కాంట్రాక్టర్లకు చిప్పే గతి.. జగనన్న పాలనలో వెరైటీ!
posted on Oct 8, 2021 @ 7:28PM
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారైంది. సంక్షేమ పథకాల పేరుతో అడ్డగోలుగా ఖర్చు చేస్తోంది వైసీపీ సర్కార్. ప్రతి నెలా అప్పులు తెచ్చి మరీ పంపకాలు చేస్తోంది. దీంతో ఉద్యోగులకు వేతనాలు ఇవ్వడానికి కూడా నిధుల కటకటే. ఉద్యోగులకే వేతనాలు లేనప్పుడు కాంట్రాక్టర్ల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడమే కష్టం.
నిజానికి గత రెండున్నర ఏండ్లుగా ఏపీలో అభివృద్ధి పనులేవి సాగడం లేదు. చిన్న చితకా పనులు తప్ప, అయితే ఆ పనులు చేసిన కాంట్రాక్టర్లకు కూాడా బిల్లులు ఇవ్వడం లేదు. దీంతో లక్షలాది రూపాయలు ఖర్చు చేసిన కాంట్రాక్టర్లు,, ఇప్పుడు రోడ్డున పడ్డారు. ఏపీలో కాంట్రాక్టర్ల దుస్థితిపై నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు స్పందించారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏపీ పరిస్థితి దిగజారిపోయిందని, చేసిన పనికి డబ్బులు రాక కాంట్రాక్టర్లు రాష్ట్రంలో ఆందోళన చేస్తున్నారని అన్నారు. ‘మేము కాంట్రాక్టర్లం.. మా బిల్లులు చెల్లించండి, మా ప్రాణాలు కాపాడండి, ఆస్తులు కరిగాయి, అప్పులు పెరిగాయి’ అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారని, చిప్పతో ఆర్ధిస్తున్నారని అన్నారు.
గత ప్రభుత్వంలో కంపెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజింగ్ సిస్టం ఉండేదని, ఇప్పుడు ఆ వ్యవస్థను జగన్ ప్రభుత్వం తుంగలో తొక్కిందని రఘురామ ఆరోపించారు. కాంట్రాక్టర్లకు డబ్బులివ్వకుండా గత ప్రభుత్వం హాయంలో చేసిన పనులకు, ఈ ప్రభుత్వానికి సంబంధం లేదంటున్నట్లు తెలిసిందన్నారు. రేపు వచ్చే ప్రభుత్వం కూడా ఇదే మాట అంటే పరిస్థితేంటని రఘురామ ప్రశ్నించారు. ఎన్నికల్లో ఉద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని రఘురామ ప్రభుత్వానికి సూచించారు.
ఉద్యోగులంతా ఆందోళనకు దిగితే పరిస్థితి చేయిదాటిపోతుందన్నారు రఘురామ. కాలేజీలకు బకాయిలు చెల్లించలేదని, రేపో మాపో వారు కూడా నిరసనకు దిగే అవకాశముందన్నారు. రాష్ట్ర పరిస్థితి ఇలానే ఉంటే.. ఏపీ దివాళా తీస్తుందన్నారు. బిహార్, ఒరిస్సాలను చూసి పాలన నేర్చుకోవాల్సి ఉంటుందని రఘురామ వ్యాఖ్యానించారు.