రౌండప్ 2022..గుజరాత్ లో మళ్లీ బీజేపీ ప్రభంజనం
posted on Dec 30, 2022 @ 10:47AM
డిసెంబర్
కొత్త సంవత్సరం వచ్చేస్తోంది. పాత సంవత్సరానికి వీడ్కోలు పలికే సమయం వచ్చేసింది. 2022 మోస్ట్ హ్యాపెనింగ్ ఇయర్ గా చెప్పుకోవచ్చు. కొద్ది రోజుల్లో 2022 వెళ్ళిపోతుంది. 2023 సంవత్సరం వచ్చేస్తుంది. క్యాలెండరు మారి పోతుంది. స్వాగత తోరణాలు, వీడ్కోలు వేడుకలు షరా మాములే ... కాలచక్రం కదులుతూనే ఉంటుంది... కానీ, వెళ్ళిపోతున్న 2022 సంవత్సరం, ఏమి సాధించింది, ఏమి మిగిల్చింది, ఏది పట్టుకు పోయింది, ఏమి బోధించింది, ఒక సారి వెనక్కి తిరిగి చూసుకుంటే .. సంవత్సర కాలంలో చెరగని ముద్ర వేసిన చేదు తీపి జ్ఞాపకాలను ఒక సారి సింహవలోకనం చేసుకుంటే..
డిసెంబర్ 1.. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 189 స్థానాలకు గానూ 89 నియోజక వర్గాల్లో జరిగిన మొదటి విడత పోలింగ్లో 56.8 శాతం పోలింగ్ జరిగింది . రెండవ తుది విడత పోలింగ్ డిసెంబర్ 5 న జరుగుతుంది. డిసెంబర్ 8న ఓట్ల లెక్కింపు.
భారత దేశం జీ 20 అధ్యక్ష పదవిని స్వీకరించింది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా వివిధ ప్రదేశాలలో 32 వేర్వేరు రంగాలలో 300 సమావేశాలు నిర్వహించారు. కాగా, విదేశాంగ సఖ మంత్రి జైశంకర్ జీ 20 అధ్యక్ష పీఠం నుంచి భారత దేశం, ప్రపంచానికి తన గళాన్ని వినిపిస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్త పరిచారు.
డిసెంబర్ 3.. ఏటా కేంద్ర ప్రభుత్వం అందించే జాతీయ క్రీడా అవార్డుల జాబితా విడుదలైంది. ఈ ఏడాదికి గాను మొత్తం 40 మందిని ఎంపిక చేశారు. భారత టేబుల్ టెన్నిస్ వెటరన్ ఆటగాడు శరత్ కమల్ కు అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు లభించింది. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ లో అతను 3 బంగారు పతకాలు, ఒక రజతం సాధించాడు.
డిసెంబర్ 4.. నేడు భారత నౌక దినోత్సవం .. నేవీ డే ..ఈ సందర్భంగా...దేశమంతా నేవీ సేవల్ని స్మరించుకుంటోంది. 1971లో భారత్, పాకిస్థాన్ యుద్ధ సమయంలో "ఆపరేషన్ ట్రిడెంట్" తో విజయం సాధించింది నావికా దళం. ఆ విజయానికి గుర్తుగా ఏటా డిసెంబర్ 4వ తేదీన భారత నౌకా దళ దినోత్సవం జరుపుకుంటారు. ఈ దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశంలోని ప్రముఖులంతా నేవీ సేవలపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
డిసెంబర్ 5.. గుజరాత్ రెండవ దశ ఎన్నికలు ముగిశాయి. మొత్తం 93 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ జరిగింది. రెండవ దశలో మొత్తం 2.54 కోట్ల ఓటర్లు (59శాతం) ఓటు హక్కు వినియోగించుకున్నారు.
డిసెంబర్ 8.. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ ప్రభంజనం సృష్టించింది. మొత్తం 182 అసెంబ్లీ సీట్లకు గాను బీజేపీ 156 స్థానాలను కైవసం చేసుకుంది. కాంగ్రెస్ 17, ఆమాద్మీ 5 సీట్లలో విజయం సాధించింది. ఇతరులకు 4 స్థానాలు వచ్చాయి. హిమాచల్ ప్రదేశ్ లో మాత్రం ఆ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఎన్నికలు జరిగిన ప్రతిసారీ.. ప్రభుత్వాన్ని మార్చే సంప్రదాయాన్ని..అక్కడి ప్రజలు ఈసారి కూడా కొనసాగించారు. బీజేపీని ఓడించి.. కాంగ్రెస్‌కు అధికారం కట్టబెట్టారు.
డిసెంబర్ 10.. ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం. 1948లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఆమోదించిన రోజు, మానవ హక్కుల సార్వత్రిక ప్రకటన వెలువడిన రోజు. ఈ సంవత్సరం దరికీ సమాన గౌరవం, స్వేచ్ఛ సమ న్యాయం’ అనే థీమ్’ ప్రధాన అంశంగా జరుపుకుంటున్నారు.
డిసెంబర్ 15.. మహారాష్ట్ర-కర్ణాటక సరిహద్దు వివాదం రాజ్యాంగ పద్ధతుల ద్వారా మాత్రమే పరిష్కరించబడుతుందని, రహదారిపై కాదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఈ విషయాన్ని రాజకీయం చేయొద్దని ఇరు రాష్ట్రాలను కోరారు.కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేలతో సమావేశం అనంతరం షా మాట్లాడుతూ, సమస్యను పరిష్కరించడానికి రెండు రాష్ట్రాల మంత్రులతో ఆరుగురు సభ్యుల ప్యానెల్‌ను కేంద్రం ఏర్పాటు చేసిందని చెప్పారు.
