పిల్ల సజ్జలకు ఉద్వాసన! సోషల్ మీడియా బాధ్యతల నుంచి ఔట్!
posted on Jun 20, 2024 @ 9:30AM
వైసీపీ సోషల్ మీడియా వింగ్ చీఫ్ గా జగన్ పిల్ల సజ్జల ( అదే సజ్జల కుమారుడు సజ్జల భార్గవ రెడ్డి)కు ఉద్వాసన చెప్పేశారా? సజ్జల రామకృష్ణారెడ్డిని కూడా ఇక మీడియా ముందుకు రావద్దు సమావేశాలకు వచ్చి బుద్ధిగా చెతులు కట్టుకుని కూర్చుని వెళ్లి పోతే చాలు అని ఆంక్షలు విధించారా? పార్టీ అధికారికంగా ఇందుకు సంబంధించి ఎలాంటి ప్రకటనా విడుదల చేయలేదు కానీ, సజ్జల, పిల్ల సజ్జలల సీన్ వైసీపీలో అయిపోయిందన్న చర్చ మాత్రం పార్టీ వర్గాల్లో విస్తృతంగా జరుగుతోంది.
వైసీపీ సోషల్ మీడియా వ్యవహారాలకు పిల్ల సజ్జలను దూరంగా ఉంచారని సోదాహరణంగా పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. పిల్ల సజ్జల వైసీపీ సోషల్ మీడియా వింగ్ కు చీఫ్ గా ఉన్న సమయంలో తెలుగుదేశం నేతలు, ముఖ్యొంగా మహిళా నేతలపై అనుచిత పోస్టింగ్ లు కుప్పతెప్పలుగా ఉండేవి. వీటిపై అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు ఆ ఫిర్యాదులను స్వీకరించని పరిస్థితి ఉండేది. అయితే ఇప్పడు వైసీపీ అధికారంలో లేదు. వైసీపీ సోషల్ మీడియా అనుచిత పోస్టుల బాధితురాలు వంగలపూడి అనిత ఇప్పుడు హోం మినిస్టర్. దీంతో గతంలో వైసీపీ సామాజిక మాధ్యమంలో అనుచితంగా, అసభ్యంగా పెట్టిన పోస్టుల కారణంగా ఇబ్బందులు పడిన వారు, బాధలు పడిన వారు ఇప్పుడు ఫిర్యాదులు చేయడానికి ముందుకు వస్తున్నారు. పార్టీ పరాజయం పాలు కాగానే సజ్జల భార్గవ వైసీపీ సోషల్ మీడియా కార్యాలయానికి తాళం వేసి అజ్ణాతంలోకి వెళ్లి పోయారు. ఆయన తండ్రి సజ్జల కూడా కొన్ని రోజులు ఎవరికీ వినిపించకుండా, కనిపించకుండా ముఖం చాటేసినప్పటికీ.. ఇటీవల జగన్ నిర్వహించే సమావేశాలకు హాజరై మౌనంగా ఓ మూలన కూర్చుంటున్నారు.
ఒక దశలో తండ్రీ కొడుకులు అజ్ణాతంలోకి వెళ్లి పోయారనీ, వారి ఫోన్లు కూడా స్విచ్ఛాఫ్ ఉన్నాయనీ పార్టీ వర్గాల్లోనే గట్టిగా వినిపించింది. సోషల్ మీడియా, పార్టీకి సంబంధించి పెద్ద ఎత్తున ఆర్థిక అవకతవకలు జరిగాయనీ, దీనిపై జగన్ ఆగ్రహంగా ఉన్నారనీ, వారి గురించి వాకబు చేస్తున్నారనీ కూడా పార్టీ వర్గాలు చర్చించుకున్న పరిస్థితి. సరే ఇప్పుడు సజ్జల జగన్ భేటీలలో కనిపిస్తున్నా పిల్ల సజ్జల మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. పార్టీ సోషల్ మీడియా విభాగం ఇన్ చార్జ్ అయిన సజ్జల భార్గవరెడ్డి అజ్ణాతంలోకి వెళ్లడంపై పార్టీలోనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పిల్ల సజ్జలకు పార్టీ సోషల్ మీడియా వింగ్ అధిపతి పోస్టు నుంచి జగన్ ఉద్వాసన పలికారనీ, భార్గవ నేతృత్వంలో పార్టీ సోషల్ మీడియా అతి కారణంగానే వైసీపీ ఓటమికి కారణాలలో ఒకటిగా జగన్ భావిస్తుండటంతో ఆయనపై ఆగ్రహంగా ఉన్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. మొత్తం మీద పిల్ల సజ్జల సీన్ సితార అయినట్లేనని అంటున్నారు.