ముద్రగడ.. ఇక పద్మనాభ రెడ్డి!
posted on Jun 20, 2024 @ 10:16AM
ముద్రగడ పద్మనాభం అనే పేరు ఇప్పుడు అధికారికంగా ముద్రగడ పద్మనాభరెడ్డిగా మారిపోయింది. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ను ఇక నుంచి ఎవరైనా సరే పద్మనాభ రెడ్డి అనే పిలవాల్సి ఉంటుంది. ఎందుకంటే పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిచే ప్రశక్తే లేదనీ, ఒక వేళ ఆయన గెలిస్తే తన పేరును పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని ముద్రగడ సవాల్ చేసిన సంగతి తెలిసిందే. సరే ఎన్నికలు జరిగాయి, ఫలితాలు వచ్చాయి. పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించడమే కాదు.. ఏపీ ఉపముఖ్యమంత్రి కూడా అయ్యారు.
ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత ముద్రగత తన పేరును పద్మనాభ రెడ్డిగా మార్చాలంటూ దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పుడు ఆయన పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా మారుస్తూ ప్రభుత్వ గెజిట్ నోటిఫికేషన్ కూడా వెలువడింది. దీంతో ముద్రగడ పద్మనాభం కాదు ఆయన ముద్రగడ పద్మనాభ రెడ్డి అయిపోయారు.
ముద్రగడ ఓ దశలో పవన్ కళ్యాణ్‌పై వ్యక్తిగత విమర్శలు చేయడం వివాదాస్పదంగా మారింది. కాపు ఉద్యమనేతగా, సుదీర్ఘకాలం ఆ సామాజిక వర్గానికి పెద్ద దిక్కుగా ముద్రగడ ఉన్నారు. ఆయన క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న సమయంలో కూడా కాపు రిజర్వేషన్ల కోసం పోరాటం చేశారు. చివరకు తన పెద్దరికాన్ని తానే దిగజార్చుకుని కువిమర్శలతో కాపు సామాజికవర్గంలో పలుచన అయ్యారు. ఇప్పుడు తన సామాజికవర్గానికి దూరమయ్యారు.