూతన జనాభా విధానం ప్రకారం, ఇద్దరి కంటే ఎక్కువ సంతానం కలిగిన వారు స్థానిక సంస్థల్లో పోటీ చేసే అర్హత కోల్పోతారు. ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు, సబ్సిడీలు పొందేందుకు అనర్హులవుతారని ఆప్రతి సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం బిల్లు తీసుకు వచ్చేముందు, తమ చట్టబద్ధ సంతానంపై మంత్రులు, ప్రభుత్వ నేతల నుంచి ముందు సమాచారం కోరాలని సూచించారు.
కాంగ్రెస్ పార్టీ మిత్ర పక్షం ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్, యూపీ బిల్లుకు స్వాగతం పలికారు. దేశంలో సుస్థిర ఆర్థికాభివృద్ధి సాధించాలంటే జనాభా నియంత్రణ అవసరమని ఆయన తెలిపారు. ఉన్నత జీవన ప్రమాణాలు, పర్యావరణ సమతౌల్యం సాధించడంలో జనాభా నియంత్రణ ఎంతో కీలకమని ఆయన ఆభిప్రాయపడ్డారు. అయితే , ఈ బిల్లుపై ఇతర పార్టీల స్పందన ఎలా ఉంటుందో చూడవలసి ఉందని, ముఖ్యంగా ముస్లిం వోట్ బ్యాంక్’ఫై ఆధారపడే లౌకికవాద పార్టీల స్పందన ఎలా ఉంటుందన్నది చూడాలని విశ్లేషకులు భావిస్తున్నారు.