గుంతలు పూడుస్తున్న టీడీపీ నేతపై దౌర్జన్యం.. పశ్చిమలో వైసీపీ నేతల ఓవరాక్షన్..
posted on Jul 11, 2021 @ 6:35PM
అమ్మా పెట్టదు.. అడుక్కో తినానివ్వదు.. అన్నట్లుగా ఉంది ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం తీరు. రెండేండ్లుగా నిర్లక్ష్యం వహించడంతో రాష్ట్ర వ్యాప్తంగా రహదారులు దెబ్బ తిన్నాయి. చాలా ప్రాంతాల్లో దారుణంగా తయారయ్యాయి. రోడ్ల మధ్యలో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. కనీస మరమత్తులు చేసేవారు లేకపోవడంతో.. విధి లేక ఆ రోడ్లపై ప్రయాణిస్తూ ప్రమాదాలకు గురవుతున్నారు జనాలు. కొన్ని రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో రోడ్ల దుస్థితి మరింత అధ్వాన్నంగా తయారైంది. దీంతో జనాల ఇబ్బందులు చూడలేక.. గుంతలు పూడ్చే ప్రయత్నం చేసిన టీడీపీ మాజీ ఎమ్మెల్యేపై అధికార పార్టీ నేతలు దౌర్జన్యం చేయడం దుమారం రేపుతోంది.
పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గంలో వైసీపీ నేతలు రెచ్చి పోయారు. రోడ్లపై గుంతలు పూడుస్తున్న టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను అడ్డుకున్నారు. ఏలూరు సమీపంలో సోమవరప్పాడు వద్ద రోడ్డుపై భారీ గుంతలు ఏర్పడ్డాయి. జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లు బాగు చేయాలని అధికారులకు ఎన్ని సార్లు చెప్పినా స్పందించకపోవడంతో చింతమనేని స్వయంగా రంగంలోకి దిగారు. పలుగు, పార పట్టారు. వర్షంలోనే గోతులు పూడ్చేందుకు ప్రయత్నం చేశారు చింతమనేని. అయితే వైసీపీ నేతలు అక్కడికి చేరుకుని ఆయన్ను అడ్డుకోడానికి ప్రయత్నించారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరగడంతో ఉద్రిక్తత తలెత్తింది.
వైసీపీ నేతల తీరుపై చింతమనేని ప్రభాకర్ మండిపడ్డారు. ఏలూరు-జంగారెడ్డి గూడెం రోడ్డు సోమవరప్పాడు దగ్గర నుంచి గోపన్నపాలెం వరకు గోతులు ఏర్పడి.. రోడ్డేదో, గొయ్యేదో తెలియని పరిస్థితిలో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు, అలాగే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు.. రోడ్డుపై గుంతలను సర్పంచ్‌లు, టీడీపీ నేతల సహకారంతో పూడుస్తున్నామన్నారు. రాజకీయ లబ్దికోసం ఈ పనిచేయడంలేదన్నారు. మొద్దు నిద్రపోతున్న ప్రభుత్వాన్ని మేల్కొల్పటానికే తమ ప్రయత్నమని చింతమనేని స్పష్టం చేశారు.