మళ్లీ సమైక్యాంధ్ర.. రాజుకుంటున్న రాజకీయ రచ్చ..
posted on Oct 30, 2021 @ 8:26PM
నిప్పు లేనిదే పొగ రాదు. ముందు చిన్నగా నిప్పు పెడతారు. ఆ తర్వాత పొగ బయటకు వస్తుంది. దాన్ని ఊది ఊది అగ్గి రాజేస్తారు. ఆ రాజకీయ మంటలో చలి కాచుకుంటారు. ఇక కుంపటి కార్చిచ్చులా వ్యాపిస్తుందో.. లేక, చప్పున చల్లారుతుందో తెలీదు కానీ.. ఆలోగా జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతుంది. అదే రాజకీయం. ఏపీ-తెలంగాణలో ఇప్పుడదే జరుగుతోందని అంటున్నారు.
కేసీఆర్ ఓ మాటన్నారు. దానికి ఏపీ మంత్రి పేర్ని నాని మరింత ఎగదోశారు. ఆ అవకాశాన్ని రేవంత్‌రెడ్డి సరిగ్గా అందిపుచ్చుకున్నారు. ఇక, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆ అగ్గి మీద గుగ్గిలం వేశారు. ఇక అంతే. సమైక్యాంధ్రపై రాజకీయ రచ్చ మొదలైపోయింది. రెండు రాష్ట్రాల్లో ఇంట్రెస్టింగ్ డిబేట్ నడుస్తోంది.
"కేసీఆర్, జగన్‌రెడ్డి మొదటి నుంచీ కవలల్లా వ్యవహరిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రం కోసం ఆలోచిస్తున్నారు. షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టడం, ఆమె పాదయాత్రలో విజయమ్మ పాల్గొనడం, టీఆర్ఎస్ ప్లీనరీలో తెలుగుతల్లి ప్రత్యక్షం కావడం, ఏపీలో పార్టీ పెట్టమని కోరుతున్నారంటూ కేసీఆర్ అనడం, ఏపీ మంత్రి పేర్ని నాని.. రెండు రాష్ట్రాలు కలిసిపోతే పోలా అనడం, ఆయన వ్యాఖ్యలను కేసీఆర్, టీఆర్ఎస్ మంత్రులు ఖండించకపోవడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. జగన్ జైలుకు వెళ్లే పరిస్థితి ఉందని ఆయన సొంత పార్టీ నేతలే అంటున్న నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్రానికి సీఎం కావాలని కేసీఆర్ అనుకుంటున్నట్లుంది. రాజ్య విస్తరణ, అక్కడి అపారమైన ఖనిజ సంపదపై కేసీఆర్ కన్నేసి ఉండొచ్చు’’ అని రేవంత్‌రెడ్డి చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. నిజమేనా..? అనిపించేలా ఉన్నాయి. రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు, జరుగుతున్న విషయాలకు కాస్త పొంతన కుదురుతుండటంతో.. తెరవెనుక సమైక్యాంధ్ర పావులు కదులుతున్నాయా? అనే అనుమానం బలపడుతోంది. ఆ చర్చను మరింత బలపరిచేలా తాజాగా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఓపెన్ స్టేట్‌మెంట్ ఇవ్వడం కలకలం రేపుతోంది.
సీఎం కేసీఆర్ సమైక్య వాదంతో ముందుకొస్తే తాను మద్దతిస్తానని ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పష్టం చేశారు. ‘‘ఉద్యమ సమయంలోనూ సమైక్య వాదాన్నే వినిపించా. ఆంధ్ర, తెలంగాణ నాయకులు మళ్లీ సమైక్యాన్ని తెరపైకి తెచ్చారు. గతంలో నేను అన్నట్టుగానే ఇప్పుడు ఒక్కొక్కరు సమైక్యానికి అనుకూలంగా మాట్లాడుతున్నారంటూ కేసీఆర్, పేర్ని నాని వ్యాఖ్యలను ఉంటంకించారు జగ్గారెడ్డి.
జగన్ జైలుకెళ్తే.. రెండు రాష్ట్రాలను కలిపేస్తే.. గతంలో ఏపీ ఆధిపత్యంలో తెలంగాణ ఉన్నట్టు.. ఇప్పుడు తెలంగాణ నేతలు ఏపీని గుప్పిట్లోకి తీసుకునే ప్రయత్నం జరుగుతోందా? అనే చర్చ రేవంత్‌రెడ్డి మాటల తర్వాత మొదలైంది. అయితే, సమైక్యాంధ్ర రచ్చ ఇప్పుడే మొదలైనా.. ముందుముందు ఇది ఎలాంటి మలుపులు తిరుగుతుందోననే టెన్షన్ అందరిలోనూ కనిపిస్తోంది. మళ్లీ తెలుగురాష్ట్రాల్లో ఉద్యమాలు, తెలుగు ప్రజల మధ్య ఉద్రిక్తతలు తప్పవా? ఈ రాజకీయ రచ్చ..రొచ్చుగా మారుతుందా? ఏమో...