బాబంటే భయం భయం.. బీజేపీ, వైసీపీ మైత్రికి అదే కారణం
posted on Jun 25, 2022 @ 12:40PM
బలమైన నేత ఏ రాష్ట్రానికీ ముఖ్యమంత్రిగా ఉండకూడదు. అలా అయితేనే కేంద్రం బలహీనతలపై గట్టిగా గళమెత్తే రాష్ట్రం కనిపించదు. ఇదీ మోడీ, షా ఉద్దేశం, లక్ష్యం. అందుకే ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబుకు మరోసారి అధికారం దక్కకూడదు. అందుకు ఏం చేయాలి? ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీని మరోసారి గద్దెనెక్కించేందుకు ఎలాంటి సహకారం అందించాలి. మోడీ, షా ద్వయం అనుక్షణం ఆలోచిస్తున్న విషయం ఇదే. వారి వ్యూహాలన్నీ ఏపీలో చంద్రబాబును, తెలుగుదేశం పార్టీని అడ్డుకోవడమెలా? ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ కాదు.. ఇదే వారి ఆందోళన.
ఎందుకంటే ఏపీలో జగన్ సర్కార్ పై ప్రజా వ్యతిరేకత ఏ స్థాయిలో పెల్లుబుకుతోందో వారికి బాగా అర్ధమైంది. కొంచం అటూ ఇటూలో జాతీయ స్థాయిలో మోడీ సర్కార్ పై కూడా ప్రజా వ్యతిరేకత మెండుగానే ఉంది. ఇదీ వారికి అర్ధమైంది. అయితే జాతీయ స్థాయిలో విపక్షాల అనైక్యతను అడ్డుపెట్టుకుని ముచ్చటగా మూడో సారి అధికారంలోకి రావడం నల్లేరు మీద బండి నడకేనని మోడీ, షా ద్వయం భావిస్తున్నారు. అయితే ఏపీలో జగన్ ప్రభుత్వం కూలిపోయి, చంద్రబాబు అధికారంలోకి వస్తే మాత్రం మోడీ 3.0కు అడుగడుగునా విమర్శల గండాలు తప్పవని వారు ఊహిస్తున్నారు. ఏపీలో చంద్రబాబు అధికారంలో లేకపోవడం, రాష్ట్రంలో పరిస్థితిపై ఎక్కవ దృష్టి పెట్టాల్సి రావడంతో జాతీయ రాజకీయాలలో ఆయన పెద్దగా వేలు పెట్టడం లేదని వారికి తెలుసు. అదే ఒక సారి రాష్ట్రంలో అధికారంలోనికి వస్తే జాతీయ రాజకీయాలలో ఆయన చురుకుగా పాల్గొంటారనీ, విపక్షాల ఐక్యతకు బాటలు వేయడంలో ఆయన చాంపియన్ అని బీజేపీ పెద్దలకు అనుభవ పూర్వకంగా తెలుసు.
అందుకే ఏపీలో చంద్రబాబు అధికారంలోకి రావడం తమ ఎదుగు దలకు, అధికార సుస్థిరతకు ముప్పుగా పరిణమిస్తుందని భావిస్తున్నారు. అందుకే ఆరు నూరైనా, నూరు ఆరైనా చంద్రబాబు మళ్లీ ఏపీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టకూడదు. ఇదీ హస్తినలో కమలం పార్టీ అగ్రనేతల భావన. అందుకే ఏపీలో జగన్ కు ఏ విధంగా సహాయపడాలి, మరోసారి జగన్ ను గద్దెనెక్కిస్తే.. ఏపీలో పరిస్థితి తాము తానా అంటే తానా తందానా అంటే తందానా అన్నట్లుగా ఉంటుందని వారి విశ్వాసం. అందుకే ఏపీలో జగన్ కు మరో సారి అధికారం కట్టబెట్టడంపై హస్తిన నుంచే కమలం అగ్రనేతలు పావులు కదుపుతున్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడి విషయంలో అత్యంత అమానవీయంగా కమలం పెద్దలు వ్యవహరించడానికి ఆయనకు చంద్రబాబుతో ఉన్న సత్సంబంధాలే కారణమని కమలం నేతలే బహిరంగంగా చెబుతున్నారు.
ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన బీజేపీ నేతలైతే వెంకయ్య నాయుడి విషయంలో తమ పార్టీ అగ్రనేతలు వ్యవహరించిన తీరు అత్యంత బాధాకరంగా ఉందని అంతర్గత సంభాషణల్లో అంగీకరిస్తున్నారు. క్రియాశీల రాజకీయాలలో చురుకుగా వ్యవహరిస్తున్న ఆయనను చెప్పా పెట్టకుండా, హఠాత్తుగా.. స్పష్ఠంగా చెప్పాలంటే ఆయనకు ఇష్టం లేకపోయినా బలవంతంగా ఉపరాష్ట్రపతిని చేసిన మోడీ, షా ద్వయం, ఆ సమయంలో ఆయనను తదుపరి రాష్ట్రపతిని చేస్తామని హామీ ఇచ్చారని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. అయితే నాటి హామీని విస్మరించి, ఉద్దేశపూర్వకంగా ఆయనను రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేయలేదని అంటున్నారు. ఇందుకు ఏకైక కారణం ఏపీ రాజకీయాలలో ఆయనకు ఉన్న ప్రాధాన్యత, చంద్రబాబుతో ఆయనకు ఉన్న సత్సంబంధాలే కారణమని కూడా తెలుగు రాష్ట్రాలకు చెందిన కమలం నేతలు వివరిస్తున్నారు.
