టీఆర్ఎస్ లో కసబ్ ఉన్నాడట..!
posted on Oct 8, 2021 @ 7:47PM
తెలంగాణ రాజకీయాలను హీటెక్కిస్తున్న కరీంనగర్ జిల్లా హుజురుబాద్ ఉప ఎన్నికలో ప్రచారం పర్వం హోరెత్తుత్తోంది, నామినేషన్ల ఘట్టం ముగియడంతో అన్ని పార్టీలు మరింత స్పీడ్ పెంచాయి. తమ ప్రసంగాల్లో తీవ్రత పెంచారు లీడర్లు, వ్యక్తిగత దూషణలతో పాటు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. సంచలన ఆరోపణలతో కాక రేపుతున్నారు.
తన పంచ్ డైలాగులతో హోరెత్తించే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. ఉప ఎన్నికల షెడ్యూల్ తర్వాత తొలిసారి హుజురాబాద్ పర్యటించారు. తమ పార్టీ అభ్యర్థి బల్మూర్ వెంకట్ నామినేషన్ కార్యక్రమానికి హాజరైన రేవంత్ రెడ్డి,, సంచలన ఆరోపణలు చేసి రాజకీయాన్ని హీటెక్కించారు. గతంలో కాంగ్రెస్ లో ఉండి ఇటీవలే టీఆర్ఎస్ లో చేరిన కౌశిక్‌రెడ్డిపై రేవంత్‌రెడ్డి పరోక్షంగా మండిపడ్డారు. టీఆర్ఎస్‌లోకి పోతే పదవి వస్తుందని అనుకున్నారని రేవంత్‌రెడ్డి చెప్పారు. పదవీ రాలే.. పైసలు కూడా రాలేదని రేవంత్‌రెడ్డి సెటైర్లు వేశారు. హరీష్‌రావు, ఈటల ఇద్దరూ తోడు దొంగలేనని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. ఈటల వందల కోట్లు, కేసీఆర్ వేల కోట్లు సంపాదించారని ఆరోపించారు.
గత శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ తరపున హుజురాబాద్‌లో కౌశిక్‌రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. ఎమ్మెల్యేగా గెలిచిన ఈటల రాజేందర్ తన పదవికి రాజీనామా చేయడంతో హుజురాబాద్‌లో ఉప ఎన్నికలు వచ్చాయి. అయితే తనకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం రాదేమోనని భావించిన కౌశిక్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్‌లో చేరారు. టీఆర్ఎస్‌లో చేరగానే కౌశిక్‌రెడ్డిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా సీఎం కేసీఆర్ నామినేట్ చేసారు. అయితే గవర్నర్ అభ్యంతరాల ఎమ్మెల్సీ పదవి పెండింగ్‌లో ఉంది.