పవన్ కల్యాణ్ స్పీడ్ మామూలుగా లేదుగా?
posted on Jun 20, 2024 9:26AM
పవన్ కల్యాణ్ అనగానే ఆయన సమయ పాలన విషయంపై పెద్దగా దృష్టి పెట్టరన్న భావన అందరిలోనూ ఉంది. అయితే అది అపప్రద మాత్రమేనని పవన్ కల్యాణ్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజే రుజువు చేశారు. ప్రజా సమస్యల విషయంలో ఇసుమంతైనా ఉదాశీనత ప్రదర్శించబోనని తన తీరు ద్వారా స్పష్టం చేశారు. ఔను ముంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజే ఆయన మినిస్టర్ ఆన్ డ్యూటీ అన్నట్లుగా పనిలోకి దిగిపోయారు. తన శాఖలపై సుదీర్ఘ సమీక్ష చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో భేటీ అయ్యారు. ప్రజా సమస్యలపై పనుల వేగవంతంపై చర్చించారు.
ఔను ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జనసేనాని పవన్ కల్యాణ్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన క్షణం నుంచే పనిలో దిగిపోయారు. బుధవారం (జూన్ 19)న ఆయన సెక్రటేరియెట్ లోని తన చాంబర్ లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అంతే ఆ క్షణం నుంచీ ఆయన డ్యూటీ మొదలెట్టేశారు. తొలి రోజే ఆయన అధికారులతో తన శాఖలపై సమీక్ష నిర్వహించారు. ఆ సమీక్ష కూడా అలా ఇలా కాదు ఏకంగా పది గంటల పాటు సాగింది. అధికారులకు ఆయన మూడు నెలల టార్గెట్ ఫిక్స్ చేశారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీశాఖ అధికారులకు ఆయన రోడ్ల నిర్మాణం, మౌలిక వసతుల కల్పన, గ్రామాలలో నీటి కొరత పరిష్కారం తదితర అంశాలపై కార్యాచరణ ప్రణాళిక రెడీ చేయాలని ఆదేశించారు. ఈ సమస్యలన్నీ మూడు నెలల్లో పరిష్కారం కావాలని నిర్దేశించిచారు. అలాగే మూడు నెలలలో వివిధ అంశాలపై సాధించాల్సిన లక్ష్యాలపై టార్గెట్ ఫిక్స్ చేశారు.
పవన్ కల్యాణ్ ప్రధానంగా గ్రామాలలో రోడ్ల నిర్మాణంపై దృష్టి సారించారు. అలాగే మౌలిక వసతుల కల్పన, తాగునీటి సమస్యపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యాన్ని ఎంత మాత్రం ఉపేక్షించబోనని హెచ్చరించారు. ఈ సుదీర్ఘ సమీక్ అనంతరం పవన్ కల్యాణ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ తో తన క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు. తాను మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలి సంతకాన్ని జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేసే ఫైలుపై సంతకం చేశారు. రెండో సంతకం గిరిజన గ్రామాల్లో పంచాయతీ భవనాల నిర్మాణం దస్త్రంపై రెండో సంతకం చేశారు.