డిసెంబర్ 22.. ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలలో కొవిడ్ కేసుల పెరుగుతున్న నేపధ్యంలో రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా సూచించారు. ఈ మేరకు అయన లోక్ సభలో ఒక ప్రకటన్ చేశారు ముఖ్యంగా రాబోయే పండుగలు,నూతన సంవత్సర వేడుకల దృష్ట్యా అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు.
డిసెంబర్ 26... ప్రజల్లో న్యూనతాభావాన్ని కలిగించడానికి చరిత్ర పేరుతో కల్పిత కథనాలు బోధించారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. వీటిని అధిగమించి ముందుకు సాగాలంటే తొలుత సంకుచిత భావజాలం నుంచి విముక్తి పొందాల్సిన అవసరం ఉందన్నారు. ఈ క్రమంలో దీర్ఘకాలంలో కోల్పోయిన వారసత్వాన్ని పునరుద్ధరించేందుకు గతంలో చోటుచేసుకున్న తప్పిదాలను నవీన భారత్ సరిదిద్దుతోందని అన్నారు. గురు గోవింద్ సింగ్ వారసుల త్యాగాలను గుర్తుచేసుకుంటూ.. తొలిసారి నిర్వహించిన ‘వీర్ బాల్ దివస్’ కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొని ప్రసంగించారు.
డిసెంబర్ 26..భారత్‌కు వ్యతిరేకంగా చేతులు కలిపిన చైనా, పాకిస్థాన్‌లు మన దేశంపై ఎప్పుడైనా దాడి చేయొచ్చని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యపై స్పందించిన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ రాహుల్ గాంధీ ఇంకా 1962ల్లోనే జీవిస్తున్నారని విమర్శించారు.
డిసెంబర్27.. దేశంలో కోవిడ్ ఎమర్జెన్సీ సన్నద్ధతను అంచనా వేసేందుకు దేశంలోని అన్ని ప్రధాన ఆసుపత్రుల్లో మాక్ డ్రిల్ నిర్వహించారు. జమ్మూ మరియు కాశ్మీర్ నుండి అగ్నిపథ్ పథకం కింద ఎంపికైన అగ్నివీర్ల మొదటి బ్యాచ్ భారత సైన్యంలో చేరింది.భోపాల్‌లో జరిగిన మహిళల బాక్సింగ్ జాతీయ ఛాంపియన్‌షిప్‌లో లోవ్లినా బోర్గోహైన్ మరియు నిఖత్ జరీన్ స్వర్ణ పతకాలను గెలుచుకున్నారు.
డిసెంబర్ 29.. బ్రెజిల్ దిగ్గజం, ఫుట్‌బాల్ అత్యుత్తమ క్రీడాకారుల్లో ఒకరైన పీలే(82) కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న పీలే సావోపాలోలోని ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
డిసెంబర్ 29.. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కేవలం పార్టీని నడుపుతారని, గాంధీ కుటుంబం చేతిలోనే నాయకత్వం ఉంటుందని ఆ పార్టీ నేత సల్మాన్ ఖుర్షీద్ కీలక వ్యాఖ్యలు చేశారు. దాంతో ఆయన మాటలు మరోసారి చర్చనీయాంశం అయ్యాయి. ఈ వ్యాఖ్యలు బీజేపీకి అస్త్రంగా మారాయి.
భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా కు లేఖ పై సీఆర్ పీఎఫ్ స్పందించింది. సెక్యూరిటీ విషయంలో సిబ్బంది నిర్లక్ష్యంలేదని, రాహుల్ గాంధీ భద్రతా మార్గదర్శకాలను తరచూ ఉల్లంఘించారని పేర్కొంది. 2020 నుంచి ఇప్పటి వరకు 113 సార్లు భద్రతా మార్గదర్శకాలను రాహుల్ అతిక్రమించారని, ఈ విషయాన్ని ఆయనకు కూడా తెలియజేసినట్లు వివరించింది.
తెలంగాణలో గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి తెరలేచింది. మొత్తం 783 ఉద్యోగాలకు టీఎస్ పీఎస్ సీ నేడు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో అత్యధికంగా 165 అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (జనరల్ అడ్మినిస్ట్రేషన్) ఉద్యోగ ఖాళీలు ఉండగా, 126 మండల్ పంచాయత్ ఆఫీసర్ పోస్టులు, 98 తహసీల్దార్ పోస్టులు ఉన్నాయి.
మధ్యాహ్నం 12:27 గంటలకు గౌహతికి ఈశాన్య ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 3.5 తీవ్రతతో భూకంపం వచ్చింది. భూకంపం యొక్క లోతు భూమికి 10 కిలోమీటర్ల లోతులో ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది.
డిసెంబర్ 30.. ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్(100) కన్నుమూశారు. రెండు రోజుల క్రితం ఆమె అనారోగ్యానికి గురికావడంతో అహ్మదాబాద్‌లోని యు.ఎన్.మెహతా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందతున్న హీరాబెన్ ఆరోగ్యం విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఇటీవలే ఆమె వందో పుట్టినరోజు వేడుకలు జరిగాయి.