కొత్త సంవత్సరంలోకి పాత పంచాయతీ
posted on Dec 30, 2022 @ 11:16AM
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గడచిన సంవత్సరాలు ఒకెత్తు అయితే 2022 సంవత్సరం ఒక్కటీ ఒకెత్తు అన్నట్లుగా రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. కేంద్ర రాష్ర్త ప్రభుత్వాల మధ్య దూరం పెరిగింది. సంవత్సరం ఆరంభంలో కేంద్రం పై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన యుద్ధం, చినికి చినికి గాలి వానగా మారింది. మరో వంక, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ గత సంవత్సరం చివర్లో ( నవంబర్ 2021) జరిగిన హుజురాబాద్ ఉప ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించిన ఉత్సాహంతో రాష్ట్రంపై దృష్టిని కేంద్రీకరించింది.
జులైలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను హైదరాబాద్ లో నిర్వహించి... రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెరాసకు సవాల్ విసిరింది. మరో వంక జాతీయ స్థాయిలో బీజేపీని దీటుగా ఎదుర్కొనేందుకు తెరాస అధినేత , ముఖ్యమంత్రి కేసిఆర్ బీజేపీ యేతర, కాంగ్రెస్సే తర పార్టీలను ఏకం చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు సాగించారు.. అయితే, ఆశించిన స్థాయిలో ఫలితాలు రాక పోవడం వల్లనో ఏమో .. కూటమి ప్రయత్నాలు పక్కన పెట్టి, తెరాస పేరును భారత రాష్ట్ర సమితి ( బీఆర్ఎస్) గా మార్చి జాతీయ రాజకీయాల్లో అరంగేట్రం చేశారు. అయితే ఆ ప్రయత్నాల సంగతి ఎలా ఉన్నా.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పెరిగిన దూరం రాజకీయంగా బీజేపీ, బీఆర్ఎస్ మధ్య పెరిగిన వైరం సంవత్సరం చివరకు వచ్చే సరికి మూడు వివాదాలు .. ఆరు కొట్లాటలు చందంగా మారింది. స్కాములు, సిబిఐ విచారణలు, ఈడీ దాడులు, కోర్టు విచారణలు, అరెస్టులుగా కథ నడుస్తోంది.
ముఖ్యంగా ఢిల్లీ రాష్ట్రంలో చోటుచేసుకున్న మద్యం స్కామ్ తెలంగాణను కుదిపేసింది. మద్యం స్కాంలో భాగంగా తెలంగాణ వైపు దర్యాప్తు సంస్థలు తిరిగి చూశాయి. హైదరాబాదులో ముడుపులు పట్టుకున్నాయి. ముడుపులు, పర్మిట్ల బాగోతంలో ఏపీకి చెందిన మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుటుంబ సభ్యులతో పాటు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, బోయినపల్లి అభిషేక్ రావు తదితరుల పేర్లు ఛార్జీషీటులోకి ఎక్కాయి.
నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపీ తరపున కొందరు ప్రయత్నించడం ఈ ఏడాది తెలంగాణ రాజకీయాల్లో మరో హైలైట్ గా నిలిచింది. గువ్వల బాలరాజు, రోహిత్ రెడ్డి, రేగా కాంతారావు, హర్షవర్ధన్ రెడ్డి బీజేపీలో చేరితే వందల కోట్లు, కేంద్ర దర్యాప్తు సంస్థల నుంచి రక్షణ ఉంటుందని నిందితులు చెప్పిన ఆడియోలు, వీడియోలు వెలుగు చూశాయి. బీజేపీ ప్రతిష్ట మసకబారింది, అయితే .. సంవత్సరం చివర్లో అటు లిక్కర్ కేసు, ఇటు ఎమ్మెల్యేల బేరసారాల కేసు మలుపులు తిరుగుతోంది .. కొత్త సంవత్సరంలో ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో .. ఎక్కడికి చేరుతుందో ..