రేవంత్‌రెడ్డి ‘రచ్చబండ’.. మూడుచింతలపల్లిలో ముచ్చట..
posted on Aug 25, 2021 @ 11:04AM
సీఎం కేసీఆర్ దత్తత గ్రామాన్నే ఎంచుకున్నారు. నేరుగా కేసీఆర్‌నే టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి మాటలకు, చేతలకు అసలేమాత్రం సంబంధం ఉండదని నిరూపిస్తున్నారు. ఎక్కడో గాంధీభవన్‌లో ఉండి ఆ విషయం చెబితే ప్రజల్లోకి సరిగ్గా వెళ్లకపోవచ్చు. అందుకే, నేరుగా సమస్య ఉన్నచోటికి వెళ్లారు. సీఎం కేసీఆర్ దత్త గ్రామం మూడుచింతలపల్లిలో పీసీసీ చీఫ్ రెండు రోజులుగా మకాం వేశారు. కేసీఆర్ చెప్పిన కల్లబొల్లి మాటలకు.. వాస్తవ దుస్థితికి ఎంత తేడా ఉందో ప్రత్యక్షంగా పరిశీలించారు. యావత్ తెలంగాణకు ఆ సంగతి తెలిసొచ్చేలా చేశారు.
మంగళవారం మూడుచింతలపల్లిలో దళిత, గిరిజన ఆత్మగౌరవ దీక్ష చేపట్టారు. దీక్ష అనంతరం సభ నిర్వహించి కేసీఆర్ సర్కారుపై విరుచుకుపడ్డారు. గ్రామంలోని ఇండ్లన్నీ కూల్చేసి.. గ్రామస్తులకు నిలువనీడ లేకుండా చేశారని మండిపడ్డారు. కట్టిస్తానన్న డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు ఏమయ్యాయని నిలదీశారు. ఆ సందర్భంగా అక్కడి వారి అవస్థలకు కన్నీళ్లు కూడా పెట్టారు రేవంత్‌రెడ్డి. ఫైర్‌బ్రాండ్ లీడర్‌గా గుర్తింపు ఉన్న రేవంత్‌రెడ్డి.. అలా కన్నీళ్లు పెట్టడం మూడుచింతలపల్లిలోని దారుణ పరిస్థితులకు నిదర్శణం.
మంగళవారం రాత్రి అదే గ్రామంలోని దళితవాడలో నిద్ర చేశారు. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి సింప్లిసిటీకి స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. ఇక బుధవారం మూడుచింతలపల్లిలో కాంగ్రెస్ దళిత, గిరిజన ఆత్మగౌరవ దీక్ష రెండో రోజుకు చేరింది. రెండో రోజు ఉదయం రచ్చబండ నిర్వహించారు. దళితవాడలో సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తొలుత కాలనీ అంతా కలియ తిరిగి అక్కడికి పరిస్థితులను పరిశీలించారు. పలువురు దళితులు తమ గ్రామ సమస్యలను రేవంత్‌రెడ్డి ముందు ఏకరువు పెట్టారు. ప్రభుత్వ పథకాలు అందుతున్న తీరును ఆయన అడిగి తెలుసుకున్నారు.
ఇందిరమ్మ కాలనీలో ఇళ్లలోకి వర్షపు నీరు వస్తోందని.. కాలనీలో రోడ్డు ఎత్తుగా వేయడం వల్లే ఈ సమస్య ఏర్పడిందని కాలనీవాసులు రేవంత్ దృష్టికి తీసుకెళ్లారు. పింఛన్లు, డబుల్ బెడ్‌రూం ఇళ్లు, మూడెకరాల భూమి, ఉద్యోగాలు, పట్టాదారు పాసు పుస్తకాలు తదితర అంశాలపై ఆయన అడిగి తెలుసుకున్నారు. అనంతరం మేడ్చల్ మల్కాజిగిరి కలెక్టర్ హరీశ్‌కు ఫోన్ చేసి మూడుచింతలపల్లి స్థానిక సమస్యలను వివరించారు. తక్షణమే సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని రేవంత్‌రెడ్డి కోరారు.