రోడ్డు ప్రమాదంలో రిషభ్ పంత్ కు తీవ్ర గాయాలు
posted on Dec 30, 2022 @ 10:29AM
శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో టీమ్ ఇండియా క్రికెటర్ రిషభ్ పంత్ తీవ్రంగా గాయపడ్డారు. ఉత్తరాఖండ్ నుంచి ఢిల్లీ వెళుతుండగా రూర్ఖీ వద్ద రిషభ్ పంత్ ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీ కొంది. దీంతో వాహనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో రిషభ్ పంత్ తీవ్రంగా గాయపడ్డాడు.
తొలుత పంత్కు రూర్కీ సివిల్ హాస్పిటల్‌లో ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం డెహ్రాడూన్‌లోని మ్యాక్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పంత్ కు వీపు, నుదురు మీద, కాలికి గాయాలయ్యాయి . కారులో మంటలు చెలరేగుతున్న సమయంలో కారు విండో పగలగొట్టుకుని రిషభ్ పంత్ బయటకు దూకేశాడు. కారు పూర్తిగా దగ్ధమైంది. రిషబ్ పంత్ ఒక్కడే కారు డ్రైవ్ చేసుకుంటూ వెళుతున్నాడు. మంగ్లౌర్ పీఎస్ పరిధిలోని నేషనల్ హైవే-58లో జరిగిన ఈ ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పంత్‌ను రూర్కీలోని సివిల్ ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం రిషభ్ పంత్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. కారు ప్రమాదంలో గాయపడిన రిషబ్ పంత్ త్వరగా కోలుకోవాలని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ట్వీట్ చేశారు. పంత్ కు మెరుగైన చికిత్స అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు పంత్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ పలువురు క్రికెటర్లు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.
టీమ్ ఇండియా వికెట్ కీపర్ గా ఇప్పుడిప్పుడే తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటున్న పంత్ డ్యాషింగ్ బ్యాట్స్ మన్ గా గుర్తింపు పొందాడు. ఇప్పటి వరకూ టీమ్ ఇండియా జట్టుకు 33 టెస్టులు, 30 వన్డేలు, 66 టి20లకు ప్రాతినిథ్యం వహించాడు. టెస్టుల్లో 56 ఇన్నింగ్స్ లో రెండు 2271 పరుగులు చేశాడు. అత్యదిక స్కోరు 159 నాటౌట్. వన్డేల్లో 30 మ్యాచ్ లు ఆడి 865 పరుగులు చేశాడు. ఇక టి20లలో అయితే 66 మ్యాచ్ లు ఆడి 987 పరుగులు చేశాడు.