ఏపీలో ‘రివర్స్ బడ్జెటింగ్’.. లంక దినకర్ సంచలన ఆరోపణలు...
posted on Aug 25, 2021 @ 11:21AM
లంక దినకర్. ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్. లెక్కల్లో ఎక్స్‌పర్ట్. మాటల్లో పర్‌ఫెక్ట్. ఆయన ఆరోపించారంటే.. అందులో వాస్తవం ఉండే ఉంటుంది. ఏపీ సర్కారు బడ్జెట్ లెక్కల్లో లొసుగులు ఉన్నాయని ఆయన చెప్పారంటే.. ఉన్నాయన్నట్టే. అంత పక్కాగా ఉంటాయి లంక లెక్కలు. అంతే సూటిగా, ఘాటుగా కూడా ఉంటాయి ఆరోపణలు. తాజాగా ఆయన ఏపీలో "రివర్స్ బడ్జెటింగ్" గురించి సంచలన ఆరోపణలు చేసి.. కొత్త చర్చ లేవనెత్తారు.
ఏపీలో ఆర్థిక నిర్వాహణ "రివర్స్ బడ్జెటింగ్" లా ఉందని బీజేపీ నేత లంకా దినకర్ ఆరోపించారు. రాష్ట్ర వార్షిక బడ్జెట్ నుండి కార్పొరేషన్లకి కేటాయింపులుంటాయని.. కానీ, ఏపీలో కార్పొరేషన్ అప్పుల నుంచి బడ్జెట్‌లో పేర్కొన్న వ్యయానికి ఖర్చు చేస్తున్నారని అన్నారు.
కార్పొరేషన్ అప్పులను బడ్జెట్ కేటాయింపుల వ్యయం కోసం చెల్లింపులు చేయడం ఆర్థిక మౌలిక సూత్రాలకు వ్యతిరేకమని లంక దినకర్ తెలిపారు. బడ్జెట్ వ్యయాన్ని బడ్జెట్ వసూళ్ల నుండి మాత్రమే కన్సలిడేటెడ్ ఫండ్ ద్వారా చెల్లింపులు చేయాలన్నారు. బడ్జెట్ అప్పులు ఎఫ్.ఆర్.బి.ఎం పరిధిలో చేయాలని.. కాని కార్పొరేషన్‌లో బడ్జెట్‌లో ఆదాయాన్ని చూపి రాష్ట్ర ప్రభుత్వం అప్పులు తెచ్చి ఫండ్ డైవర్షన్ చేస్తోందని మండిపడ్డారు. ఇటువంటి పరిస్థితుల్లో కార్పొరేషన్ అప్పులు కూడా బడ్జెట్‌లోని అప్పులకు కలిపి ఎఫ్.ఆర్.బి.ఎం పరిధిలో ఉన్నాయో లేదో చూడాలని లంకా దినకర్ అన్నారు.