మద్య నిషేధం కాదు.. మద్యపాన ప్రోత్సాహం ఏపీ సర్కార్ విధానం
posted on Dec 24, 2022 @ 2:58PM
ఏపీలో మద్య నిషేధం ఒక కలగానే మిగిలిపోయేలా కనిపిస్తోంది. జగన్ ఎన్నికల సమయంలో మద్య నిషేధం అమలు చేస్తామని హామీ ఇచ్చి మహిళా ఓట్లు దండుకున్నారే కానీ మద్య నిషేధానికి మాత్రం ధైర్యం చేయడం లేదు. విభజిత ఏపీలో ఎన్నికల సమయంలో ఏపీలో మద్య నిషేధాన్ని అమలు చేస్తామని జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు.
పలితంగా మహిళా ఓట్లను అధికశాతం రాబట్టుకోవటంలో సఫలమయ్యారు. వై.ఎస్.జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఏపీలో మద్య నిషేదం అమలవుతుందని అందరూ భావించారు. కానీ ఏపీ ప్రభుత్వం అలాంటి నిర్ణయం ఏమీ ప్రకటించలేదు.
ఒక వైపు పక్కరాష్ట్రం తెలంగాణలో మద్యం విక్రయాల ద్వారా భారీ ఆదాయం సమకూరుతోంది. దీంతో లోటు బడ్జెట్ కలిగిన రాష్ట్రంలో మద్య నిషేధం అమలు జరిపితే ప్రభుత్వ ఆదాయం తగ్గుతుందని ప్రభుత్వం భావించి.. మద్య నిషేధం హామీని పక్కకు పెట్టేసింది.
మద్య నిషేధం అమలు చేయకపోవటంపై ప్రజల నుంచి విమర్శలు ఎదురవ్వడంతో వైసీపీ ప్రభుత్వం.. మద్యం రేట్లు పెంచింది. మద్యం ధరలు పెంచడం ద్వారా మద్యం తాగేవారి సంఖ్య తగ్గుతుందని ప్రభుత్వం చెబుతూ వస్తోంది. మద్యం తాగేవారి సంఖ్య తగ్గడం అటుంచితే.. మధ్య తరగతి, పేద వర్గాలకు చెందిన మందుబాబుల జేబులు గుల్లవుతున్నాయి. అదే సమయంలో కొత్త కొత్త బ్రాండ్ల పేరుతో ఏపీలో సరఫరా చేస్తున్న మద్యంతో ప్రజారోగ్యం కూడా ప్రమాదంలో పడింది.
మరోవైపు విపక్ష నేత చంద్రబాబు నాయుడు మద్య నిషేధంపై ఎలాంటి హామీ ఇవ్వనప్పటికీ.. మద్యం షాపుల్లో రిజర్వేషన్లు తెచ్చి అధికశాతం మద్యాన్ని కల్లుగీత కార్మికులకు దక్కేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇది కొంతలో కొంత మేలే అయినప్పటికీ ఏ పార్టీకూడా మద్య నిషేధం విషయంలో ధైర్యంగా అడుగు ముందుకు వేసే పరిస్థితి అయితే తెలుగు రాష్ట్రాలలో కనిపించడం లేదు. ఎందుకంటే మద్యం మాత్రమే ప్రభుత్వాలకు ప్రధాన ఆదాయ వనరుగా మారింది.
దీంతో మద్య నిషేధం అమలు చేస్తే ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడటంతో పాటు సంక్షేమం కుంటుపడి ప్రజాగ్రహానికి గురౌతామన్నది జగన్ భయంగా కనిపిస్తోంది. మాట తప్పం, మడమ తిప్పం అని చెప్పుకొనే జగన్ ఆదాయం కోసం మద్య నిషేధం సంగతి అటుంచి మద్యపాన ప్రోత్సాహం అనే విధానం అమలు చేస్తున్నారనిపించక మానదు. ఇప్పటికే వచ్చే పాతికేళ్ల మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి అప్పులు చేసిన జగన్ మద్యం ధరలు పెంచి మద్యపానం అలవాటును తగ్గిస్తానని చెప్పడం తాటి చెట్టు ఎందుకు ఎక్కావంటే దూడ మేత కోసం అన్న సామెతను గుర్తుకు తెస్తోంది.