ఫేస్‌బుక్ మళ్లీ ఫసక్.. అసలేం జరుగుతోంది?
posted on Oct 9, 2021 @ 11:05AM
ఇటీవల ఏడు గంటల పాటు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌లు పని చేయలేదు. ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లు విలవిల్లాడిపోయారు. అతికష్టం మీద ప్రాబ్లమ్ సాల్వ్ చేసింది ఫేస్‌బుక్. హమ్మయ్యా.. ఇక ఏ సమస్య లేదని ఊపిరిపీల్చుకుంది. కానీ, అంతలోనే తాజాగా మరోసారి ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ సేవలకు అంతరాయం ఏర్పడింది. ఈసారి వాట్సాప్ మాత్రం సేఫ్. దీంతో.. ఫేస్‌బుక్‌కు అసలేం జరుగుతోంది? ఇది కేవలం టెక్నికల్ ఇష్యూనేనా? లేక... మరేదైనానా..? అనే అనుమానం వ్యక్తమవుతోంది.
శుక్రవారం రెండు గంటల పాటు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, మెసెంజర్ సేవలు నిలిచిపోయాయి. కాన్ఫిగరేషన్ మార్పుల్లో జరిగిన పొరబాటు కారణంగా శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా పలువురు యూజర్లకు ఫేస్‌బుక్‌కు చెందిన కొన్ని యాప్‌లు పని చేయలేదు. కొంతమంది యూజర్లకు ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఫీడ్ రాలేదు. మరికొందరికి మెసెంజర్ నుంచి మెసేజ్‌లు వెళ్లలేదు.
సమస్యను పరిష్కరించామని, ప్రస్తుతం సేవలు యథావిధిగా కొనసాగుతున్నాయని ఫేస్‌బుక్ వెల్లడించింది. ‘‘రెండు గంటల పాటు మా యాప్ సేవల్లో అంతరాయం కలిగినందుకు గానూ యూజర్లకు క్షమాపణలు తెలియజేస్తున్నాం. సమస్యను పరిష్కరించాం. ఇప్పుడు సేవలు సాధారణ స్థితికి వచ్చేశాయి. క్లిష్టపరిస్థితుల్లో మాకు అండగా నిలిచిన వినియోగదారులకు కృతజ్ఞతలు’’ అంటూ ఫేస్‌బుక్ ఓ ప్రకటన రిలీజ్ చేసింది.
టెక్నికల్ ప్రాబ్లమ్‌తో ఫేస్‌బుక్ గ్రూప్ సేవలు నిలిచిపోవడం వారంలో ఇది రెండోసారి. గత సోమవారం ఇదే కాన్ఫిగరేషన్ మార్పుల సమస్య కారణంగా ఏడు గంటల పాటు ఫేస్‌బుక్, వాట్సప్, ఇన్‌స్టాగ్రామ్ సేవలు నిలిచిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా ఫేస్‌బుక్ సేవలు స్తంభించడానికి ఆ సంస్థ చేసిన పొరపాటే కారణమని తెలుస్తోంది. ‘బ్యాక్‌బోన్ రౌటర్స్ కాన్ఫిగరేషన్’లో మార్పులు చేయడం వల్లే ఈ సమస్య తలెత్తింది. తాజాగా మరోసారి సేవలు నిలిచిపోవడంతో ఫేస్‌బుక్‌పై యూజర్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ‘‘చూస్తుంటే ఫేస్‌బుక్ వారానికి మూడు రోజులే పనిచేస్తున్నట్లుంది’’ అంటూ నెటిజన్లు కామెంట్లతో కుమ్మేస్తున్నారు.