కృష్ణపట్నం ఆనందయ్యకు ఎమ్మెల్సీ? గవర్నర్ కార్యాలయం ఆరా తీసిందా?
posted on Jul 11, 2021 @ 5:14PM
నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్యకు ఎమ్మెల్సీ పదవి రానుందా? గవర్నర్ కోటాలో ఆయన పెద్దల సభకు వెళ్లబోతున్నారా? ఈ చర్చే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణలోనూ జోరుగా సాగుతోంది. ఆనందయ్య తయారు చేసిన ఆయుర్వేద మందు కొవిడ్ నివారణలో బాగా పని చేస్తుందని జనాలు భావిస్తున్నారు. దీంతో ఆయన మందు కోసం ఎగబడ్డారు. ఆనందయ్య మందుకు చాలా ఆడ్డంకులు వచ్చినా.. హైకోర్టు అనుమతి ఇవ్వడంతో మందు పంపిణి చేశారు. ఇంకా చేస్తూనే ఉన్నారు.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఆనందయ్య మందు పంపిణీ అవుతోంది. ఆయుర్వేద మందు తయారు చేసిన ఆనందయ్యను చట్టసభలకు పంపి గౌరవించాలన్న ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో గవర్నర్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా.. ఏపీ సీఎస్ ఆదిత్యానాధ్ దాస్ కు లేఖరాయడం సంచలనంగా మారింది. ఆనందయ్యకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని లేఖలో ఆయన పేర్కొన్నారు. ఆనందయ్యకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి గౌరవించాలని వెన్నెల ఫౌండేషన్ వైస్‌చైర్మన్, హైకోర్టు న్యాయవాది సుంకర నరేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఏపీ గవర్నరి బిశ్వభూషణ్ హరిచందన్ కు లేఖ రాశారు. తన ఆయుర్వేద ఔషదంతో కొవిడ్-19 నివారణకు కృషి చేసిన ఆనందయ్యను రాజ్యాంగంలోని ఆర్టికల్ 171(3), ప్రకారం ఆయనను ఎమ్మెల్సీగా నియమించే అవకాశాన్ని పరిశీలించాలని అందులో పేర్కొన్నారు. ఈ లేఖపై స్పందించిన గవర్నర్ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు.
ఈ లేఖపై అటు గవర్నర్ కార్యాలయంగానీ.. ఇటు ఆనందయ్యగానీ స్పందించలేదు. ఆనందయ్య మందు కోసం అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నేతలతో పాటు ప్రతిపక్ష నేతలు కూడా కృష్ణపట్నంకు క్యూకట్టారు. కొన్ని రోజుల పాటు ఆనందయ్య కేంద్రంగానే రాజకీయ ఆరోపణలు చేసుకున్నాయి. ఒకరిద్దరు మంతురులు కూడా ఆయన్ను కలిసి మందు తయారీ, పంపిణీ గురించి ఆరాతీశారు. ఆనందయ్యను ప్రభుత్వం నిర్బంధిస్తోందని... రహస్య ప్రాంతంలో ఉంచి అధికార పార్టీ నేతలు మందు తయారు చేయించుకున్నారని కొన్ని పార్టీల నేతలు విమర్శించారు. ఆనందయ్యకు పాపులారిటీ రావడంతో కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు ఆనందయ్య మందును సొంత ఫోటోలు వేసుకొని పంపిణీ చేశారు. ఇది కూడా వివాదాస్పదమైంది.
ఆనందయ్యకు ఎమ్మెల్సీ పదవిస్తున్నారన్న ప్రచారం వెలుగులోకి రావడం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ లేఖను జగన్ ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని ఆనందయ్యకు ఎమ్మెల్సీ పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే పార్టీలో పదవులకు పోటీ పెరగడంతో ఆనందయ్యకు జగన్ అవకాశం కల్పిస్తారా..? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. మరోవైపు ఆనందయ్యకు రాజకీయాలపై ఆసక్తి ఉన్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది.