స్టీల్‌ప్లాంట్ అమ్మకంపై కేంద్రం దూకుడు.. జగన్‌రెడ్డి ఇప్పుడేం చేస్తారో?
posted on Jul 7, 2021 @ 10:43PM
నెలల తరబడి ఉద్యమం. నెలల తరబడి పోరాటం. నెలల తరబడి ఆందోళన. నెలల తరబడి ధర్నా. నెలల తరబడి దీక్ష. ఆంధ్రరాష్ట్రమంతా ఒక్కతాటిపైకి వచ్చి.. విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు.. స్టీల్‌ప్లాంట్‌ను అమ్మొద్దంటూ ఎంతగా పోరాడినా.. కేంద్రాన్ని ఎంతగా వేడుకున్నా.. మోదీ సర్కారు మాత్రం మెత్తబడలేదు. సీఎం జగన్‌రెడ్డి కేంద్రానికి రాసిన ఉత్తుత్తి లేఖలు, ఉత్తుత్తి చర్యలు కూడా ఫలించలేదు. కరోనా కల్లోల సమయంలో యావత్ దేశానికి మెడికల్ ఆక్సిజన్ అందించి.. దేశం ఊపిరి నిలిపిన.. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను అంగట్లో అడ్డగోలుగా అమ్మేందుకు కేంద్రం మరో ముందడుగు వేసింది.
విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకానికి కేంద్రం మరో ముందడుగు వేసింది. కన్సల్టెంట్ నియామకానికి కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్‌తో పాటు అనుబంధ సంస్థలన్నీ వందశాతం అమ్ముతామని ప్రకటనలో కేంద్రం తెలిపింది. ఏపీలోని జగ్గయ్యపేట, తెలంగాణలోని మాదారం స్టీల్ ప్లాంట్ మైన్స్‌ను కూడా అమ్మకానికి పెట్టింది కేంద్రం.
లీగల్ అడ్వైజర్ ఎంపికకు కేంద్రం ఈ టెండర్లను ఆహ్వానించడంతో మరోసారి కలకలం మొదలైంది.
ఈనెల 28 వరకు బిడ్డింగ్ గడువు విధిస్తూ.. బిడ్‌లో పాల్గొనేందుకు లక్ష రూపాయల డిపాజిట్, కోటి రూపాయల బ్యాంక్ గ్యారంటీ చూపాలని నోటిఫికేషన్‌లో తెలిపింది కేంద్రం.
ప్రజా ఆకాంక్షలను.. ఇక్కడి మనోభావాలను ఏమాత్రం లెక్క చేయకుండా.. పట్టించుకోకుండా.. పంతానికి పోతోంది కేంద్ర ప్రభుత్వం. స్టీల్‌ప్లాంట్ అమ్మకం సీఎం జగన్‌రెడ్డి వైఫల్యానికి నిదర్శనమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విశాఖ భూముల మీద చూపిస్తున్న ఇంట్రెస్ట్.. స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ మీద పెట్టడం లేదని ఆంధ్రులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యమం మరింత తీవ్రతరం చేసేందుకు సిద్ధమవుతున్నారు.