కవ్విస్తే.. ధిక్కరిస్తే.. రేవంత్ ఊరుకుంటాడా?
posted on Jul 29, 2021 @ 3:56PM
కొన్నిరోజులుగా పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి సైలెంట్. ఇదే అదనుగా కోమటిరెడ్డి బ్రదర్స్ తెగ హడావుడి చేస్తున్నారు. అన్న ఒకలా.. తమ్ముడు ఇంకోలా. ఎవరి టాలెంట్‌కు తగ్గట్టు వారు యాక్షన్‌లోకి దిగిపోయారు. ఒకరు నల్గొండలో రెచ్చిపోతుంటే.. ఇంకొకరు ఢిల్లీ నుంచి బాంబులు విసురుతున్నారు. సడెన్‌గా నల్గొండ బ్రదర్స్ ఇంతలా యాక్టివ్ కావడానికి కారణం ఏంటని కాంగ్రెస్ వర్గాలే ఆశ్చర్యపోతున్నాయి. రేవంత్‌రెడ్డికి ధీటుగా.. తామేం తక్కువ కాదనే మెసేజ్ ఇవ్వడానికో.. రేవంత్ స్థాయి తగ్గించడానికో.. ఆయన్ను బద్నామ్ చేసేందుకో.. కారణం ఏదైనా కోమటిరెడ్డి ఫ్యామిలీ రేవంత్‌ను కార్నర్ చేసేందుకు ట్రై చేస్తోందని అంటున్నారు. మరోవైపు, పలువురు సీనియర్లు సైతం చాకచక్యంగా పావులు కదుపుతూ పీసీసీ చీఫ్ తమ కంట్రోల్ దాటిపోకుండా చూసుకుంటున్నారు. అయితే, అరచేతిని అడ్డుపెట్టి సూర్యుని వెలుగును ఆపగలరా? అంటూ రేవంత్ అభిమానులు కౌంటర్లు వేస్తున్నారు.
కాంగ్రెస్‌లో ఇలాంటివి క్వైట్ కామన్. ఏళ్లుగా అలాంటివి జరుగుతునే ఉన్నాయి. అయితే, ఇకపై ఇలాంటి, అలాంటివన్నీ బంద్. కాంగ్రెస్‌వాదులంతా క్రమశిక్షణగా ఉండాల్సిందే. పార్టీ లైన్‌కు కట్టుబడాల్సిందే. ఎక్స్‌ట్రాలు చేస్తే తోక కట్ చేస్తా. ఖబర్దార్.. అంటూ పీసీసీ పగ్గాలు చేపట్టగానే రేవంత్‌రెడ్డి కేడర్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇలాంటి బెదిరింపులన్నీ బచ్చా లీడర్లకేనని.. మాలాంటి వాళ్లను టచ్ చేయలేవంటూ సీనియర్లు యధావిధిగా తమ స్టైల్‌లో పాలిటిక్స్ చేస్తూనే ఉన్నారు.
ఇటీవలే కాంగ్రెస్ సీనియర్లంతా రహస్య సమావేశం పెట్టి మరీ రేవంత్‌రెడ్డి ముందు కొన్ని డిమాండ్లు ఉంచారని తెలుస్తోంది. పోలోమంటూ ఎవరొస్తే వారిని పార్టీలోకి తీసుకోవద్దని.. స్థానిక నేతలు అభ్యంతరం చెప్పకపోతేనే.. వారు ఓకే అంటేనే.. కాంగ్రెస్ కండువా కప్పాలని చెప్పారట. ఎంత పెద్ద లీడర్ పార్టీలో చేరినా.. ఎమ్మెల్యే టికెట్ హామీ మాత్రం ఇవ్వందంటూ గట్టిగానే కండిషన్ పెట్టారట. సీనియర్ల సహకారం లేనిదే పార్టీని ఈజీగా నడపలేరనే విషయం తెలిసి.. వీళ్ల సంగతి సమయం వచ్చినప్పుడు చూసుకుందాంలే అనుకొని.. వారి డిమాండ్స్‌కు సరేనంటూ ఇప్పటికైతే తల ఆడించారట పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.
డైనమిక్ లీడర్ నాయకత్వం చూసి కాంగ్రెస్‌లో చేరేందుకు అన్నిపార్టీల నేతలు, అన్నిప్రాంతాల నాయకులు ఉత్సాహం చూపిస్తుంటే.. పార్టీ సీనియర్లు మాత్రం చేరికలపై, చేర్చుకోవడాలపై ఇలా కొర్రీలు పెట్టడం కాంగ్రెస్‌లోనే సాధ్యం. ఆ సీనియర్ల వల్లే ఇటీవల కాంగ్రెస్‌లో చేరేందుకు ఆసక్తి చూపిన పాలమూరు బీజేపీ అధ్యక్షుడు ఎర్ర శేఖర్‌తో పాటు డీఎస్ తనయుడు సంజయ్, గండ్ర సత్యనారయణలాంటి వారు పార్టీ కండువా కప్పుకునే సమయం ఆలస్యం అవుతోందని అంటున్నారు.
