మహిళా మంత్రులు వీరే.. వారెవా, క్యా సెలక్షన్ హై!
posted on Jul 7, 2021 @ 11:22PM
78మంది మంత్రులతో కేంద్ర కేబినెట్ అట్టహాసంగా కొలువుదీరింది. ఈసారి మంత్రిమండలిలో మహిళలకు పెద్దపీట వేశారు ప్రధాని మోదీ. ఇప్పటికే నిర్మల సీతారామన్, స్మృతి ఇరానీ, సాధ్వి నిరంజన్ జ్యోతి, రేణుకా సింగ్‌లు కేబినెట్‌లో కొనసాగుతుండగా.. కొత్తగా మరో ఏడుగురు మహిళా ఎంపీలను మంత్రిమండలిలోకి తీసుకున్నారు. బీజేపీ ఎంపీలతో పాటు ఎన్డీయేలో భాగస్వామ్య పక్షం అప్నాదళ్ (ఎస్) నేత అనుప్రియ పటేల్‌కు కూడా కేబినెట్‌లో చోటు దక్కింది.
అనుప్రియ సింగ్ పటేల్.. అప్నాదళ్ (ఎస్) నేత అనుప్రియ పటేల్ ఉత్తర ప్రదేశ్‌లోని మీర్జాపూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి 2019 ఎన్నికల్లో గెలిచారు. ఆమె దివంగత డాక్టర్ సోనీలాల్ పటేల్ కుమార్తె. ఆమె ఢిల్లీలోని లేడీ శ్రీరామ్ కాలేజ్, ఢిల్లీ విశ్వవిద్యాలయం, ఛత్రపతి సాహూజీ మహరాజ్ విశ్వవిద్యాలయాల్లో చదివారు.
మీనాక్షి లేఖి.. బీజేపీ తరఫున ఢిల్లీ లోక్‌సభ సభ్యురాలు. వృత్తిపరంగా న్యాయవాది. మంచి వాగ్దాటి ఉండటంతో బీజేపీ జాతీయ అధికార ప్రతినిధిగా కూడా ఉన్నారు. సామాజిక కార్యకర్త కూడా. జాతీయ మహిళా కమిషన్, బాలలు, మహిళల హక్కుల పరిరక్షణకు సంబంధించిన వివిధ సంస్థల్లో చురుకైన పాత్ర పోషించారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు పోటీగా మీనాక్షి లేఖికి కేబినెట్‌లో చోటిచ్చారని అంటున్నారు.
ప్రతిమ భౌమిక్.. త్రిపుర (తూర్పు) నియోజకవర్గం బీజేపీ ఎంపీ. రాజకీయాల్లోకి రాకముందు ఆమె అగ్రికల్చరిస్ట్. ప్రస్తుతం రైల్వే మంత్రిత్వ శాఖ సంప్రదింపుల కమిటీ సభ్యురాలు.
భారతి ప్రవీణ్ పవార్.. మహారాష్ట్రలోని డిండోరి (ఎస్‌టీ) నియోజకవర్గం బీజేపీ ఎంపీ. వృత్తిరిత్యా డాక్టర్. నైపుణ్యాభివృద్ధి, ఎంటర్‌ప్రెన్యూవర్‌షిప్ మంత్రిత్వ శాఖ సంప్రదింపుల కమిటీ సభ్యురాలిగా ఉన్నారు.
శోభ కరంద్లాజే.. కర్ణాటకలోని ఉడుపి చిక్‌మగళూర్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచారు. సోషల్ వర్క్‌లో మాస్టర్స్ డిగ్రీ చేశారు.
దర్శన విక్రమ్ జర్దోశ్.. గుజరాత్‌లోని సూరత్ ఎంపీ. 2019 నుంచి ఆర్థిక శాఖ స్టాండింగ్ కమిటీ సభ్యురాలిగా ఉన్నారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంప్రదింపుల కమిటీ సభ్యురాలిగా కూడా వ్యవహరిస్తున్నారు. బీజేపీ ఉపాధ్యక్షురాలు కూడా.
అన్నపూర్ణ దేవి.. జార్ఖండ్‌లోని కొడెర్మా ఎంపీ. 2019 నుంచి మహిళా సాధికారత కమిటీ సభ్యురాలిగా ఉన్నారు. విద్యుత్తు మంత్రిత్వ శాఖ, పునరుద్ధరణీయ ఇంధనాల మంత్రిత్వ శాఖ సంప్రదింపుల కమిటీలో కూడా సభ్యురాలు.