దళిత బంధు.. టీఆర్ఎస్ కు వరమా.. శాపమా?
posted on Jul 29, 2021 @ 3:56PM
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నోరు జారారు. హుజురాబాద్ ఉప ఎన్నికలో గెలవడం కోసమే దళిత బంధు పథకం తీసుకొస్తున్నామని, తమదైన శైలిలో కుండ బద్దలు కొట్టారు. ఇప్పుడు ఆ జారిన మాటే, అయన మెడకు చుట్టుకుంటోంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే గొనె ప్రకాశ రావు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దళిత బంధు పైలట్ ప్రాజెక్ట్ అమలుకు ఉప ఎన్నికలు జరగనున్న హుజురాబాద్ నియోజక వర్గాన్ని ఎంచుకోవడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఆయన తమ లేఖలో అధికార పార్టీ ఇప్పటికే అనేక అక్రమాలకు పాల్పడుతోందని, కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ హుజురాబాద్ ఓటర్లను మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. కాబట్టి, హుజురాబాద్ ఉప ఎన్నికను వెంటనే నిర్వహించడంతో పాటుగా, అధికార తెరాస విచ్చలవిడిగా చేస్తున్న ఖర్చుపై నిఘా పెట్టాలని, కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. అలాగే, కేంద్ర బలగాలను దించి ఎన్నికలు నిర్వహించాలని కూడా గొనె ప్రకాశ రావు టం లేఖలో పేర్కొన్నారు. దళిత బంధు పైలట్ ప్రాజెక్ట్ హుజురాబాద్’లో కాకుండా మరో నియోజక వర్గంలో అమలు చేయాలని, ఆ విధంగా కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు.
తాజాగా ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ (ఎఫ్జీజీ) మరో అడుగు ముందు కేసి ఉప ఎన్నికలు ముగిసే వరకు హుజురాబాద్ నియోజక వర్గంలో దళిత బంధు సహా కొత్తగా ఏ సంక్షేమ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించకుండా చర్యలు తీసుకోవాలని, కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. ఎన్జీజీ కార్యదర్శి ఎం.పద్మనాభ రెడ్డి ఈ మేరకు ఎన్నికల సంఘానికి రాసిన లేఖలో, ఉప ఎన్నికలలో గెలుపు కోసమే, దళిత బంధు పథకం ప్రారంభిస్తున్నామని ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించడం రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమే అని పేర్కొన్నారు. అలాగే, ఉప ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం ఆగష్టు నెలల్లో దాదాపు వెయ్యి కోట్లు నగదు బదిలీ చేయబోతోందని పద్మనాభ రెడ్డి తమ లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖలపై కేంద్ర ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది.
అసలు ఈ లేఖలను పట్టించుకుంటుందా అనే విషయాన్ని పక్కన పెడితే, ముఖ్యమంత్రి కేసీఆర్ కోరుకుంటున్నది కూడా ఇదే అని, ఎదో విధంగా ఎవరో ఒకరు అడ్డుపుల్ల వేసి, పథకం అమలును అడ్డుకోవాలనే అయన కోరుకుంటున్నారని, రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. అందుకే, ప్రతిపక్ష పార్టీలు, ఆరోపణలు చేస్తున్నాయే కానీ, ఫిర్యాదులు చేయడం లేదు. నిజానికి, చివరి వరకు ఎవరూ అడ్డుకోకపొతే, ఎవరో ఒకరితో కోర్టులో ఒక పిల్ వేయించి, తప్పించుకునే వ్యూహంతోనే ముఖ్యమంత్రి అమలు చేయడం అసాధ్యమని తెలిసి కూడా దళిత బంధు ప్రకటించారని సామాన్య ప్రజలకు కూడా అర్థమైపోయింది. అందుకే, ఇప్పుడు ముఖ్యమంత్రి కొత్త ఎత్తులకు పదును పెడుతున్నారని అంటున్నారు. అలాగే, ప్రతిపక్షాలు కూడా, దళిత బంధు పథకాన్ని ఒకే సారి రాష్ట్ర మంతా అమలు చేయలాని, అదే చేత్తో బీసీలు, ఎస్టీలకు కూడా పథకం వర్తింప చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.
దళితులు కూడా దళిత బంధు విషయంలో అంతగా ఆశలు పెట్టుకోలేదు. ఎన్నికలకు ముందు ... కొద్ది మందికి అది కూడా తెరాస క్రియాశీల సభ్యులకు ఇస్తే ఇస్తారేమో కానీ, ఎన్నికల తర్వాత పథకాన్ని అటకెక్కిస్తారని దళిత యువకులే ప్రచారం చేస్తున్నారు. గతంలో చేసిన దళిత ముఖ్యమంత్రి, మూడెకరాల భూమి హమీలలాగానే, దళిత బంధు కూడా ఎప్పటికీ అమలు కానీ హామీల జాబితాలో చేరుతుందని అంటున్నారు. అంతే, కాకుండా దళిత బంధు, ముఖ్యమంత్రి, ప్రభుత్వ విశ్వసనీయతను మరింత పలచన చేస్తుందని, ఫలితంగా మరో రెండేళ్లలో జరిగే సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై కూడా ఈ ప్రభావం ఉంటుందని తెరాస ఎమ్మెల్యేలు భయపడుతున్నారు. ముఖ్యమంత్రి వ్యక్తిగత ప్రతిష్టకు పోయి హుజురాబాద్’ లో గెలిఛితీరాలనే ఉద్దేశంటిఓ వేస్తున్నా అడుగులు, చేస్తున్న తప్పులు హుజురాబాద్’లో ఏమి చేస్తాయో ఏమో కానీ, తమ నియోజక వర్గాల్లో ప్రతికూల ప్రభావం చూపుతాయని ఆందోళన చెందుతున్నారు. ఒక విధాయంగా చూస్తే, దళిత బంధు, ప్రతిపక్షాల కంటే తెరాస ఎమ్మెల్యేలు, నాయుకునే ఎక్కువగా భయపెడుతోంది. తెరాస నేతల్లో దాదా పుట్టిస్తోందని అంటున్నారు.