రూ. 300 కోట్ల నోట్ల కట్టలు.. హెటిరోలో భారీగా బ్లాక్‌మనీ..!
posted on Oct 9, 2021 @ 10:46AM
లీడర్ సినిమా చూశారుగా. సేమ్ టు సేమ్ అలాంటి సీన్లే. ఓ ఫ్లాట్‌లో మొత్తం కట్టలకు కట్టలు నోట్ల కట్టలు. కబోర్డ్స్ నిండా కరెన్సీ నోట్లు. బెడ్ కింద మొత్తం నోట్ల కుప్పలు. సినిమాలో జస్ట్ ఒక్క ఫ్లాట్‌లో మాత్రమే డబ్బులు ఉంటాయి. కానీ, ఇక్కడ వేరు వేరు ప్రాంతాల్లో ఉన్న నాలుగు ఫ్లాట్స్‌లో ఇలా నోట్ల కట్టలను దాచారు. అచ్చం సినిమాటిక్‌గా ఉన్న ఈ సీన్స్.. హెటిరో డ్రగ్స్ కార్యాలయాల్లో ఐటీ రైడ్స్ సందర్భంగా వెలుగుచూశాయి. తెలంగాణ, ఏపీలో మూడు రోజుల పాటు జరిగిన సోదాల్లో.. దాదాపు 300 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. ఇదంతా లెక్కల్లో చూపని సొమ్ము కావడంతో.. ఇంత బ్లాక్ మనీ ఎక్కడిదనే దిశగా ఐటీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే ఈడీ సైతం రంగంలోకి దిగనుందని తెలుస్తోంది.
హెటిరో డ్రగ్స్ కార్యాలయాలు, ప్లాంట్లు, ల్యాబ్స్, డైరెక్టర్ల ఇళ్లలో జరిగిన సోదాల్లో రూ. 300 కోట్ల దాకా నగదును గుర్తించినట్లు సమాచారం. ఒక సంస్థ కార్యాలయాలపై జరిపిన దాడుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఇంత పెద్దమొత్తంలో నగదు లభ్యమవ్వడం ఇదే మొదటిసారి అని ఐటీ శాఖ అధికారులు చెబుతున్నారు. నగదుతో పాటు స్థిర చరాస్తులు, డాక్యుమెంట్, బ్యాంకు లావాదేవీలు.. ఇలా చాలా అంశాలపై అసెస్‌మెంట్ జరగాల్సి ఉంది.
తెలంగాణ, ఏపీ సహా.. ముంబై తదితర ప్రాంతాల్లో మొత్తం 30 చోట్ల దాడులు జరిగాయి. ఈ దాడులు సైతం సినిమాటిక్ స్టైల్‌లోనే నిర్వహించారు. హెటిరోపై రైడ్స్ ప్రారంభించేదాకా ఈ సోదాల్లో పాల్గొన్న చాలా మంది ఐటీ సిబ్బందికి విషయం తెలియదట. మంగళవారం ఉదయమే హైదరాబాద్‌లోని ఆయ్‌కార్ భవన్, విశాఖలోని ప్రాంతీయ కార్యాలయంలో సీఐయూ, పలువురు జోనల్ ఇన్‌స్పెక్టర్లకు ఉన్నతాధికారులు మెసేజ్ పెట్టారట. బిగ్ ఫిష్‌ను పట్టుకోవడానికి భారీ సెర్చ్ ఆపరేషన్ చేయాలని చెప్పారట. 300 మంది ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్లు, ఇతర అధికారులు, సిబ్బందిని ఒక్కచోటికి చేర్చాక.. 40 ఎస్‌యూవీల్లో ఎక్కడి వారు అక్కడికి వెళ్లారు.
బుధవారం ఉదయం ఉన్నతాధికారుల ఆదేశాలు రాగానే.. సనత్‌నగర్‌లోని హెటిరో ప్రధాన కార్యాలయం, చౌటుప్పల్, గుండ్లపోచంపల్లి, విశాఖలోని నక్కపల్లి, ముంబై తదితర ప్రాంతాల్లోని హెటిరో ప్లాంట్లు, ప్రాంతీయ కార్యాలయాలు, డైరెక్టర్ల ఇళ్లు, కార్యాలయాలపై ఏకకాలంలో దాడులు ప్రారంభమయ్యాయి. నాలుగు రోజులుగా సిబ్బంది ఈ దాడుల్లో నిమగ్నమయ్యారు. రూ.300 కోట్లకు పైగా నగదు పట్టుబడగా.. ఆ మొత్తం సొమ్ము ఎక్కడిది? ఇంత భారీ మొత్తంలో నగదును ఎలా సేకరించగలిగారు? హవాలా మనీనా? బ్యాంకులూ సహకరించాయా? అనే కోణంలో దర్యాప్తు సాగిస్తున్నారు. .
హెటిరో కార్యకలాపాలపై ఐటీశాఖ ఆర్నెల్లుగా నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. కొవిడ్ సెకండ్‌వేవ్ సమయంలో ఫుల్ డిమాండ్ ఉన్న రెమిడెసివిర్ ఇంజక్షన్లు హెటిరో డ్రగ్స్ తయారు చేసినవే కావడంతో భారీగా బిజినెస్ జరిగింది. ఆ తర్వాత హెటిరో కంపెనీ కొవిడ్‌కు టోసిలిజుమాబ్‌ను తీసుకువచ్చింది. కొవిడ్ సోకి ఆస్పత్రుల్లో వెంటిలేటర్‌పై ఉండే సీరియస్ రోగులపై స్టెరాయిడ్స్ పనిచేయని పరిస్థితుల్లో టోసిలిజుమాబ్ సంజీవనిలా పనిచేస్తుంది. ఇలా కొవిడ్ టైమ్‌లో కోట్లలో వ్యాపారం చేసిన హెటిరో డ్రగ్స్.. ఆ మేరకు లావాదేవీలను రికార్డ్స్‌లో చూపించకపోయేసరికి ఐటీ అధికారులకు అనుమానం వచ్చింది. నెలల తరబడి నిఘా వేసి.. ఇప్పుడు సడెన్‌గా హెటిరోపై రైడ్స్ చేశారు. కానీ, ఇంత భారీ మొత్తంలో నగదు దొరుకుతుందని ఐటీ అధికారులు సైతం ఊహించి ఉండరు. క్యాషే 300 కోట్లు ఉంటే.. ఇక మిగతా స్థిరచరాస్తులు ఇంకెన్ని ఉన్నాయో.. అనే దిశగానూ దర్యాప్తు చేస్తున్నారు.