రేవంత్‌రెడ్డి ముందస్తు వ్యూహమే రాళ్ల దెబ్బలు..!
posted on Jul 3, 2021 @ 8:34PM
ఇప్పటివరకు ఒకే ఒక్క నిర్ణయం కోసం ఊపిరి బిగబట్ట మరీ వెయిట్ చేశాడు. ఆ నిర్ణయం వచ్చేసింది. అంతే దూకుడు మొదలైంది. అటు ప్రత్యర్ధులు కూడా అంతే దూకుడుతో ఎదురుదాడి చేస్తున్నారు. అయినా సరే తన ప్రణాళికను తెలివిగా అమల్లోకి తెచ్చేస్తున్నారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ లో తనను వ్యతిరేకించేవారిని కేసీఆర్ చేరదీస్తారనే ముందస్తు ఆలోచన ఉండటంతో.. దానికి బ్రేక్ వేయడానికి ప్రయత్నిస్తున్నారు రేవంత్ రెడ్డి. అందుకే తనదైన స్టయిల్ లో ఘాటైన వ్యాఖ్యలు చేస్తూ.. కాంగ్రెస్ కి ద్రోహం చేసినవారిని వదలొద్దని.. ఎవరైనా పార్టీ మారి టీఆర్ఎస్ లో చేరితే రాళ్లతో కొట్టాలని.. అందుకు తాను సపోర్ట్ చేస్తానని మాట్లాడారు. ఇప్పుడీ కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. తెలంగాణ రాజకీయాల్లోనే కాక.. కాంగ్రెస్ పార్టీలోనే పెద్ద చర్చకు దారి తీశాయి.
టీఆర్ఎస్ నేత బాల్క సుమన్ సైతం గట్టిగా బదులిచ్చారు. రేవంత్ రెడ్డి ఇలా దారుణంగా మాట్లాడతాడని తెలుసని.. అంత దూకుడు పనికిరాదని అన్నారు. ఇక కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లోకి వచ్చిన గండ్ర వెంకటరమణారెడ్డి, సుధీర్ రెడ్డిలు సైతం ఘాటుగా ఎదురుదాడి చేశారు. అలా, రేవంత్ వర్సెస్ అదర్ లీడర్స్ అన్నట్లు తెలంగాణలో పొలిటికల్ హీట్ అంతకంతకూ పెరిగిపోతోంది.
రేవంత్ కు పదవి ఇచ్చినట్లు ప్రకటన రాగానే ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు. ఓటుకు నోటు కేసులా డబ్బులిచ్చి పోస్టు తెచ్చుకున్నారంటూ ఆరోపించారు. కాని తర్వాత కేంద్ర నాయకత్వం సూచనలతోనో ఏమోమరి సైలెంట్ అయ్యారు. కాని కాంగ్రెస్ లోని అసమ్మతి నేతలను లిస్ట్ అవుట్ చేసి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఎలా చేయాలనే ప్లాన్ లో ఇప్పటికే కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. కొందరిని పార్టీలోనే ఉంచి రచ్చ చేయించాలని..మరికొందరిని అవసరమైన చోట బయటకు తెచ్చి టీఆర్ఎస్ లో చేర్చుకోవాలనే ప్రణాళికతో గులాబీ నాయకత్వం ముందుకు పోతున్నట్లు సమాచారం. ఆ సమాచారం తెలిసే రేవంత్ రెడ్డి ఈ రేంజ్ లో స్పందించారని అంటున్నారు.
నాయకులు పోయినా.. కార్యకర్తలు, అభిమానులు చెదిరిపోకుండా ఉండటానికే రేవంత్ రెడ్డి ఇలాంటి వ్యూహం అనుసరిస్తున్నట్లు ఆయన వర్గం చెబుతోంది. లేదంటే ఐడెంటిఫై చేసి మరీ తమ నేతలను డిస్ట్రబ్ చేయడానికి టీఆర్ఎస్ రెడీగా ఉందని..అందుకే రేవంత్ రాళ్ల దెబ్బల వ్యూహాన్ని మొదలెట్టారని సమర్ధించుకుంటున్నారు. చూడాలి మరి.. రేవంత్ దూకుడు వ్యూహం ఫలిస్తుందో... కేసీఆర్ వ్యూహం గెలుస్తుందో..