అయితే వెంకయ్యనాయుడికి అన్యాయం జరిగిందనీ, ఆయనకు జరిగిన అన్యాయం బీజేపీ అగ్రనేతలు అద్వానీ, మురళీమనోహర్ జోషీలకు జరిగిన అన్యాయం వంటిదేననీ అంటున్నారు. అయితే ఈ విషయంలో పార్టీ అధిష్ఠానం వద్ద తమ నిరసనను వ్యక్తం చేసే ధైర్యం మాత్రం చేయలేమని చేతులెత్తేస్తున్నారు. ఇక పోతే చంద్రబాబు ఏపీలో ముఖ్యమంత్రిగా అధికార పగ్గాలు చేపడితే.. దక్షిణాదిపై తాము ఆవలు వదిలేసుకోవలసిందేనన్న నిర్ధారణకు వచ్చిన మోడీ, షాలు ఏపీలో చంద్రబాబుకు అన్ని విధాలుగా అవరోధాలు సృష్టించే ఎత్తుగడలతో ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం ఏపీ సీఎంగా ఉన్న జగన్ పై బీజేపీ అగ్రనాయకత్వానికి అపారమైన, అంతులేని ప్రేమాభిమానాలేమీ లేవు.
తమ చెప్పు చేతల్లో ఉండే వ్యక్తిగానే జగన్ పట్ల వారు అపేక్ష చూపుతున్నారు. అడగక ముందే మోడీ ప్రతిపాదించిన రాష్ట్రపతి అభ్యర్థికి బేషరతుగా మద్దతు ప్రకటించేసిన జగన్ పట్ల వారికి ఇష్టం లేకపోయినా.. కోపం ఎందుకు ఉంటుంది? జగన్ కోరిందే తడవుగా సీబీఐ కోర్టు విదేశీ యానానికి అనుమతి ఇచ్చేయడం, కేసు విచారణను సుదీర్ఘంగా కొనసాగేలా ఆయనకు అనుకూలంగా వాయిదాల మీద వాయిదాలు వేయడం.. మోడీయే చెప్పినట్లు రాజకీయ నాయకులపై కేసుల విచారణను సత్వరమే అంటే వీలైతే ఏడాది వ్యవధిలోనే పూర్తి చేయాలన్న భావననే వ్యక్తం చేయకపోవడం వంటి వన్నీ.. ఏపీలో తమ పల్లకి మోసే నేతగా వారు జగన్ ను గుర్తించడమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వైసీపీ పై ఏపీలో ఎంత ప్రజా వ్యతిరేకత గూడు కట్టుకుని ఉన్నా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లలో చీలిక తీసుకువస్తే అది జగన్ పార్టీకి మేలు చేకూరుస్తుందన్న అంచనాతో బీజేపీ అగ్రనాయకత్వం ఉంది.
అందుకే పవన్ కల్యాణ్ పార్టీ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోకుండా ఉండేందుకు ఆయనను జగన్ పార్టీ ఎలా రెచ్చగొడుతోందో, అంతకు మించి బీజేపీ రెచ్చ గొడుతోండటం ఇందులో భాగంగానే చూడాలి. తెలుగుదేశం, జనసేన, వైసీపీలు వేర్వేరుగా పోటీలో ఉండి, ఏపీలో త్రిముఖ పోరు అనివార్యమైన పరిస్థితి తలెత్తితే అది జగన్ కే ప్రయోజనం చేకూరుస్తుందన్నది బీజేపీ అంచనా. అందుకు అనుగుణంగానే రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు రోజు రోజుకూ మారేలా బీజేపీ అధినాయకత్వం పావులు కదుపుతోంది. రానున్న రోజులలో తెలుగుదేశం కీలక నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు తమ ప్రతాపాన్ని చూపించే విధంగా వ్యూహాలు రచిస్తోందని కమలం వర్గాల ద్వారానే తెలుస్తోంది.
తాడిపత్రిలో జేసీ సోదరుల నివాసాలపై ఈడీ దాడులను ఇందుకు ఆరంభంగా పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. చంద్రబాబును ఈ సారి అధికారానికి దూరం చేయగలిగితే తెలుగుదేశం పని ఇక అయిపోయినట్లేనని బీజేపీ, వైసీపీ భావిస్తున్నాయి. అలా కాకుండా ఈ సారి చంద్రబాబు గెలిస్తే వైసీపీ పనైపోయినట్లేననీ, అలాగే బీజేపీకి ఇక ఏపీలో ఉనికి శూన్యమేననీ కూడా ఆ పార్టీలు భావిస్తున్నాయి. ఏపీలో జనసేన టీడీపీ కలిసే అవకాశం లేకుండా బీజేపీ ఎత్తులు వేస్తోందని అంటున్నారు. మొత్తానికి ప్రజా వ్యతిరేకత ఎంత ఉన్నా.. విపక్షాలు ఏకమైనా కూడా.. బీజేపీ కేంద్ర పెద్దలు మాత్రం ఏపీలో మరోసారి వైసీపీని అధికార పీఠం ఎక్కించేందుకు సర్వశక్తులూ ఒడ్డుతాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.