కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో రిగ్గింగ్?
posted on Oct 19, 2022 @ 3:13PM
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలలో అద్భుతమేమీ జరగలేదు. అనూహ్యమైన ఫలితం ఆవిష్కృతం అవ్వలేదు. అందరూ అనుకుంటున్నట్లుగానే కాంగ్రెస్ అధ్యక్షుడిగా మల్లిఖార్జున్ ఖర్గే విజయం సాధించారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలలో మొత్తం 9,500 ఓట్లు పోలవగా.. ఖర్గేకి 7,897 ఓట్లు వచ్చాయి. మరో అభ్యర్థి శశిథరూర్ కు 1072 ఓట్లు వచ్చాయి. మరో 416 ఓట్లు చెల్లలేదు. ఇక్కడి వరకూ అంతా ఓకే కానీ పరాజయం పాలైన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశిథరూర్ సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలలో రిగ్గింగ్ జరిగిందని ఆరోపించారు.
దీంతో రిగ్గింగ్ సంస్కృతి ఇప్పుడు పార్టీ అధ్యక్ష ఎన్నికలకు కూడా పాకిందా? ఇప్పటిదాకా అసెంబ్లీ, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల కోసం జరిగిన ప్రత్యక్ష ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగినట్లు ఆరోపణలు వచ్చేవి. ఇప్పుడు ఈ జాడ్యం పార్టీ సంస్థాగత ఎన్నికలకు కూడా పాకిందా అన్న సందేహాలు వ్యక్తమౌతున్నాయి. 137 ఏళ్ల చరిత్ర గల గ్రాండ్ ఓల్డ్ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీకి సంస్థాగతంగా జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందంటూ ఈ పదవికి పోటీ పడిన శశిథరూర్ ఆరోపణలు చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఆ పార్టీ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే అత్యధిక మెజారిటీతో గెలిచారు. ఈ పదవికి అక్టోబర్ 17న ఎన్నికలు జరిగాయి. బుధవారం ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ ఎన్నికల్లో 9,500 ఓట్లు పోలవగా.. ఖర్గేకి 7,897 ఓట్లు రాగా.. శశిథరూర్ కు వెయ్యి 72 మంది ఓటు వేశారు. కాగా.. మరో 416 ఓట్లు తిరస్కరణకు గురయ్యాయని కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. శతాధిక కాంగ్రెస్ పార్టీ చరిత్రలో తాజాగా నిర్వహించిన ఎన్నికలతో కలిపి ఇప్పటి వరకూ ఆరుసార్లు ఎన్నికలు జరిగాయి. సుమారు 24 ఏళ్ల తర్వాత గాంధీ కుటుంబానికి చెందని వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ పగ్గాలు దక్కాయి.
ఈ ఎన్నికలో తన అదృష్టాన్ని పరీక్షించుకుని ఓటమి చవిచూసిన శశిథరూర్ ట్విట్టర్ వేదికగా కొత్త అధ్యక్షుడు ఖర్గేను అభినందించారు. ఈ మేరకు ఆయన ఒక సుదీర్ఘ లేఖను విడుదల చేశారు. అంతటితో ఆగకుండా.. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు పారదర్శకంగా జరగలేదని, ఉత్తరప్రదేశ్ లో అత్యంత తీవ్రమైన అవకతవకలు జరిగాయని ఆరోపించడం పార్టీ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘం చైర్మన్ మధుసూదన్ మిస్త్రీకి శశిథరూర్ బృందం రాసిన లేఖ తాజాగా వెలుగుచూసింది.
ఒక పక్కన అధ్యక్ష ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతుండగా శశిథరూర్ తరఫున ఎన్నికల ఏజెంట్ గా వ్యవహరించిన సల్మాన్ సోజ్ ఈ లేఖ రాసినట్లు తెలుస్తోంది. ‘ఉత్తరప్రదేశ్ లో తీవ్ర అవకతవకలు జరిగాయి. ఈ విషయం మిస్త్రీ కార్యాలయం దృష్టికి తెచ్చేందుకు పలుమార్లు ప్రయత్నించాం. కానీ ఫలితం లేకపోవడంతో ఈ లేఖ రాయాల్సి వచ్చింది. యూపీ ఎన్నికల నిర్వహణలో పారదర్శకత, విశ్వసనీయత, సమగ్రత లోపించడం శోచనీయం. ఆ రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియలో ఖర్గే మద్దతుదారులు అక్రమాలకు పాల్పడిన విషయం ఆయనకు తెలియకపోవచ్చు. తెలిస్తే ఆయన అలా జరగనిచ్చేవారు కాదు. యూపీలో బ్యాలెట్ బాక్సులకు అధికారిక సీల్ వేయలేదు. పోలింగ్ కేంద్రాల వద్ద అనధికార వ్యక్తులు కూడా ఉన్నట్లు మా దృష్టికి వచ్చింది. ఈ అవకతవకలపై చర్యలు తీసుకోకపోతే.. ఈ ఎన్నిక ప్రక్రియ స్వేచ్ఛగా.. న్యాయంగా , పారదర్శకంగా జరిగినట్లు ఎలా అవుతుంది? అందువల్ల యూపీలోని ఓట్లన్నీ చెల్లనివిగా పరిగణించాలని మేం డిమాండ్ చేస్తున్నాం’ అని థరూర్ బృందం ఆ లేఖలో పేర్కొన్నదని చెబుతున్నారు.
అయితే.. అంతర్గతంగా రాసిన ఈ లేఖ మీడియాకు లీకవడంతో సల్మాన్ సోజ్, శశిథరూర్ స్పందించారు. సీఈఏకి అంతర్గతంగా రాసిన లేఖ మీడియాకు లీక్ అవడం దురదృష్టకరం. కాంగ్రెస్ ను బలోపేతం చేసేందుకే ఈ ఎన్నిక. విభజించేందుకు కాదు. ఈ విషయంలో సల్మాన్ ఇచ్చిన వివరణతో అనవసర వివాదానికి ముగింపు దొరుకుతుందని ఆశిస్తున్నా’ అని థరూర్ ట్వీట్ చేశారు.