జగన్‌కు బిగ్ షాక్.. హైకోర్టులో రఘురామ పిల్..
posted on Jul 3, 2021 @ 8:17PM
మామూలుగా లేదు వ్యవహారం. సీఎం జగన్‌ను రఘురామ ఓ పట్టాన వదిలేలా లేరు. యమ అర్జెంట్‌గా సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ ఇప్పటికే సీబీఐ కోర్టులో పిటిషన్ వేశారు. ఆ కేసుపై అక్కడ విచారణ జరుగుతోంది. వాయిదాలపై వాయిదాలు కోరుతూ.. కేసు విచారణను తాత్సారం చేస్తున్నారు జగన్, సీబీఐ తరఫు లాయర్లు. ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ.. జగన్ సాక్షులను ప్రభావితం చేస్తున్నారంటూ రఘురామ వాదిస్తున్నారు. అలాంటిదేమీ లేదంటూ.. తాము ఎలాంటి తప్పులు చేయడం లేదనేది జగన్ న్యాయవాదుల వాదన. రఘురామకు ఈ కేసుతో అసలు ఎలాంటి సంబంధం లేదంటూ లిటిగేషన్స్ పెడుతున్నారు.
మరోవైపు, జగన్ బెయిల్ రద్దుపై సీబీఐ తటస్థ వైఖరితో ఉండటం ఇంట్రెస్టింగ్ పాయింట్. సీబీఐ కోర్టులో కేసు ఆలస్యం అవుతుండటంపై ఎంపీ రఘురామ అసంతృప్తితో ఉన్నారు. సీబీఐ కోర్టులో విచారణ సరిగా కావట్లేదంటూ.. ఈసారి ఏకంగా హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయడం సంచలనంగా మారింది.
జగన్ అక్రమాస్తుల కేసులపై ఎంపీ రఘురామకృష్ణరాజు తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. జగన్ అక్రమాస్తుల కేసులను సీబీఐ, ఈడీ సరిగా దర్యాప్తు చేయడం లేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. దర్యాప్తులో దృష్టికి వచ్చిన అంశాలను వదిలిపెట్టాయని రఘురామ ఆరోపించారు. విచారణలో గుర్తించిన అన్ని అంశాలపై దర్యాప్తు చేసేలా సీబీఐ, ఈడీని ఆదేశించాలని ఎంపీ రఘురామ హైకోర్టును కోరారు.
వదల జగన్ అంటూ రఘురామ ఏపీ సీఎం బెయిల్ రద్దు కోసం ఇలా గట్టిగా ప్రయత్నిస్తుండటంతో ముఖ్యమంత్రికి మనశ్శాంతి కరువవుతోందని అంటున్నారు. ఓవైపు సీబీఐ కోర్టులో వేగంగా విచారణ జరుగుతుండగా.. మరింత పకడ్బందీగా దర్యాప్తు చేయాలంటూ రఘురామ ఏకంగా హైకోర్టుకు వెళ్లడంతో జగన్‌రెడ్డిలో కలవరపాటు పెరిగిపోతోందని చెబుతున్నారు. ఇప్పటికే కస్టడీలో టార్చర్‌పై దేశవ్యాప్తంగా జగన్ ఇమేజ్‌ను బాగా డ్యామేజ్ చేశారు రఘురామ. అక్కడితో వదిలేయకుండా పార్లమెంట్ సమావేశాల్లో సీఎం జగన్‌ను దోషిగా నిలబెట్టాలని చూస్తున్నారు. సీఐడీ చీఫ్‌నూ కేంద్ర హోంశాఖ ముందు ఇరికించారు. చేస్తున్నవి చాలవన్నట్టు.. ఇప్పుడు సీబీఐ, ఈడీ దర్యాప్తులపై తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఇలా.. నలువైపుల నుంచి జగన్‌రెడ్డిని కట్టడి చేస్తూ.. బెయిల్ రద్దుకు తీవ్రంగా ప్రయత్నిస్తుండటంతో ముఖ్యమంత్రికి ముచ్చెమటలు పడుతున్నాయని అంటున్నారు. గోటితో పోయే వ్యవహారాన్ని.. రఘురామతో పెట్టుకొని అనవసరంగా గొడ్డలి దాకా తీసుకొచ్చామని బాధపడుతున్నారట వైఎస్ జగన్.