మరోవైపు.. లేటెస్ట్‌గా కోమటిరెడ్డి బ్రదర్స్ జోరు మామూలుగా లేదు. పార్టీ పిలుపు లేకుండానే.. పీసీసీకి ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే.. రాజగోపాల్‌రెడ్డి దళిత బంధుపై తన నియోజకవర్గంలో ధూంధాం చేశారు. మంత్రి జగదీష్‌రెడ్డితో గొడవ పెట్టుకొని తన ఉనికిని బలంగా చాటుకున్నారు. ఆ మర్నాడే మునుగోడులో దళిత బంధు కోసం ధర్నాకు పిలుపిచ్చి రచ్చ రంబోలా చేశారు. ఇదంతా కోమటిరెడ్డి సొంత ఎజెండా. దళిత బంధుపై కాంగ్రెస్ వైఖరి ఏంటో పీసీసీ ఇంకా ప్రకటించనేలేదు. ఎలాంటి ఆందోళనలకు పిలుపివ్వలేదు. పీసీసీతో తనకు సంబంధం లేదన్నట్టుగా రాజగోపాల్‌రెడ్డి ఓ రేంజ్‌లో యాక్టివిటీస్ చేస్తుండటం.. రేవంత్‌రెడ్డిని డమ్మీ చేసే ప్రయత్నమేనని అంటున్నారు. తనకు నచ్చినట్టు చేసుకుంటానంటూ.. పీసీసీ చీఫ్‌కు కోమటిరెడ్డి చేస్తున్న ఛాలెంజ్‌గా భావిస్తున్నారు.
అటు కోమటిరెడ్డి బిగ్ బ్రదర్ సైతం తగ్గినట్టే తగ్గి మళ్లీ కిరికిరి స్టార్ట్ చేశారు. రేవంత్‌ను పీసీసీ చీఫ్ చేయడాన్ని ఆయన మొదటినుంచీ వ్యతిరేకిస్తున్నారు. ప్రకటన వెలువడిన వెంటనే.. పదవిని కొనుక్కున్నారంటూ హాట్ కామెంట్లు చేసి ఇరకాటంలో పడ్డారు. హైకమాండ్‌ను షంటింగ్స్ పడటంతో నోరు మూసుకొని ఢిల్లీ వెళ్లిపోయారు. అప్పటి నుంచీ సైలెంట్‌గా ఉంటూ వచ్చిన వెంకట్‌రెడ్డి.. తాజాగా హుజురాబాద్‌లో కాంగ్రెస్‌కు డిపాజిట్ కూడా రాదంటూ.. తన సర్వేలో ఈటలనే గెలుస్తాడని తేలిందంటూ.. ఢిల్లీ నుంచి డైనమైట్లు పేల్చారు. అసలాయనను సర్వే ఎవరు చేయమన్నారు? నిజంగా సర్వే చేశారా లేదా? ఆ విషయాలను ఓపెన్‌గా ఎందుకు చెప్పాలి? పార్టీలో నిరుత్సాహం నింపే స్టేట్‌మెంట్స్ ఎందుకు చేయాలి? ఇదంతా క్రమశిక్షణారాహిత్యం కాదా? పార్టీ లైన్‌కు వ్యతిరేకం కాదా?
కాంగ్రెస్‌ను, రేవంత్‌రెడ్డిని కవ్వించడానికే ఆయనలాంటి కామెంట్లు చేశారని అంటున్నారు. రేవంత్‌ను గిల్లుదాం.. ఆయన ఏం చేస్తారో చూద్దాం.. అన్నట్టుగా ఉంది కోమటిరెడ్డి బ్రదర్స్ రాజకీయం. కాంగ్రెస్‌లోనే ఉంటూ రేవంత్‌పై రెబల్ వాయిస్ వినిపించడమా? లేక, కాంగ్రెస్‌ను ఫుల్‌గా డ్యామేజ్ చేసి బీజేపీలోకి జంప్ అయిపోదామనా? కోమటిరెడ్డి బ్రదర్స్ అసలు ఉద్దేశ్యమేంటో అర్థం కావట్లేదంటున్నాయి పార్టీ వర్గాలు. ఇంతకుముందైతే ఇలాంటి ఇష్టారీతులు నడిచాయి.. మరిప్పుడు పీసీసీ పీఠంపై రేవంత్‌రెడ్డి ఉన్నారు. తోక జాడించే నేతలకు షాక్ ఇస్తారా? సీనియర్లకు చెక్ పెట్టి.. చెప్పుచేతల్లోకి తెచ్చుకుంటారా? లేక, చూసీచూడనట్టు వదిలేసి కాంగ్రెస్ రథాన్ని ముందుకు దూకిస్తారా? చూడాలి.. రేవంత్‌రెడ్డి ఏం చేస్తారో..