తమిళ తెరపైకి మళ్ళీ శశికళ.. అన్నాడీంకేలో చీలిక తప్పదా?
posted on Oct 9, 2021 @ 11:05AM
తమిళనాడు రాజకీయాలలో పరిచయం అవసరం లేని పేర్లలో, దివంగత ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు, అన్నాడీఎంకే మాజీ ప్రధాన కార్యదర్శిగా శశికళ కూడా ఒకరు.అయితే, జయలలిత మరణంతో అనివార్యంగా అజ్ఞాతంలోకి వెళ్ళిన ఆమె, మళ్ళీ రాజకీయ తెరంగేట్రం చేసేందుకు, మరోమారు సిద్దమవుతున్నారు.
నిజానికి, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందే, జైలు నుంచి బయటకు వచ్చిన ఆమె (జయలలిత అక్రమాస్తుల కేసులో, సహా ముద్దాయిగా ఆమెకు శిక్ష పడింది. జయ మరణం తర్వాత కొద్దిరోజులకే కోర్టు శిక్ష ఖరారు చేయడంతో ఆమె జైలుకు వెళ్లారు) రాజకీయ సన్యాసం ప్రకటించారు. అయితే, ఎన్నికలలో అన్నా డిఎంకే ఓడిపోయిన నేపధ్యంలో ఆమె, మళ్ళీ వస్తున్నా’ అంటూ ఆ మధ్యన సంకేతాలు పంపించారు.అయితే కారణం ఏమిటో ఏమో కానీ ఆ తర్వాత గత కొన్ని నెలలుగా ఆమె ఎక్కడా కనిపించలేదు. వినిపించ లేదు. మరోమారు అజ్ఞాతంలోకి వెళ్లి పోయారు.
అయితే, ఇప్పుడు మరో సారి, సమయం సందర్భం చూసుకుని, నేనొస్తున్నా ..పార్టీని కాపాడుకుంటా .. అంటూ ప్రకటించారు. ఒకప్పటి అన్నా డీఎంకే అధికారపత్రిక ‘నమదు ఎంజీఆర్’లో శశికళ పేరుతో ప్రచురితమైన వ్యాసంలో ఆమె తమ రీఎంట్రీకి సబందించి, పార్టీ, రాష్ట్ర రాజకీయాల గురించి పలు ఆసక్తికరమైన, కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ పతనావస్థలోకి వెళ్లిపోతున్నాఇంకా చేతులు ముడుచుకుని కూర్చోలేనని, అందరి సహకారంతో అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తానని శశికళ ఈ వ్యాసంలో పేర్కొన్నారు. అలాగే, రీఎంట్రీకి సంబంధించి ఎదురవుతున్న అవరోధాలు, అడ్డంకులను పరోక్షంగా ప్రస్తావిస్తూ, తన సంకల్పం ముందు ఎవ్వరూ నిలవలేరని ఆమె స్పష్టం చేశారు. ప్రస్తుతం అన్నాడీఎంకేను కాపాడుకోవడమే జయలలిత అభిమాను లు, ఆమె విశ్వాసపాత్రుల ముందున్న ఏకైక లక్ష్యమని ఆ వ్యాసంలో దిశా నిర్దేశం చేశారు. మళ్లీ అమ్మ పాలనను తీసుకురావాలన్న తన లక్ష్యంలో ఎలాంటి మార్పు కూడా లేదని, తన మాటకు కట్టుబడి శాయశక్తులా కృషి చేస్తానని శశికళ ప్రకటించారు.
కొంత కాలంగా మౌనంగా ఉన్న శశికళ ఇప్పుడు మళ్ళీ, తెర మీదకు రావడం వెనక పక్కా ప్రణాళిక ఉందని అంటున్నారు. అక్టోబర్ 17 న జరిగే, అన్నాడీఎంకే స్వర్ణోత్సవాలను వేదిక చేసుకుని ముందడుగు వేసేందుకు ఆమె ప్రణాలికా బద్ధంగా పావులు కడుపుతున్నారు.ఇందులో భాగంగా ఈనెల 16వ తేదీన శశికళ స్థానిక మెరీనాతీరంలో వున్న జయ, ఎంజీఆర్‌ల సమాధులకు నివాళులర్పించనున్నారు. అక్రమాస్తుల కేసులో జైలుకెళ్లే ముందు చివరిగా జయ సమాధి వద్ద అంజలి ఘటించిన . జైలుశిక్ష ముగించుకుని చెన్నై చేరగానే జయ సమాధి వద్దకు వెళ్లాలని భావించారు. కానీ సమాధి వద్ద మరమ్మతుల పేరుతో నాటి అన్నాడీఎంకే ప్రభుత్వం ప్రజల సందర్శననే రద్దు చేసింది. దీంతో ఊరుకున్న శశికళ.. అన్నాడీఎంకే స్వర్ణోత్సవాలను పురస్కరించుకుని జయ సమాధి వద్దకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఆ మేరకు ఆమె అనుచరులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ తరువాత నేరుగా స్థానిక రామాపురం వెళ్లి, దివంగత ఎంజీఆర్ గృహంలో ఏర్పాటు చేసిన బధిరుల పాఠశాలను సందర్శిస్తారు. అక్కడ ఎంజీఆర్ విగ్రహానికి నివాళులర్పించనున్నారు. అనంతరం ఆమె ప్రజాప్రస్థానం కోసం ప్రణాళిక రూపొందించనున్నట్టు సమాచారం.
అయితే, శశికళ రాకను పార్టీలోని రెండు ప్రాధాన వర్గాలు, మాజీ ముఖ్యమంత్రి పళని స్వామి వర్గం,మాజీ ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వర్గం .. ఇద్దరు నాయకులు వ్యతిరేకిస్తున్నారు. అలాగే, తమిళనాడులో పాగా వేసేందుకు ప్రయత్నిస్తున్న అన్నాడిఎంకే మిత్ర పక్షం, బీజీపీ కూడా శశికళ రాజకీయ పునరాగమనాన్ని వ్యతిరేకిస్తోంది. ఈ నేపధ్యంలో తమిళ రాజకీయలను అవపోసన పట్టిన రాజకీయ పండితులు.శశికళ ఆశలు ఎంతవరకు ఫలిస్తాయి అనేది, ప్రశ్నార్ధకమే అంటున్నారు.