హుజారాబాద్ బరిలో నలుగురు రాజేందర్లు.. టీఆర్ఎస్ ఎత్తులతో కమలంలో కలవరం
posted on Oct 9, 2021 @ 10:46AM
హుజూరాబాద్ ఉప ఎన్నికలకు సంబదించి ఒక కీలక ఘట్టం ముగిసింది. అక్టోబర్ 2 న మొదలైన నామినేషన్ ఘట్టం ముగిసింది. మొత్తం 61 మంది నామినేషన్ వేశారు. నామినేషన్ల చివరి రోజునే మూడు ప్రదాన పార్టీల అభ్యర్ధులు నామినేషన్ దాఖలు చేశారు. అధికార తెరాస తరపున గెల్లు శ్రీనివాస్, బీజీపీ తరపున మాజీ మంత్రి ఈటల రాజేందర్, కాంగ్రెస్ పార్టీ తరపున ఆ పార్టీ విద్యార్ధి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ పోటీలో ఉన్నారు.
కాగా మూడు ప్రధాన పార్టీల అభ్యర్ధులతో పాటు, మరో 46 మంది చివరి రోజున నామినేషన్లు దాఖలు చేశారు. ప్రధాన పార్టీ అభ్యర్ధులకు మద్దతుగా మూడు పార్టీల సీనియర్ నాయకులు హుజూరాబాద్ రావడంతో పార్టీల కార్యకర్తలలో ఉత్స్సాహం చిందులేసింది. బీజేపీ అభ్యర్ధి ఈటల వెంట ఆ పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్, తెరాస అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ వెంట మంత్రి హరీష్ రావు, ఇటీవల తెరాసలో చేరిన పది కౌశిక్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్ధి వెంట మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా నామినేషన్ల ఉపసంహరణకు, అక్టోబర్ 13 మధ్యాన్నం 3 గంటల వరకు సమయ ఉంది.ఆ తర్వాత పోటీలో ఎంత మంది ఉన్నారో అధికారికంగా ప్రకటిస్తారు.
అదలా ఉంటే, ప్రభుత్వం తమకు అన్యాయం చేసిందని ఆరోపిస్తూ, అందుకు నిరసనగా నామినేషన్ వేసేందుకు ప్రయత్నించిన నిరుద్యోగులు, ఉపాధి హామీ క్షేత్రస్థాయి సహకుల్లో కొద్ది మంది మాత్రమే చివరి రోజున నామినేషన్ వేయగలిగారు. గత కొన్ని రోజులుగా క్షేత్రస్థాయి సహాయకులు పెద్ద సంఖ్యలో నామినేషన్ వేసేందుకు ప్రయత్నించినా, ఫలితం లేక పోయింది.
అదలా ఉంటే హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేసిన వారిలో రాజేందర్ పేరుతో నలుగురు ఉన్నారు. బీజేపీ తరఫున ఈటల రాజేందర్ బరిలో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఆఖరు రోజున రాజేందర్ పేరుతో ఉన్న మరో ముగ్గురు కూడా నామినేషన్లు దాఖలు చేశారు. వారి ఇంటిపేర్లు కూడా ఈటల మాదిరిగానే ఈ (E) అనే అక్షరంతో ప్రారంభమయ్యాయి. ఇమ్మడి రాజేందర్ (రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా), ఈసంపల్లి రాజేందర్ (న్యూ ఇండియా పార్టీ), ఇప్పలపల్లి రాజేందర్ (ఆల్‌ఇండియా బీసీ ఓబీసీ పార్టీ)లు నామినేషన్లు సమర్పించారు.కాగా, నామినేషన్ దాఖలు చేసిన 61 అభ్యర్ధులలో గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్థులు 13 మంది, 43 మంది స్వతంత్రులు ఉన్నారు.
కాగా, ఈటల రాజేందర్ పేరును పోలిన పేరున్న వారిని, ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు అధికార పార్టీనే బరిలో దించిందని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే, ఇలాంటి ట్రిక్కులు అధికార పార్టీ డొల్లతనాన్ని బయట పెట్టేందుకు తప్ప ఇంకెందుకు పనిచేయవని. కమల గుర్తు ప్రజల గుండెల్లో ‘ఈటల’లా నాటుకు పోయిందని బీజేపీ శ్రేణులు విశ్వాసంతో ఉన్నాయి.