మీ నిధులు మీ ఇష్టం.. సర్పంచులకు మనీ పవర్ ..
posted on Mar 27, 2021 @ 4:55PM
గ్రామ పంచాయితీ నిధుల తాళాలు సర్పంచులకే. ఇక సర్పంచులకు పండగ స్టార్ట్ అయితుంది. నిధులు వాడడంలో ఇకపై ఎవరి ఆమోదం లేదు. గ్రామానికి వారే రాజులూ.. వారే మంత్రులు. గ్రామ పంచాయతీల నిధులను, పై అధికారుల అనుమతి లేకుండానే, ఆయా గ్రామలోని ప్రజలు, పంచాయితీల తీర్మానం మేరకే నిధులు ఖర్చు చేసుకునే వెసులుబాటు కల్పిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. శనివారం దీనికి సంబంధించి ప్రభుత్వం జీవో 91 ని జారీ చేసింది. ఇక నుంచి స్థానిక అవసరాల మేరకు నిధులను ఖర్చుచేసుకునే దిశగా పంచాయతీలకు హక్కు లభిస్తుంది. గ్రామ నిధులకు కేటాయించిన నిధులు దుర్వినియోగం చెయ్యకుండా గ్రామ సభ ఆమోదం మేరకు గ్రామ అవసరాలకు గ్రామంలో ఉన్న పనులు పూర్తి చేపట్టాల్సి ఉంటుంది. ఆయా పనులన్నీ నిబంధనల మేరకు మాత్రమేగాక, ఆ ఆర్థిక సంవత్సర కేటాయింపులకు మించకుండా మాత్రమే ఖర్చు చేయాలని ప్రభుత్వం ఆ జీవోలో తెలిపింది.
ఈ జీవో రావడం వల్ల ఇప్పటికే పల్లె ప్రగతి, పారిశుద్ధ్యం, పచ్చదనం మరింతగా పరుగులు పెడతాయని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు . వెంటనే జీవో జారీ చేసిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఈ జీవో ద్వారా రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల సర్పంచ్ లు, ఉప సర్పంచ్ లు, వార్డు సభ్యులు, ప్రజలకు పిలుపునిచ్చారు.
భారతదేశంలో ఎక్కడ లేని విధంగా పల్లె ప్రగతి చేపట్టిన సీఎం, ఈ జీవో తో గ్రామాలు మరింత వేంగంగా అభివృద్ధి చెందడానికి వీలు కలుగుతుందని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. ఎక్కడ ఎలాంటి వివాదాలకు తావు లేకుండా, నిధుల దుర్వినియోగం జరగకుండా, పనులు నాణ్యతతో జరిగే విధంగా గ్రామ పంచాయతీల బాధ్యులు నడుచుకోవాలని ఆయన సూచించారు.