తమిళ రాజకీయాల్లో మరో సంచలనం చిన్నమ్మవస్తున్నారు ...
posted on May 31, 2021 @ 10:07AM
శశికళ... తమిళ రాజకీయాల్లో పరిచయం అవసరం లేని పేరు. సుదీర్ఘ కాలంపాటు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చలిగా సర్వం తానైన సహచరిగా, చిన్నమ్మగా చక్రం తిప్పిన చరిత్ర అమెది. ఆమె స్కెచ్ గీస్తే, అంతే, కసక్ ‘ అంతటి ఘటనా ఘటన సమర్ధురాలు. అయినా ఆమె, కొంతకాలంగా కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు, జైలు నుంచి బెయిలుపై విడుదలై వచ్చినా, ఆమె కాలానికి తలొగ్గి, రాజకీయాలకు దూరంగా ఉండడమే కాదు, రాజకీయ సన్యాసం సైతం ప్రకటించారు.
అయితే, ఇప్పుడు కాలం కలిసొచ్చిందని కాదు కానీ, పరిస్థితులలో మార్పు వచ్చింది. ఈ నేపధ్యంలో ఆమె, రీఎంట్రీ సంకేతాలు ఇచ్చారు. మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి, మాజీ ఉపముఖ్యమంత్రి పన్నీర్’సెల్వం వర్గాల మధ్య అతర్గత కుమ్ములాటలతో కుదిలైన ‘ఎఐఎడిఎంకే’ను రక్షించేందుకు, తాను త్వరలో క్రియాశీల రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నాని ప్రకటించారు. అంతర్గత కుమ్ములాటలో పార్టీ ఏమైపోతుందో అని ఆందోళన చెందుతున్న ‘ఎఐఎడిఎంకే’ కార్యకర్తలకు ఆమె, ‘నేను వస్తున్నా... నేను వచ్చేస్తున్నా’ అని భరోసా ఇస్తున్నారు.
గత కొద్దిరోజులుగా పార్టీ నాయకులు, కార్యకర్తలకు టెలిఫోన్’లో అందుబాటులోకి వచ్చిన చిన్నమ్మ, కోవిడ్ సెకండ్ వేవ్ తగ్గిన తర్వాత వచ్చి పార్టీని చక్కదిద్ది పట్టాల మీదకు తెస్తానని, ధైర్యం చెపుతున్నారు. ‘భయపడకండి.. కొవిడ్ సెకండ్ వేవ్ తగ్గిన తర్వాత నేను వస్తాను’ పార్టీని చక్కదిద్దుతాను’ లారెన్స్ అనే పార్టీ అభిమాని ఫోన్’లో ఆందోళన వ్యక్త పరిచి నప్పుడు, ఆమె చెప్పిన మాటలు ఇవి. ఈ వీడియో క్లిప్పింగ్ ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. అలాగే, తంజావూర్ నుంచి సురేష్ అనే మరో కార్యకర్తతోనూ ఫోన్’లో మాట్లాడిన ఆమె, “పార్టీ నాశనమై పోతుంటే, మౌనంగా చూస్తూ ఉండలేను” అంటూ ఆమె పళనిస్వామి, పనీర్ సెల్వం మధ్య సాగుతున్న బహిరంగ పోరు పట్ల కూడా ఆమె విచారం వ్యక్తం చేశారు.అంతేకాదు “ఇక ఆలస్యం చేయను కొవిడ్ ఉదృతి తగ్గగానే, శుభ వార్త తో వచ్చేస్తాను,ఇది ఖాయం” అని స్వరం పెంచి చెప్పారు. ఈ వీడియో కూడా బాగా వైరల్ అవుతోంది. అలాగే, పార్టీని పెంచి పెద్దచేయడంలో ఎన్నో త్యాగాలు చేశామని గుర్తు చేసుకున్నారు.ఆ త్యాగాలు వృధా కానీయనని,అన్నారు.
అదలా ఉంటే, ఈ వీడియోలు, వాటిలో వినవచ్చిన సంభాషణ అంతా నిజమే అని, శశికళ సన్నిహత వర్గాలు, ఆమెతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్న, అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం (ఏఎంఎంకే) వర్గాలు దృవీకరిస్తున్నాయి. అంతే కాదు, ప్రస్తుతం అన్నాడిఎంకేలో చోటు చేసుకుంటున్న పరిణామాలను జాగ్రత్తగ గమనిస్తున్న ఆమె, మరో ఒకటి రెండు నెలల్లో క్రియాశీల రాజకీయాల్లోకి రావడం ఖాయమని సన్నిహిత వర్గాలు చెపుతున్నాయి.
నిజానికి, ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించిన సమయంలోనే, ఆమె వ్యూహత్మకంగానే వెనకడుగు వేశారని , సన్యాసం ప్రకటించారని, ఎన్నికల అనంతరం ఆమె రీఎంట్రీ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు ముందుగానే ఊహించారు. ఇప్పుడు అదే జరుగుతోంది. అలాగే, ఇప్పుడు వీడియో క్లిప్పింగ్స్ విడుదల చేయడం కూడా ఆమె రాజకీయ ఎత్తుగడలో భాగమనే విశ్లేషకులు పేర్కొంటున్నారు. పార్టీ, ప్రజల పల్స్ పట్టుకునేందుకు ఆమె వీడియో క్లిప్పింగ్స్ విడుదల చేశారని, అలాగే, ఆమె రీఎంట్రీ పై రాజకీయ వర్గాల్లో, సామాన్య ప్రజల్లో చర్చ కోరుకుంటున్నారని, ఈ ఫీడ్ బ్యాక్ ఆధారంగా ఆమె తదుపరి నిర్ణయం ఉంటుందని అంటున్నారు. అలాగే, ఆమె త్వరలో కార్యకర్తలు, అభిమానులను నేరుగా కలుసుకోవడం, సమావేశాలు నిర్వహించడం కూడా ఉంటుందని, సన్నిహిత వర్గాలు చెపుతున్నాయి. మొత్తానికి జయ సమాధి వద్ద, శపధం చేసి జైలుకు వెళ్ళివచ్చిన చిన్నమ్మ ఇప్పుడు ఆ శపధం నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నారా... బుల్లి తెరపై త్వరలో చూద్దాం.